💚 *మూడు జీవిత పాఠాలు* 💚
చాలా కాలం క్రితం, దక్షిణాన అద్భుతమైన రాజ్యానికి ఒక గొప్ప రాజు ఉండేవాడు. రాజుకు ముగ్గురు కుమారులు. తన కుమారులు రాజ్య పగ్గాలు చేపట్టడానికి సిద్ధంగా ఉండడానికి తగిన విద్యను వారికి అందించాలని అతనికి అర్థమైంది.
ఈ ఆలోచనతో, రాజు తన ముగ్గురు కొడుకులను సభకి పిలిచి, “ప్రియమైన కుమారులారా, మన రాజ్యం వెలుపల ఒక (పియర్) బేరీ పండు చెట్టు ఉంది. ఒకొక్కరూ నాలుగు నెలల వ్యవధిలో ఆ చెట్టును వెతికి, ఆ చెట్టు ఎలా ఉంటుందో తెలుసుకొనిరావాలి", అని చెప్పాడు.
రాజు ఆజ్ఞను అందుకున్న వెంటనే, రాజకుమారులు రాజు అడిగిన విధంగా 4 నెలల వ్యవధిలో ఒక్కొక్కరుగా (పియర్) బేరి చెట్టును వెతుక్కుంటూ వెళ్లారు.
రాజకుమారులందరూ వారి అన్వేషణ పూర్తిచేసుకొని రాజ్యానికి తిరిగి వచ్చారు, వారి పరిశీలనలను తెలుసుకోవడానికి రాజు వారిని మళ్లీ సభకు పిలిచాడు.
పెద్దకొడుకు ఇలా చెప్పాడు, “తండ్రిగారు, చెట్టు ఎండిపోయి, వంకరగా ఉంది. పూర్తిగా నిర్జీవంగా కనిపించింది!"
".. కానే కాదు. చెట్టు నిర్జీవంగా లేదు, ఆకులతో నిండి ఉంది, కానీ ఆ చెట్టు మీద ఒక్క పండు కూడా లేదు,” అంటూ రెండో కొడుకు అడ్డుకున్నాడు.
అప్పుడు మూడవ కొడుకు ఇలా అన్నాడు, “సోదరులారా, మీరిద్దరూ తప్పు చెట్టును చూశారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే తండ్రిగారు వెతకమని చెప్పిన (పియర్) బేరి చెట్టు అనేకమైన ఫలాలతో నిండి, అద్భుతంగా ఉంది!”
కొద్దిసేపటికే కొడుకులందరూ తమలో తాము వాదించుకోవడం మొదలుపెట్టారు.
ఇదంతా చూసిన రాజు సింహాసనం నుండి లేచి, “కుమారులారా, ఈ వాదన దేనికి? మీరందరూ మీ పరిశీలనలలో సరైనవారే.
నేను ఉద్దేశపూర్వకంగానే మీ ముగ్గురిని *ఒకే చెట్టు కోసం వేర్వేరు ఋతువులలో వెతకడానికి పంపాను. మీరు చూసినదంతా ఆ ఋతువు యొక్క ఫలితమే.*
కాబట్టి, ఇప్పుడు చెప్పండి, ఈ అనుభవం నుండి మీరు ఏమైనా నేర్చుకున్నారా?" అని అడిగాడు.
రాకుమారులు అయోమయంగా చూసి, లేదు అని అడ్డంగా తల ఊపారు. రాజు సమాధానం కోసం ఎదురుచూస్తూండగా, వారిలో ఒకరు, "అంటే, (పియర్) బేరి చెట్లు పండ్లు కాయడానికి నాలుగు నెలలు పడుతుందని అర్థమా?" అని అడిగాడు.
ఈ సమాధానానికి రాజు పకపకా నవ్వాడు. అప్పుడు, అతను చిరునవ్వుతో, ప్రశాంతంగా ఇలా అన్నాడు, "*ఈ అనుభవం నుండి మనం మూడు జీవిత పాఠాలను నేర్చుకోవచ్చు* అని మీరందరూ అంగీకరిస్తారని నేను భావిస్తున్నాను:
ముందుగా, *ఒక వస్తువు లేదా ఒక వ్యక్తి గురించి ఏదైనా ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవాలంటే, కొంత సమయం వరకు వేచి ఉండి, గమనించాలి.*
రెండవది, (పియర్) బేరిచెట్టు *వివిధ ఋతువులలో విభిన్నంగా కనిపించినట్లే, జీవితం దాని విభిన్న దశలలో కూడా భిన్నంగా కనిపిస్తుంది. జీవితంలో హెచ్చు తగ్గులు మానవ జీవితంలోని వివిధ దశలు మాత్రమే. కష్టతరమైన దశలో ఉన్నప్పుడు, జీవితంలో ఏదీ స్థిరంగా ఉండదు కాబట్టి ఆ సమయంలో ధైర్యం, సహనం అవసరం. సమయం మారినప్పుడు, ఆ దశలు కూడా దాటిపోతాయి.*
చివరగా, *ఒకరి స్వంత దృక్పథం గురించి మాత్రమే మొండిగా ఉండకుండా ఇతరుల అభిప్రాయాలకు కూడా విలువనివ్వడం ఒక విస్తృత దృక్పథాన్ని కలుగజేస్తుంది.*
*శ్రద్దగా వినేవాడు నేర్చుకుంటాడు, విననివాడు నేర్చుకోవడం మానేస్తాడు!*
*జీవితం వాతావరణం లాంటిది, ఇది ఎల్లప్పుడూ మారుతూ ఉంటుంది. మనం వర్షంలో చిక్కుకుపోతే, అది వాతావరణం తప్పు కాదు; అందుకు సిద్ధంగా ఉండాల్సిన బాధ్యత మనమీదే ఉంటుంది......దాజీ*
No comments:
Post a Comment