Sunday, April 20, 2025

 *అరవిరిసిన అమాయక అడివి మల్లి అంతరంగం.*

*ఇదిగో నిన్నేనయ్యా .............*

*నువ్వు పనికోసం పట్టం పోయి ఒక్కరోజే ,అయినాది !!* *నాకేందోనయ్య సానా* *దినాలయినట్టున్నాది ... !!*
*ఎవరు పలకరించినా ఉలుకు లేదు పలుకు లేదు .. “” ఓ అమ్మి యాంది అయినాదే అని అత్తమ్మ అరుత్తాంది ...*
*వట్టి కట్టే ఈడ ఉన్నాదయ్య ..*
*మనసంతా నికాడే ఉందయ్య .*
*ఏందోనయ్య నా ఉసులు బాసలు ఎవురికి సేప్పుకోను . దిగులు గుందయ్య ,, గుబులు గుబులుగా ..*
*దిక్కు తోచట్లేదే .. ఎంత గురుతు ఒత్తన్నావంటే  ఎంతని సెప్పను .*

*నిన్న మధ్యాన్నం వేడి బువ్వలో కుసింత వెన్న వేసి నిరుడు మా యమ్మ పంపిన మామిడి పచ్చడి ఓ ముక్కేసుకుని ,, వేడి వేడి గా ముద్దనోట్లో ఎట్టానా . ఒకటే ఎక్కిళ్ళు ‘ నువ్వు నన్ను తలిసినావని నవ్వుకున్నాలే .*

*నువ్వు లేకపోతే గుడిసె సిన్న బోయిందయ్య ..ఉరపిచుక ఉలుకే లేదు .. పామురాయి పలకరింపే లేదు*
*కౌజు పిట్టల కువ కువలు లేవు . రామసిలక కిల కిలలు లేవు ముద్ద మందారం ముడుసుకుపోనాది .*
*నిదరమ్మ జాడలేదయ్య ..నిన్న రేయల్లా నిదర రాక ఏటి గట్టునే కూకున్న ,, నిజం నీమీదొట్టు .*

  *పొద్దు పొద్దునే నువ్వోత్తవని తెలిసి,, గుడిసే౦తా అలికినా .* *మెలికల ముగ్గులు పెట్టినా .*
 *సమురు బుడ్డి తుడిసినా . నులక మంచం నారతో అల్లినా . ఉట్టిలో దాసిన వెన్న కరగెట్టినా .’’ సుబ్బయ్య కొట్లో సన్న బియ్యం  కందిపప్పు అప్పుతెచ్చినా .. నికిట్టమని సిక్కటి పాలుబోసి పరమాన్నం బువ్వ ఓండినా . ముద్దపప్పు సేసినా .ఎర్రఆవు పాలు తీసి ఏడి ఏడిగా కాసినా.*

 *‘’ పుట్టతేనే కాత్త  మచ్చ ఆవుపాలు కాత్త  శనగపిండిలో కలుపుకుని ఒల్లంతా నలుగు పెట్టుకుని గల గల పారుతున గోదాట్లో ఏటి సానం చేసినా  . ఇదేందో ఈ రోజు పొద్దుగాలే వాన మొదలయింది ..’’ పొద్దునే వచ్చిన వాన పొద్దు గూకి వచ్చిన చుట్టం పోరంట మాయమ్మ సెప్పిందిలే .*

*ఇదిగో అబ్బాయ్  అప్పుడేప్పుడో నూకాలమ్మ జాతరలో కొన్నావే ‘’  నల్ల అంచుతో తెల్ల చీర అదే కట్టినా ‘’ ఎరుపు రవిక తోడిగినా ...  తెల్ల సిరకు నీ ఒంటి రంగుకు తేడాలేదంటావుగా ‘’ ..ఇదిగో అబ్బాయ్  నీ దిట్టి తగలకుండా దిట్టి సుక్కు కుడా ఎట్టినా ( హ హ హ ... దిట్టి పెట్టమాక అంటే బుంగ మూతి పెడతవే ... ఆ బుంగ మూతి సూసి బుగ్గకోరికి నవ్వేసుకుంటా ) ఏమి తోచక  ఏటి ఒడ్డున కొబ్బరి చెట్టు కింద కూసున్నా .’’  కొబ్బారాకులను సూరు నుండి  వర్షం నీళ్ళు ఒక్కో బొట్టు ఒంటి మీద జారిపోతుంటే ‘’ అదేంటో నువ్వేసిన గురుతులు గుర్తుసేత్తావు౦ది .*

          *గోదారోడ్దోన ఇసుక మేటల్లో    నువ్వు నేను పరుగులు తీసిన  అడుగుల సప్పుళ్ళు  , చిలిపి నవ్వులు గురుతోత్తన్నాయి . ఏట్లో తానాలు సెత్తూ గల గల పారే నీళ్ళు దోసిల్లో ఎట్టుకుని నీ ఎడదంతా తడిపేత్తూ ,, తడిసిన కోక తనువంతా సుట్టేత్తంటే నీ సూపులు యడేడో గుచ్చేతంటే .. యాడను౦డి వచ్చిందో సిగ్గమ్మ ‘’ వరదల్లా  సుట్టేసింది ..*

                            *అదిగో ......గోదారి అవతలి ఒడ్డులో ఆ పాపికొండల  మాటున ఎప్పుడు మొలిసిందో అడివి మల్లె సెట్టు ’’ రావి సెట్టంత పెద్దగా ’’  ఆటలు పాటలతో పక పక నవ్వులతో రొప్పు అర్చుకు౦టు కూసేపు మల్లె పందిరి మాటున ఎన్నెల దుప్పటి పరుసుకుని నువ్వు నేను ............. ఓ .......... దూరంగా కనబడతనయ్యే ఆ నచ్చత్రాలను లేక్కేసుకుని .. జోరున కొడుతున్న ఏటిగాలి సెగలు పుట్టిస్తూ  ..*

*అప్పుడే రాలిపడ్డ అడివిమల్లిని ఏరుకుంటు దోసెట నిండా పోసుకుని ఆడనే ఇసుకలో దొరికిన తామరతూడుతో మాల కట్టుకుని జడనిండా పెట్టుకుంటే ‘’ అడవి మల్లెలా ఉన్నవని అన్నవులే’’ “ రేయంతా గుసగుసలే .. ఎన్నెలమ్మ ఏడెక్కి మబ్బులమాటుకు బోయి మూతి ఇరుస్తాంది .మల్లె పందిరి నవ్వుకు౦టు మల్లెపూల వాన కురిపిస్తు .. నువ్వు .....నేను ... నేను .. నువ్వు......*

*నీకు నాకు మధ్యన చిరుగాలికి కుడా సోటివ్వవు .. వట్టి కుళ్ళు మోతువు నువ్వు  హ. హ.హ. హ.  ..నీతోడుగా ఉంటే పగలు తెలియదు రేయి తెలియదు . పేణం అంటే యాడు౦టాదో తెలియదయ్య .. కాని  నా కంటికి కనిపించే  నా పేణం నువ్వేనయ్య ...*

*మేడలు వద్దు .. మిద్దెలు వద్దయ్య ..*
*నువ్వు తోడుగా ఉంటే సద్దన్నం చాలయ్య ...*

*అదిగదిగో దూరంగా .......... మామ వస్తు౦డు .........ఉమ*

No comments:

Post a Comment