Monday, April 21, 2025

 🙏 *మీ నిధిని పరిశీలించుకోండి....కథ*🙏

 ఈ జీవన ప్రయాణంలో మనం మన దృష్టిని ఎక్కడ ఉంచాలి..ఎక్కడ ఉంచుతున్నాం...

ఒకసారి ఇద్దరు వ్యక్తులు ప్రయాణం చేస్తూ, ఆ ప్రయాణంలో వారు ఒకరినొకరు కలుసుకున్నారు, మాటల్లో ఇద్దరిదీ ఒకే గమ్యస్థానం అని తెలుసుకున్నారు, అందువల్ల  కలిసి ప్రయాణించడం ప్రారంభించారు. ఏడు రోజులు కలిసి ప్రయాణం చేసిన తరువాత, ఇద్దరూ తమ దారిన తాము వెళ్ళే సమయం వచ్చినప్పుడు, 
ఒకతను ఇలా అన్నాడు," అన్నా! మనం ఒక వారం పాటు కలిసి ఉన్నాం, నేను ఎవరో మీరు గుర్తించారా?" 
రెండో ప్రయాణికుడు , "లేదు, నేను గుర్తించలేదు." అన్నాడు. 
 మొదటి ప్రయాణికుడు ఇలా అన్నాడు: "సోదరా, నేను ఒక పేరుమోసినదొంగను, కానీ నువ్వు నాకంటే గొప్ప దొంగవి. ఎందుకంటే ప్రతీసారి నువ్వు నాకంటే పది అడుగులు ముందున్నావు."
 రెండవ ప్రయాణికుడు "అలా ఎలా?" అని అడిగాడు.
 మొదటి ప్రయాణికుడు : "నీవద్ద ఏదైనా దొరుకుతుందనే ఆశతో నేను ఏడు రోజులు నుండి నీ వెంటవుండి వెతుకుతూనే ఉన్నాను, కానీ ఏమీ కనుగొనలేకపోయాను. ఇంత సుదీర్ఘ ప్రయాణంలో, మీరు మీతో ఏమీ తీసుకువెళ్ళడం లేదు, అది ఎలా సాధ్యం? మీ వద్ద ఏమిలేదు, పూర్తిగా ఖాళీగా ఉన్నారు!" అన్నాడు.
 అది విన్న రెండవ ప్రయాణికుడు: "నా దగ్గర విలువైన వజ్రం, కొన్ని వెండి నాణేలు ఉన్నాయి”, అన్నాడు.
ఇది విని, మొదటి ప్రయాణికుడు ఆశ్చర్యంతో " అవునా! అలా అయితే, నేను ఎంత ప్రయత్నం చేసినప్పటికీ వాటిని ఎందుకు కనుక్కోలేకపోయాను?" అని అడిగాడు.
 రెండో ప్రయాణికుడు నవ్వుతూ ఇలా జవాబిచ్చాడు: "నేను ఎప్పుడు బయటకు వెళ్లినా ఆ వజ్రం, నాణేలను మీ బ్యాగ్ లో పెట్టేవాడిని, మీరు నా బ్యాగ్‌ ని ఏడు రోజుల పాటు పరిశీలిస్తూ, జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. నా బ్యాగ్‌ ని చూసుకోవాల్సిన అవసరమే నాకు రాలేదు. కాబట్టి మీకు ఏమైనా ఎలా దొరుకుతుంది?" 

*ప్రతీ మనిషి యొక్క సమస్య ఇదే.  నేడు, ఏ వ్యక్తీ తన స్వంత ఆనందంతో సంతోషంగా లేడు, కానీ ఇతరుల ఆనందం చూసి బాధ పడుతున్నాడు. ఎందుకంటే అందరి కళ్ళు ఎల్లప్పుడూ ఇతరుల సంచులపైనే ఉంటున్నాయి కాబట్టి !!*

భగవంతుడు ఎల్లప్పుడూ కొత్త ఆనందాన్ని మన సంచిలోనే ఉంచుతాడు, కానీ మన స్వంత సంచిని చూసుకునే సమయం మనకు లేదు! ఇది ప్రతి ఒక్కరికీ ఉన్న ప్రధాన సమస్య. మనిషి ఎదుటవారిని చూడటం మానేసిన రోజు, అన్ని సమస్యలు ఆ క్షణంలోనే పరిష్కరించబడతాయి.
 మీ వద్దనే ఉన్న స్వంత నిధిని గమనించుకోండి!  జీవితంలో విలువైన మంత్రం ఏమిటంటే మిమ్మల్ని మీరు అన్వేషించుకుంటూ జీవిత మార్గంలో ముందుకు సాగడమే, విజయం మీ కోసం వేచి ఉంది.
              
               
*మనల్ని మనం శుద్ధి చేసుకోవాలంటే, మన ప్రవర్తనకి, సంస్కృతికి విరుద్ధంగా ఉన్న మన అలవాట్లను, భావాలను సరిదిద్దుకోవాలి. అలాగే పరిపూర్ణతను చేరుకోవడానికి మన ధోరణులను మెరుగుపరచుకోవడం కూడా అవసరం........లాలాజీ*🙏

No comments:

Post a Comment