Sunday, April 20, 2025

 🔔 *సరదాగా..* 🔔

*మాగాయ ఆవకాయ మధ్య గల భేదము ఏమిటని అడిగారు*. మహాత్ములు ఇలా చెప్పారు😌

                        *మాగాయ:-*

భార్యా బిడ్డలు భవబంధాలు అన్నీ త్యజించిన విరాగిలా లోపలి టెంకను, బయటి తొక్కనూ "తొక్కలే" అని వదిలించుకుని....

అరణ్యాలకో హిమాలయాలకో పోయిన సాధకుని లాగా ఆరుబయటకో డాబా మీదకో పోయి...

పంచాగ్నుల మధ్య తపస్సును చేసిన మునిలా సూర్యాగ్నిలో ఎండి... 

సిద్ధిని పొందిన ఋషిలా  ముక్కలు  ఎండి స్థిరత్వాన్ని పొందాక...

బయటకు నిర్లేపుడు, నిర్మోహుడులా కనిపించినా అంతరాంతరాలలో మాత్రం  
నరుల పట్ల  కరుణను కలిగిన నవనీత హృదయుడైన అవధూతలా...
బయటకు ఎండిపోయి రంగుమారి గట్టిగా ఒరుగై పోయినా లోపల మాత్రం మామిడికాయ రుచినంతా దాచుకుని... 

అరిషడ్వర్గాలతో అల్లాడుతున్న మానవుల ఉద్ధరణ కోసం తను వదిలిపెట్టిన సమాజంలోకి మళ్ళీ తానే ప్రవేశించిన యతిలా,  తను విడిచి వెళ్లిన ఊటలోకి మళ్ళీ తానే దూకి,

మఠం పెట్టిన స్వామీజీ శిష్య గణాన్ని, భక్త జనులనూ కలుపుకున్నట్లు
ఉప్పూ కారం మెంతిపిండీ, ఆవపిండి తదితరాలను కలుపుకుని...

ఆ స్వామీజీ ప్రవచనాలు, మంత్రోపదేశాలూ, శక్తిపాతాలూ లాంటి   విశేషాలతో విరాజిల్లినట్లుగానే...
నూనె, ఇంగువ, కరివేపాకు వంటి తిరగమోత విశేషాలతో తానూ గుబాళిస్తూ...

'మానవసేవే మాధవసేవ' అని మనుషుల్లో కలిసిన మహర్షి లాంటిది మాగాయ!


                     *ఆవకాయ:-*

"సాధన చేయటానికి ఆలుబిడ్డలను త్యజించక్కరలేదు, వారితో కలిసే సాధన మార్గంలో పయనిస్తా" అనుకునే వివాహితునిలా...తొక్క  టెంకె ఏవీ త్యజించకుండా.. పైగా వాటినీ తనతో పాటు పచ్చడి మార్గంలో ప్రవేశపెట్టి,

"సిద్ధిని పొందటానికి ఎక్కడెక్కడికో పోనక్కర్లేదు" అనుకుని పూజా మందిరంలోనే ధ్యానం చేసుకునే గృహస్థులా...
ఇంట్లో నీడ పట్టునే ఉండి, ఉన్న బేసిన్లోనే ఉప్పూ కారం, నూనె, ఆవపిండి , మెంతిపిండి కలుపుకుని, 

బంధు మిత్ర పరివార గణాన్ని కలుపుకుపోతూ వారి సహకారం తాను అందుకుంటూ, వారికీ తన సద్గుణాలు  నేర్పిస్తూ సన్మార్గంలో ముందుకు పోయే సద్వ్యక్తిలా... 
తనతోపాటు  శనగలు, వెల్లుల్లి వంటి వాటినీ కలుపుకుని, వాటికి తన రుచినీ తనకు వాటి రుచినీ ఆపాదించుకుంటూ ...

"నేను నేనుగానే ఉండి,   ఉన్నచోట నుండే సాధన చేసి మానవసేవా, మాధవసేవ రెండూ చేయగలను"  అని....
చతుర్విధ పురుషార్థాలనూ గృహస్థాశ్రమం ద్వారానే సాధించి చూపించే సంసారి లాంటిది ఆవకాయ.
🙏🙏🕉️


*అయ్యా! ఆధ్యాత్మిక మార్గంలో ఇతి మార్గం, (న+ ఇతి) నేతి మార్గం అని చదివాను. ఏమీ అర్ధం కాలేదు. కాని ఆవకాయ, మాగాయి ఉదాహరణలతో మొత్తం బ్రహ్మజ్ఞానం అంతా కరతలామలకం అయిపోయింది. ధన్యోస్మి మహాప్రభో ధన్యోస్మి.  


🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

No comments:

Post a Comment