జయంతి నివాళి.. కందుకూరి అనంతం (కరుణకుమార) -- బహుముఖ ప్రజ్ఞాశాలుల లో మన తెలుగు వారెందరో ఉన్నారు. వీరందరూ సమాజానికి విశిష్ట సేవలందించినవారే. ఐతే వీరిలో చాలామంది గురించి మన ముందుల తరాలవారికి తెలియడంలేదు. ఇటువంటి వారిలో కందుకూరి అనంతం ఒకరు. తెలుగువారి గ్రామీణ జీవనాన్ని, దళిత సమస్యలని కథావస్తువుగా తీసుకుని పేదరైతుల దయనీయ జీవిత గాథలను కరుణరసభరితంగా రచించి జనాల్లో కరుణకుమార అనిపించికున్నారు. ఈయన ప్రసిద్ధ కథకులు నటులు గాయకులు ఇంకా గాంధేయవాది కూడా. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఈయన స్వస్థలం.. జననం 1901 ఏప్రిల్ 17న.. రెవెన్యూ శాఖ ఉద్యోగి. పదవీ విరమణ పరిమితి కాలం యాభై ఐదే కావడం వలన 1956 ఏప్రిల్ లో రిటైరయ్యారు. సాహితీ లోకంలో ఉత్తమ కథారచయితగా ఈయన మంచిపేరు తెచ్చుకున్నారు. కథలు తప్ప మరో ప్రక్రియకు పోలేదు. కరుణకుమార గా గుర్తింపు పొందిన ఈయన కలం కదిపితే హృదయాలను కదిలించే కథలే ఔతాయి.. కదం తొక్కిన కథలే ఔతాయి. దళితుల పట్ల వివక్ష ఉండే ఆరోజుల్లో వారి సమస్యలను ఇతివృత్తంగా తీసుకుని అనేక కథలు రచించారు.. సహజత్వం ఉట్టిపడే విధంగా. ఉన్నవ వారి రచన మాలపల్లి నవల చదివి ఎంతో ప్రేరణ పొంది కథారచనలు సాగించి పాఠకులలో గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. ఈయన కథలు ఆంధ్రపత్రిక, భారతి, స్వతంత్ర, కిన్నెర మొదలైన పత్రికలలో అచ్చయ్యాయి. నాటకాలపై కూడా ఆసక్తి ఉండడం వలన శ్రీరామభక్త నాటక సమాజం నెలకొలిపి చాలా నాటకాలు చేశారు. దశరథుడు, సారంగధరుడు, కృష్ణుడు, అర్జునుడు వంటి పౌరాణిక పాత్రలే కాకుండా బిల్వమంగళుడు (చింతామణి), పురుషోత్తమ రావు (వరవిక్రయం) పాత్రలలో నటించి మెప్పించారు. కుల మతాలతో సంబంధం లేకుండా నాటి జీవనశైలిలో వాస్తవికతతో కూడిన సంఘటనల ఆధారంగా గుండెల్ని కదిలించేలా కథలు రాశారు. ఈతరం పాఠకుల కోసం కందుకూరి అనంతం రచించిన కొన్ని కథలను ఓ సంకలనంగా కూర్చి కథాస్రవంతి పేరుతో, కరుణకుమార కథలు క్యాప్షన్ తో పై పుస్తకాన్ని ప్రచురించారు. కందుకూరి అనంతం రిటైరైన సంవత్సరం లోనే తన 56వ ఏట అనారోగ్యానికి గురై 1956 డిసెంబర్ 23న తుదిశ్వాస విడిచారు.. 125వ జయంతి సందర్భంగా ఈ చిరు వ్యాసాన్ని మీముందుకు తెచ్చిన వారు.. ------ గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని) .
No comments:
Post a Comment