Tuesday, April 22, 2025

 *ఐదు "వ" కారలతో పూజ్యత*
~~~~

“వస్త్రేణ వపుషా వాచా విద్యయా వినయేన చ
వ కారైః పంచభిర్యుక్తః  నరో భవతి  పండితః ”

ఒక వ్యక్తి  సమాజంలో గౌరవింపబడాలంటే  ఐదు  "వ" కారాలుండాలని  చెప్తోంది ఈ శ్లోకం. 

అవి - 1.వస్త్రధారణ   2.శరీరపోషణ (వపుషా)  3.సంభాషణ  (వాచా ) 4.విద్య   5.వినయం.

*మొదటిది - వస్త్రధారణ*

ధరించిన వస్త్రాలను బట్టి  వ్యక్తిని విలువ కట్టటం  మంచిది కాదని తెలిసినా, మన ప్రథమవీక్షణం ఎదుటివాడు ధరించిన వస్త్రాలపైనే  ప్రసరిస్తుంది. ఆ వస్త్రధారణం  మనకు నచ్చితే  అసంకల్పితంగా  ఒక సానుకూల భావన అతనిపట్ల ఏర్పడుతుంది. నచ్చకపోతే అయిష్టభావన ఏర్పడుతుంది. కొందరు  చూపరులను  రెచ్చగొట్టే విధంగా  వస్త్రధారణ చేస్తూ ఉండటం, దానివల్ల కొన్ని అనర్థాలు  జరుగుతూ ఉండటం మనకు తెలుసు. ఎలాంటి బట్టలు కట్టుకోవాలనేది  ఎవరికి వారు  నిర్ణయించుకోవటం  నూటికి నూరుపాళ్ళు న్యాయమే  అయినా, సభ్యతను , వ్యవస్థను దృష్టిలో ఉంచుకోవాలి.  “తగిన వేషము” సర్వదా శ్రేయస్కరం.

*రెండవది - శరీర పోషణ*

ఆరోగ్యం, ఆకర్షణ, సభ్యత అనేవి శరీరపోషణకు  ఆంతర్యాలు. ఆరోగ్యం  బాగానే ఉన్నా  దర్శనీయత  లోపిస్తే  ఇబ్బంది. కనీసం ఎదుటివాడికి రోత పుట్టించని విధంగా  శరీరాన్ని ఉంచుకోవాలి. వికారచేష్టలు , దుర్వాసనలు  మొదలైనవి  ఎదుటివారికి  వెగటు  పుట్టిస్తాయి.  పదిమందిలో ఉన్నప్పుడు  కొన్ని శారీరక బలహీనతలను , ఎదుటివారికి  అసహనాన్ని కలిగించే  వైఖరులను  నియంత్రించుకోవాలి.

*మూడవది - మాటతీరు*

ఇంటా,బయటా గౌరవింపబడాలంటే  ప్రతి మాటనూ ఆచి తూచి మాట్లాడాలి.

“ప్రియవాక్య ప్రదానేన సర్వే తుష్యంతి జంతవః
తస్మాత్తదేవ వక్తవ్యం  వచనే కా దరిద్రతా  ? ”- 

ఒక మంచి మాట మాట్లాడితే   సర్వులూ సంతోషిస్తారు. అందువల్ల  ప్రియభాషలే మాట్లాడాలి. మాటలకు  దారిద్ర్యంలేదుకదా !అని ఈ శ్లోకభావం. నోరు మంచిదైతే  ఊరు మంచిదౌతుందనే  సామెత ఉంది కదా !

*నాల్గవది  - విద్య*  

“విద్వాన్ సర్వత్ర పూజ్యతే” విద్యావంతుడు ఎక్కడైనా పూజింపబడుతాడు.

విద్యావంతుడు  దుర్జనుడైతే  వాడిని దూరంగా ఉంచాలి. వాడు తలమీద మణి ఉన్న  సర్పంలాంటివాడని  పెద్దలు చెప్పారు. అందువల్ల అహంకార, కుసంస్కార దూషితం కాని  విద్యాతేజస్సు మాత్రమే  వందనీయం.

*ఐదవది - వినయం*

విద్యాతత్త్వం  గ్రహించిన వాడే వినయసంపదను పొందగల్గుతాడు.“ఉద్ధతులు గారు బుధులు సమృద్ధిచేత ” అన్నాడు భర్తృహరి. ఎన్ని సంపదలున్నా అహంకరించక వినయశీలాన్ని పోషించుకొనేవాడు  అందరిచేతా ఆదరింపబడుతాడు.

Whatsapp Channel PANCHANGAM

No comments:

Post a Comment