💚 *విలువైన* *బహుమతి*💜
ఈరోజు నా పుట్టినరోజు. అతిథులను స్వాగతించడంలో నా భార్య,పిల్లలు నిమగ్నమై ఉన్నారు. నా స్నేహితులు, కొంతమంది బంధువులు వారి కుటుంబాలతో వచ్చారు. టేబుల్‌ను అలంకరించారు. రంగురంగుల బెలూన్‌లను చూసి పిల్లలు ఆనందంగా, ఉల్లాసంగా ఉన్నారు. చుట్టూ రంగుల బహుమతుల ప్యాకెట్లు ఉన్నాయి. అందరూ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. టేబుల్ మీద పెద్ద కేక్ అలంకరించబడి ఉంది.నేను మాత్రం చాలా సంవత్సరాల వెనక్కి వెళ్లి, కేవలం 12-13 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పటి, నా జ్ఞాపకాలలో మునిగిపోయాను.
నగరంలోని ఓ చెట్టుకింద కూర్చొని దారిన వెళ్లే వారి దగ్గర డబ్బులు అడుక్కునేవాడిని. సాయంత్రం అయ్యేసరికి నాకు, అమ్మకి తిండి పెట్టడానికి సరిపడా డబ్బు వచ్చేది.
ఒకరోజు నగరానికి కొత్తగా వచ్చినట్లనిపించిన ఒక పెద్దమనిషి అటునుండి వెళ్తూండడం గమనించాను. అతను తన కార్యాలయానికి కాలినడకన వెళ్లేవాడు. నేను అతని వైపు పరిగెత్తాను, ముకుళిత హస్తాలతో పలకరించాను, భిక్ష అడగడానికి నా చేతులు చాచాను.పెద్ద మనిషిలా అనిపించడం వలన కొంత ఎక్కువ డబ్బు ఇస్తాడని ఆశించాను ..... కనీసం ఇరవై రూపాయలైనా ఇస్తాడనుకున్నాను.
కానీ అలా జరగలేదు. అందుకు భిన్నంగా నేను అడుక్కోవడానికి చేతులు చాచడం ఆయనకు అస్సలు లేదని అతని భావవ్యక్తీకరణ ద్వారా స్పష్టమైంది. అయినా నా అరచేతిలో ఐదు రూపాయల నాణెం వేశాడు.
ఒకట్రెండు రోజులు ఆయన దగ్గరకు వెళ్లి డబ్బులు అడిగినా ఏమీ మాట్లాడలేదు. అతను నా చేతిలో రెండు నుంచి ఐదు రూపాయలు మాత్రమే పెట్టేవాడు. కానీ నేను అడుక్కోవడం ఏమాత్రం నచ్చలేదన్న విషయం అతని ముఖకవళికలలో స్పష్టంగా గోచరించింది.
ఒకరోజు కోపం వచ్చి నన్ను దారుణంగా తిట్టాడు. "అడుక్కోవడానికి నీకు సిగ్గు లేదా! నువ్వు ఆరోగ్యంగా, బాగానే ఉన్నావు, తిండి సంపాదించుకోవడానికి కష్టపడాలి, నీలాగా అందరూ అడుక్కోవడం మొదలుపెడితే, దేశంలో ఎవ్వరూ సంపాదించరు. *మన దేశంలోని బిచ్చగాళ్లందరూ పనిచేస్తే, అప్పుడు మన ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది",* అన్నాడు.
ఆ పెద్దమనిషి మొహంలోని కోపాన్ని పసిగట్టిన నేను నిశ్శబ్దంగా తలవంచుకుని వెనక్కి నా చెట్టు వద్దకు వచ్చాను. ఇప్పుడు ఇంక అతను నాకు డబ్బు ఇవ్వడం మానేశాడు, నేను కూడా అతని వద్దకు పరుగెత్తటం మానేశాను. నేను చెట్టు నీడలో కూర్చునుంటే, ఆ పెద్దమనిషి కూడా నా వైపు చూస్తూ వేగంగా వెళ్ళిపోయేవాడు.
ఒకరోజు ఆయనే స్వయంగా నా దగ్గరకు వచ్చి నా పక్కన కూర్చుని నా యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మంచి మూడ్ లో ఉండటం వల్ల, ఇరవయ్యో, యాభయ్యో ఇస్తాడేమోననుకున్నాను. కానీ లేదు....బదులుగా ఒక ప్యాకెట్ ఇచ్చి, "ఈ రోజు, నేను నీ కోసం ఒక బహుమతి తెచ్చాను" అన్నాడు.
నేను ప్యాకెట్ తెరిచి చూసాను, అది బరువు చూసుకునే యంత్రం.
"ఇక నుండి నువ్వు అడుక్కోవాల్సిన అవసరం లేదు. చాప వేసి, ఈ యంత్రాన్ని ముందు పెట్టుకుని, కూర్చో.. జనం వచ్చి, వారే బరువు చూసుకుని, ఐదు రూపాయలు ఇస్తారు. దీనితో నీవు భిక్ష కోసం ఎవరి ముందు చేతులు చాచాల్సిన అవసరం ఉండదు, నీ కష్టార్జితంతోనే ఆహారం సంపాదించుకుంటావు" అని వెళ్తూ,వెళ్తూ చిరునవ్వుతో నా చెంప మీద మెత్తగా తట్టాడు. నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
ఇప్పుడు ఆ పెద్దమనిషి రోజూ నా దగ్గరకు రావడం మొదలుపెట్టాడు. నేను ఎలా ఉన్నాను ,రోజుకు ఎంత డబ్బు సంపాదిస్తున్నాను ఇలా అన్నీఅడిగేవాడు. ‘ డబ్బు పొదుపు చేసుకో, నీ పెళ్లికి ఉపయోగపడుతుంది’ అంటూ నవ్వుతూ చమత్కరించేవాడు.
మెల్లగా డబ్బు ఆదా చేయడం మొదలుపెట్టాను. ఆ పొదుపు చేసిన డబ్బుతో టీ దుకాణం తెరిచాను. నా వ్యాపారం పెరిగింది, నేను గౌరవప్రదమైన జీవితాన్ని గడపడం ప్రారంభించాను.
ఈ రోజు నాకు కావలసినవన్నీ నా వద్ద ఉన్నాయి - సంతోషకరమైన కుటుంబం, చాలా డబ్బు, కారు, మంచి స్నేహితులు ... ఇలా ప్రతిదీ, దేనికీ లోటు లేదు.
అయితే ఆ పెద్దమనిషి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదుగానీ.. నెలరోజుల్లోనే వేరే ఊరికి బదిలీ అయిపోయాడని మాత్రం తెలుసు.
"పుట్టిన రోజు శుభాకాంక్షలు !" అని అందరూ పాడుతూండగా, ప్రస్తుత క్షణానికి తిరిగి వచ్చాను. కొవ్వొత్తులను ఊది, నేను కేక్ కట్ చేసాను. అందరూ బహుమతులు ఇచ్చారు, కానీ నా జీవితాన్ని మార్చివేసిన ఆ విలువైన బహుమతిని నేను గుర్తుచేసుకుంటున్నాను. ఆ బహుమతి నన్ను ఈ రోజు నేను ఉన్న స్థితికి తీసుకువచ్చింది.
ఆ పెద్దమనిషి ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ.. ఎక్కడ ఉన్నా వందలాది మందికి మార్గనిర్దేశనం చేస్తూ, అందరికీ కొత్త దారి చూపుతాడనే నమ్మకం నాకుంది. నా చుట్టుపక్కల వాళ్లందరిని చూస్తూ నేను నవ్వుతూంటే, ఆయన్ను గుర్తు చేసుకుని నా కళ్లు చెమర్చాయి.
*మన సోదర సోదరీ మణులను ప్రోత్సహించడం, ప్రేరేపించడం మన బాధ్యత. మానవజాతిలో ఒక్క భాగమైనా విఫలమైతే మనం మాత్రం ఎలా విజయం సాధించినట్లు? ....దాజీ*
హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం 💌
HFN Story team
No comments:
Post a Comment