🔷కందుకూరి వీరేశలింగం గారి జయంతి.....
తెలుగు నాటకరంగం దినోత్సవం🔷
నాటకం అనేది ఒక శ్రవణ సహిత దృశ్య రూపకం.అతి ప్రాచీనమైన ప్రదర్శక కళల్లో ప్రధాన మైంది నాటకం. నట అన్న పదం నాట్యంలోంచి పుట్టింది, నట అంటే అభినయం, నర్తనం అన్న అర్థం నాట్య శాస్త్రంలో చెప్పబడింది. నాట్య రూపకం (Dance Ballet) అతిప్రాచీనమైన ప్రదర్శక కళల్లో ప్రధానమైంది. ఈ నాట్య రూపకాల్లోంచే కాలక్రమేణా నాటకం పుట్టింది. కాబట్టి నాట్య శాస్త్రంలోంచి పుట్టింది నాటకం అని పెద్దల ఉవాచ.
నాటకం చూసే ప్రేక్షకులు, నాటకం ప్రదర్శించే నటులు, నాటకం ప్రదర్శించబడే రంగస్థలం…
ఈ మూడు సమాజంలోనివే కాబట్టి నాటక ప్రయోజనం కూడా సమాజానికి వేయిరెట్లు మేలు చేసేదైఉంటుంది. పురాణ పాత్రలు ఆనాటి సమాజంలోని సత్య, నీతి నియమాలను ఏ విధంగా పాటించాయో, ఈనాటికీ ఆయా పాత్రలను మనం ఎందుకు పూజనీయం గా భావిస్తున్నాము వారు ఏర్పరిచిన దారులు ఈనాటి కే కాక రాబోయే తరాలకు కూడా ఏ విధంగా బంగారు బాటలు అవుతాయో తెలియజేస్తాయి పౌరాణిక నాటకాలు.
ఇక పద్య నాటకం అంటే బంగారానికి మంచి గంధం వాసన లాంటిది. సుమారు వెయ్యి సంవత్సరాల పైన చరిత్ర కలిగి ప్రాచీన భాష హోదా పొందిన తెలుగు భాష ఈనాటికీ ప్రజల మధ్యలో సజీవంగా నిలబడటానికి ప్రధాన కారణాలలో పద్య నాటకం మొదటి కారణం. పద్య నాటకం ప్రదర్శించడం వల్ల చూడటం వల్ల పామరుడు కూడా పండితుడయ్యాడు నిరక్షరాస్యులైన నటుడికి, ప్రేక్షకుడికి వయోజన విద్యలాంటిది పద్యనాటకం. పద్యనాటకంలో సాహిత్యం సంగీతం తో పాటు వినిపిస్తుంది కాబట్టి సంగీత ప్రియులకు సాహిత్యాన్ని మంచిగా అందిస్తుంది పద్య నాటకం.
తెలుగు నాటకరంగానికి వందల ఎళ్ల చరిత్ర....
తెలుగు నాటకరంగానికి వందల ఎళ్ల చరిత్ర ఉన్నది. పదహారవ శతాబ్దంలో ప్రారంభమైన నాటక ప్రక్రియను చిందు భాగవతం,యక్షగాన నాటకం, వీధి భాగవతం, బయలాట అనీ పిలుస్తారు. వీధి నాటకాలను ఎక్కువ ప్రచారంలోకి తెచ్చినవారు కూచిపూడి భాగవతులు. కాకతీయుల కాలంలో ప్రదర్శించిన క్రీడాభిరామం కూడా నాటకమే. నన్నయ్య తన భారత అవతారికలో రసాన్విత కావ్యనాటకముల్ పెక్కుజూచితి అనడాన్ని బట్టి, నన్నయ కాలానికి నాటక ప్రదర్శనలుండేవని అర్ధం చేసుకొవచ్చు.1860 ప్రాంతాల్లో వెలువడిన తొలి తెలుగు నాటకం మంజరీ మధుకరీయం రచయిత కోరాడ రామచంద్ర శాస్త్రి లాంటి వారు ఆధునిక నాటక రచనకు ఆద్యులు. ఆధునిక నాటక ప్రదర్శన ఆరంభ దశకు రూపకర్తలైన వారందరిలోకెల్లా అగ్రగణ్యుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారే.
కందుకూరి వీరేశలింగం వ్యావహారిక భాషలో రాసిన వ్యవహార ధర్మబోధిని తొలిసారిగా ప్రదర్శించబడిన తెలుగు నాటకం. 1880 లో వీరేశలింగం గారు నాటక సమాజాన్ని స్థాపించి రత్నావళి, చమత్కార రత్నావళి అనే రెండు నాటకాలను ప్రదర్శించారు. తెలుగు నాట తొలి నాటక సమాజాన్ని స్థాపించిన ఘనత కూడా వీరేశలింగం గారిదే. వీరి స్వతంత్ర రచన వ్యవహార ధర్మబోధిని, సంస్కృత నాటక అనువాదమైన రత్నావళి, ఆంగ్ల నాటక అనుసరణ అయిన చమత్కార రత్నావళి ప్రదర్శనా భాగ్యం పొందిన తొలి తెలుగు నాటకాలు. వీరేశలింగం పంతులు గారి పుట్టిన రోజైన ఏప్రిల్ 16ను తెలుగు నాటక రంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
నవ్యతా ప్రయోక్త, సంస్కర్త, శతాధిక గ్రంథకర్త కందుకూరి వీరేశలింగం పంతులు సాహితీ ప్రీతితో, సంస్కరణ దృక్పథంతో స్పృశించని శాఖలేదు.. చేపట్టని ప్రక్రియలేదు. ఆయన ప్రజ్ఞ బహుముఖాలుగా విస్తరించింది. ఆంధ్ర సాహిత్యంలో కవుల చరిత్రలు, జీవిత చరిత్రలు, స్వీయ చరిత్ర, శాస్త్ర వాజ్మయాది ప్రక్రియలన్నింటికీ ఆద్యులయ్యారు. సాహిత్యాన్ని ఆయన సంఘ సంస్క రణకు ఉపకరణంగా చేసుకున్నారు. ఆనాటి సంఘంలో గూడు కట్టుకొన్న మూఢాచారాలను పారద్రోలారు.*
తెలుగు నాటకరంగం దినోత్సవ నేపథ్యం...
తెలుగు నాటకరంగానికి వీరేంశలింగం కృషి గణ నీయమైంది. 19వ శతాబ్దిలో బాల్యవివాహాలు, మూఢనమ్మకాలు, కన్యాశుల్కం, అంటరానితనం, వేశ్యావృత్తి వంటి దురాచారాలు సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. అప్పట్లో సామాజిక చైతన్యంతో, సంస్కరణ దృక్పధంతో ప్రజల్ని చైతన్యవంతులను చేసేందుకు శ్రవ్యకావ్యాల కంటే నాటకాలు శక్తివం తమైనవన్న ఆలోచనతో వీరేశలింగం 16 నాటకాలను రచించారు.
వీరేశలింగంగారి నాటకాల్లో బ్రాహ్మ వివాహం, వ్యవహార ధర్మబోధిని, అభిజ్ఞాన శాకుంతలం, సత్యహరిశ్చంద్ర, రత్నావళి వంటివి ప్రసిద్ధాలు. బ్రాహ్మ వివాహం నాటకం ఆయనకు మంచి పేరును తెచ్చింది. ఈ నాటకంలో ముక్కుపచ్చలారని బాలికను, కన్యాశుల్కానికి ఆశపడి ముసలివాడికిచ్చి పెళ్లి చేయడాన్ని అధిక్షేపించారు. ముసలివాళ్ల పెళ్లి ఆశను అవహేళన చేసి ప్రేక్షకుల కళ్లు తెరిపించారు. డబ్బు కక్కుర్తితో కన్యాశుల్కానికి ఆశపడి పిల్లల జీవితాలను నాశనం చేసే తల్లిదండ్రులను, పెళ్లిళ్ల పేరయ్యలను తీవ్రంగా నిరసించారు. వీరేశలింగంకి పేరు తెచ్చిన మరో నాటకం వ్యవహార ధర్మబోధిని. ఈ నాటకంలో న్యాయాధికారుల అవినీతిని, న్యాయవాదుల మోసాలను, వాదిప్రతివాదుల దుశ్చర్యలను బట్టబయలు చేశారు.
తెలుగు నాటకరంగం దినోత్సవంపై 2000లో పెద్ది రామారావు యవనిక త్రైమాసిక పత్రిక ద్వారా చర్చలు జరిగాయి. ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో మాదిరి తెలుగు నాటకరంగం దినోత్సవం ఏర్పాటు చేసుకోవడం అవసరం అన్న ఆలోచన నాటకరంగ కళాకారులు, విమర్శకుల్లో కలిగింది. వ్యవహారిక భాషలో నాటకాలు రాసిన తొలి నాటకకర్త, తొలి దర్శకుడు, తొలి ప్రదర్శనకారుడు, నాటక సమాజ స్థాపకుడైన వీరేశలింగం జయంతిని ఏప్రిల్ 16న తెలుగు నాటక రంగం దినోత్సవంగా ఏర్పాటు చేయాలని నాటకరంగం ప్రముఖులంతా ఏకాభి ప్రాయానికి వచ్చారు. కొన్ని నాటక రంగం సంస్థలు 2001 నుంచి వీరేశలింగం జయంతిని తెలుగు నాటకరంగం దినోత్సవంగా జరిపారు.
ప్రభుత్వం అధికారికంగా....
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు డాక్టర్ కేవీ రమణాచారి నాటక కళాకారుల అభిమతం మేరకు వీరేశలింగం జయంతిని తెలుగు నాటకరంగం దినోత్సవంగా గుర్తించాలని 2007 మార్చిలో ప్రస్తావించారు. వైఎస్సార్ వెంటనే స్పందించి 2007 మార్చిలో వీరేశలింగం దినో త్సవాన్ని ఏప్రిల్ 16వ తేదీని తెలుగు నాటకరంగం దినోత్సవంగా ప్రకటిస్తూ ఉత్వర్తులు జారీ చేశారు. 2007 ఏప్రిల్ 16న ప్రభుత్వం అధికారికంగా తొలిసారిగా తెలుగు నాటకరంగ దినోత్సవాన్ని నిర్వహించింది. వివిధ సంస్థల ఆధ్వర్యంలో నాటక ప్రదర్శనలు, సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. నాటక రంగంలో విశేష కృషి చేసిన కళాకారులకు సన్మానాలు, జిల్లా, రాష్ట్రస్థాయి పురస్కారా లతో సత్కరించాలని తీర్మానించారు.
ప్రముఖ నాటక కళాకారుల జయంతి, వర్ధంతులను నిర్వహించి ప్రజల్లో నాటకకళ పట్ల ఆసక్తి పెంచాలన్న లక్ష్యంతో తెలుగు నాటకరంగ దినోత్సవం ఆవిర్భ వించింది. కరోనా తగ్గిన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వాలు నాటక రంగ దినోత్సవాలు వైభవోపేతంగా నిర్వహించగలవని ఆశిద్దాం..!
🔷💐🌹🌺🌷💐🔷
Collected by
Dr.A.Srinivasa Reddy
No comments:
Post a Comment