Tuesday, April 22, 2025

 *💥రెండు మూటలు....కథ*💥

భగవంతుడు మనిషిని సృష్టించినప్పుడు, ఒకేలా కనిపించే రెండు చక్కని మూటలను ఇచ్చాడు. భగవంతుడు మనిషికి ఒక మూటను ముందు, మరొకటి, వీపువైపున, భుజం వెనకాల మోయమని చెప్పాడు. ఆ రెంటి స్థితిని మార్చవద్దని సలహా ఇచ్చాడు.
మనిషి భూమిమీదకి వెళ్లాలన్న ఉత్సాహం ఉన్నప్పటికీ, అక్కడ తెలియని జీవితం గురించి భయపడి, భగవంతుడిని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. భగవంతుడు తాను చెప్పినవాటిని గుర్తుంచుకోమని, ప్రతి పరిస్థితిలోనూ కృతజ్ఞతతో ఉండమని అతనికి హామీ ఇచ్చాడు. భగవంతుడు కోరిన విధంగానే మూటలతో, ఆ వ్యక్తి  భగవంతునికి వీడ్కోలు పలికి బయలుదేరాడు.
భగవంతుడు మనిషి యొక్క లోపాలను ఒక మూటలో ఉంచాడు - అది ముందువైపు మోయాలి, ఇతరుల (ప్రపంచం) లోపాలను వెనకకు ఉంచాల్సిన మరొక మూటలో ఉంచాడు.

భగవంతుడు మనిషికి తన కళ్లను, దృష్టిని వెనుకవైపు కాకుండా, ముందు మూటపై ఉంచమని చెప్పాడు. కాలం గడిచేకొద్దీ, మనిషి తనను తాను మెరుగుపరుచుకుంటూనే ఉన్నాడు, తన స్వంత లోపాలపై దృష్టి సారించి జీవితంలో పురోగతి సాధించాడు.
ఒకరోజు చెరువులో స్నానం చేసి, ఆ వ్యక్తి ఆ మూటలు ఎత్తబోగా, అవి పరస్పరం ముందువెనకకి మారిపోయాయి. ఎదుటివారి లోటుపాట్ల మూట ముందుకి,ఎదురుగా వచ్చి, తన స్వంత లోటుపాట్ల మూట వీపువైపు, వెనుకకి మారిపోయింది.
ఇప్పుడు, మనిషి ఇతరుల లోపాలను చూడటం ప్రారంభించాడు. మొదట్లో, కొన్ని సార్లు ఆగి, ఏదో తేడాగా ఉన్నట్లుగా గమనించాడు, ఏదో మారిపోయినట్లనిపించింది. కానీ చుట్టు ప్రక్కల చూసేసరికి బయట అంతా మామూలుగానే కనిపించింది. 
భూమిపై చాలా కాలం నుండి ఉండడంతో, ఇప్పుడు మనిషి తనపై తాను విశ్వాసం పెంచుకున్నాడు, ప్రపంచపు మార్గాలు అన్నీ తనకు తెలుసని అనుకున్నాడు. అందుకే తన అంతరంగ స్వరాన్ని వినకుండా అలాగే ముందుకుసాగాడు.
ఇప్పుడు అతను, ఇది సరికాదు, అది సరికాదు....అని ఇలాగే అనుకుంటున్నాడు... తన చుట్టూఉన్నవారు పనికిరానివారు, ప్రభుత్వం అసమర్థమైనది...., ఇలా అన్నీ పనికిరానివే! ఇప్పుడు తనలో తప్ప అందరిలోనూ తప్పులు వెతకడం మొదలుపెట్టాడు.
ఫలితంగా ఎవరూ అభివృద్ధి చెందలేదు కానీ ప్రతిదీ క్షీణించడం ప్రారంభించింది. బయట విషయాలు పెద్దగా మారనప్పటికీ, మనిషి అంతరంగంలో ఎప్పుడూ సంతోషంగా ఉండలేకపోయాడు. ఇప్పుడు అయోమయంలో పడ్డాడు. ఏం జరిగిందో అతనికి అర్థం కాలేదు!
పూర్తిగా నిస్సహాయంగా భావించి, తనంతట తానుగా పరిష్కారం కనుగొనలేక, అతను మళ్ళీ భగవంతుడిని స్మరించుకున్నాడు," భగవంతుడా, నువ్వు నాకు రెండు మూటలు ఇచ్చావు. ఇక్కడనుండి వెళ్ళిన దగ్గర్నుండి అభివృద్ధి చెందుతూ ముందుకు సాగాను, నేను జీవితంలో సంతోషంగా ఉన్నాను .... కానీ ఇప్పుడు ఏమీ సరిగ్గా అనిపించడం లేదు.. ఏదీ మెరుగ్గా లేదు .... భగవంతుడా ఎందుకు ఇలా అయ్యింది ?! " అని వేడుకున్నాడు.
భగవంతుడు ఇలా వివరించాడు, " *నీ కళ్ళు నీ లోపాలపై ఉన్నంత వరకు, నీవు అభివృద్ధి చెందుతూఉన్నావు ... కానీ నీవు నీ స్వంత లోపాలను విస్మరించి, ఇతరుల లోపాలను చూస్తూ, వారిని ఎగతాళి చేయడం మొదలుపెట్టిన వెంటనే నీ పతనం ప్రారంభమైంది.*"
*ఇదీ వాస్తవికత... మనం మరెవరినీ మెరుగుపరచలేం, ఎవరినీ నియంత్రించలేం, కాబట్టి మన శక్తినంతా మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి ఉపయోగించడమే మన  పురోగతికి, మనం సంతోషంగా ఉండటానికి ఏకైక మార్గం. మనం బాగుపడితే ప్రపంచం బాగుపడుతుంది. అందరినీ సరిదిద్దడం ద్వారా శాంతి లభిస్తుందని మనం  భావిస్తూ,  మన స్వంత ప్రవర్తనను మనం సరిదిద్దుకోవడానికి ప్రయత్నించం. కానీ, జీవితం మనల్ని మనం సరిదిద్దుకోవడానికి ఉద్దేశించబడింది, ఇతరులను కాదు.*

*మనం ప్రపంచాన్ని మార్చనవసరం లేదు. కానీ మనం మారినప్పుడు ప్రపంచం మారుతుంది....చారీజీ*

No comments:

Post a Comment