Thursday, April 24, 2025

 సేవతో జీవన సాఫల్యం!

అవతార మూర్తుల కాలంలో జీవిస్తూ వారి బోధనలను ఆచరించగలిగిన వారికి పరిణామమూ, ముక్తి సులభ సిద్ధమౌతాయి. సాధనా మార్గంగా, యోగత్రయీ లక్షణంగా స్వామి ప్రవచించి, ప్రబోధించి, ప్రసారించిన సేవ మున్నెన్నడూ ఏ జాతీ అందుకోని భౌతిక-ఆధ్యాత్మిక దివ్య మార్గం, వేవేల సందర్భాల్లో స్వామి ఉదోషించిన సేవా మార్గం నిజానికి శ్రేయో మార్గం. వ్యక్తిగత స్థాయి నుంచీ సామూహిక స్థాయిలో సర్వ ప్రపంచాన్నీ ఏకం చేసిన సర్వోత్తమ అనుష్ఠాన వేదాంత భూమిక... సేవ!

వ్యక్తి స్థాయిలో సేవ అహంకార నిర్మూలనకు దివ్యాస్త్రం, సేవా మార్గంలో మాత్రమే మమకారం అపరిమిత, అనంత ప్రేమగా పరిణామం చెందుతుంది. స్త్రీ, బాల, వృద్ధులకు మాత్రమే కాక, సమస్త మానవ జాతికీ స్వామి అందించిన సందేశ, ఆదేశ, ఉపదేశాలు మానవుణ్ణి మానవుడిగా జీవించమన్న విస్పష్ట బోధకు సంకేతాలు. మతం కేవలం మార్గమే. అధ్యాత్మే గమ్యం! అందువల్ల మానవుడు అధ్యాత్మ జీవితాన్ని జీవించాలి. స్వామి ప్రబోధం వ్యక్తి మీద కలిగించే ప్రభావం తీవ్రంగా ఉంటుంది. స్వీయ సాధనలో సాధకుడు ముందుగా తనను తాను సంస్కరించుకొని, సాధనను ఎందరితోనో కలిసి సాగిస్తూ, తీవ్రతరం చేసుకోవాలి. ఏ దివ్య ప్రేమ ద్వారా స్వామి సమస్త ప్రపంచంలో పరదైవతంగా సుప్రతిష్ఠులయ్యారో అదే విధంగా సాధకుడు సైతం అనురాగ బంధాలను దాటి ప్రేమ బంధాన్ని స్వంతం చేసుకోవాలి. అసమానత, అసమగ్రత సమాజంలో రెండు పార్వాలు వీటి మధ్య అగాధం పెరగకుండా సేవాభావంతో అడ్డుకోవాలి. ప్రచారం వదుల్చుకొని, ప్రసారగత జీవన విధానం అలవాటు చేసుకోవాలి. భగవంతుడి మాటను ఆజ్ఞగా భావించాలి.

"అందరికీ ఆనందాన్ని అందించి, దారి తప్పిన వారికి సన్మార్గం చూపించి, ఆ దారిలో వారిని నడిపించి, దారిద్య్ర్య బాధను తప్పించి, మానవుడికి తనలో మాధవుణ్ణి దర్శించగల దృష్టిని అలవాటు చేసి, సన్మార్గ బంధువుగా వెలగడమే నా లక్ష్యం!" అని ప్రకటించిన స్వామి తదనుగుణంగానే ఈ ప్రపంచంలో సంచరించారు. ఇవ్వటం నేర్చుకోవాలి. ఇవ్వటంలో వున్న అనందాన్ని ఎవరికి వారు అనుభవంలోకి తెచ్చుకోవాలి. అడగటం, పొందటం నెమ్మదించాలి. అవి దీనత్వానికి గుర్తులు. దయ, సానుభూతి, జాలి వంటి మానవతా లక్షణాలను నిరంతరం పరిపోషించుకోవాలి. నాగరికతా దర్పణమైన సమాజాన్ని గమనిస్తూ విలువలను పాటిస్తూ, సంఘ పురోగమనంలో క్రియాశీలంగా వుండాలి. పరులను బాధించే ఆలోచనలను సైతం వదులుకొని, సదా సేవాకృతులుగా మెలగాలి. పరమాత్మతో కలిసి జీవించిన జీవితమే జీవితం. అటువంటి జన్మ మనందరకూ లభించింది. ప్రతిక్షణమూ పరిణామం చెందే అవకాశం దొరికింది. స్వామి అవతారానికి పరిసమాప్తి లేదు. అదొక అవిచ్చిన్న. అఖండ, అమృతానందమయ కరుణా ప్రవాహం. రాబోయే కాలమంతా స్వామిమయమే. పరమానందప్రదమే. మనం, రాబోయే సర్వకాలాలకూ మార్గదర్శనం చేయగల స్థాయిలో మన యాత్రను కొనసాగించాలి. స్వామి చెప్పవలసినదంతా చెప్పారు. చేయటమే మనకు మిగిలిన కర్తవ్యం. సిరితోపాటు హరి, సుఖంతోపాటు సుముఖం, శాంతం, ఆనందం, హాయి, తృప్తి స్థిరమయ్యే రీతిలో మన కార్యకలాపాలు సాగాలి. అనంత ప్రేమధారా సమన్విత జీవనగమనమే స్వామి ఆరాధనగా రూపు దాల్చాలి!

..

No comments:

Post a Comment