అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత… ధారావాహిక-485.
4️⃣8️⃣5️⃣.
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!
*భగవద్గీత*
(సరళమైన తెలుగులో)
*18. మోక్ష సన్యాస యోగము*
(పదునెనిమిదవ అధ్యాయము)
_________________________
*75. వ శ్లోకము:*
*”వ్యాసప్రసాదాచ్ఛ్రుతవా నేతద్గుహ్యతమం పరమ్l*
*యోగం యోగేశ్వరాత్కృష్ణాత్సాక్షాత్కథయతస్స్వయమ్ll”*
“ఇదంతా ఎలా జరిగింది అంటే ‘నేను చూచాను కాబట్టి నీకు చెప్పగలిగాను’ అని సంజయుడు జబ్బలు చరుచుకోలేదు. వినయంగా ఇదంతా వ్యాసుల వారి ప్రసాదము, అనుగ్రహము. ఇదంతా వ్యాసమహర్షి దయవలన జరిగింది అని వ్యాసుల వారికి సంజయుడు మనసులోనే ప్రణామాలు అర్పించాడు. వ్యాసుని అనుగ్రహంతో సంజయుడు అర్జునుడు, కృష్ణుడి మనసులలో దూరి, అత్యంత రహస్యమైన వారి సంభాషణను విన్నాడు. ఎందుకంటే సంజయుడు కృష్ణుడు, అర్జునుడు మనసులలో మెదిలే భావాలు కూడా చెప్పగలిగాడు. కేవలం అర్జునుడు మనోనేత్రంతో దర్శించిన విశ్వరూపమును కూడా సంజయుడు వర్ణించగలిగాడు. ఇదంతా వ్యాసుని అనుగ్రహమే. పైగా ఈ యోగ శాస్త్రమును యుద్ధ రంగంలో, అర్జునుని రథం మీద, కృష్ణార్జునుల పక్కనే ఉండి గీత అనే యోగశాస్త్రమును విన్నాను అని అన్నాడు. ఇంతటి మహత్తరమైన సంభాషణను విన్నవాడు సంజయుడు ఒక్కడే. అందుకే మహాభారతంలో ఒక్క సంజయుడికే ఆ అదృష్టం లభించింది.```
సంజయుడు కేవలం సారథి మాత్రమే. ధృతరాష్ట్రుడికి అంతరంగికుడు. భారతంలో ఎటువంటి ప్రాధాన్యత లేని పాత్ర. ఎక్కడో తప్ప ఎక్కడా ప్రముఖంగా కనిపించదు. అటువంటి పాత్రకు కూడా విశిష్టత కల్పించిన ఘనత వ్యాసునిది. వ్యాసుని రచనా వైదుష్యం అంత గొప్పది. ఇక్కడ ఇంకొక విశేషం కూడా ఉంది. “సాక్షాత్ కృష్ణాత్ కథయతః స్వయం”, అంటే సాక్షాత్తు కృష్ణుడు అర్జునుడితో చెప్పిన మాటలు నేను స్వయంగా విన్నాను. సంజయుడు తాను ప్రత్యక్షంగా చూచినది విన్నది ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ఇందులో కృష్ణుని మాటలు అర్జునుని మాటలు యథాతథంగా ఉన్నాయి. ఎటువంటి కల్పనలు లేవు. ఇది ప్రత్యక్ష ప్రమాణము. సాక్షాత్తు పరమాత్మ అంశ అయిన కృష్ణుని వాక్కు నుండి జాలువారిన అమృతధార గీత. ఆ గీత యథాతథంగా మనకు అందింది. ఆ కారణం చేతనే గీత ప్రపంచ వ్యాప్తంగా చదవబడుతూ ఉంది. ఆచరింపబడుతూ ఉంది.```
*76. వ శ్లోకము:*
*”రాజన్సంస్మృత్య సంస్మృత్య సంవాదమిమమద్భుతమ్l*
*కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుఃll”*
“ఓ ధృతరాష్ట్ర మహారాజా! అద్భుతము, పుణ్యప్రదము అయిన ఈ కృష్ణార్జున సంవాదమును మాటిమాటికీ తలచుకుంటూ స్మరణకు తెచ్చుకుంటూ మహదానందాన్ని అనుభవిస్తున్నాను.”
```
గీతను విన్న తరువాత సంజయుని మానసిక స్థితిని ఇక్కడ వివరిస్తున్నాడు వ్యాసుడు. పరమ అద్భుతము, అత్యంత పుణ్యప్రదము, ఇతరులకు లభ్యం కానిది అయిన ఆ కృష్ణార్జున సంవాదమును విన్న సంజయుడు, ఆ సంవాదమును మరలా మరలా తలచుకుంటూ పులకించి పోయాడు. అతని మనసంతా ఆనందంతో నిండి పోయింది. అర్జునుడితో పాటు సంజయునిలో ఉన్న అజ్ఞానం కూడా తొలగిపోయింది. అతనికి మనసు కూడా ఆత్మతో అనుసంధానం అయింది. అనిర్వచనీయమైన ఆనందానుభూతిని పొందగలిగాడు. ఏదో విన్నాములే అని మరిచిపోకుండా, మాటి మాటికీ తలచుకుంటూ, స్మృతిలోకి తెచ్చుకుంటూ ఆనందిస్తున్నాడు. పొంగిపోతున్నాడు. ఆ ఆనంద పారవశ్యంలో తేలిపోతున్నాడు.
గీతను విన్న మనకు కూడా అటువంటి అనుభూతి కలగాలి అని వ్యాసుని ఉద్దేశ్యము. ఇక్కడ సంస్మృత్య సంస్మృత్య అంటూ రెండు సార్లు చెప్పాడు. అంటే తాను విన్న గీతను మరలా మరలా మననం చేసుకుంటున్నాడు. మనం కూడా గీతను ఒకసారి విని వదిలేస్తే సరిపోదు దానిని నిరంతరం మననం చేసుకుంటూ ఉండాలి. ఏ రోజు చదివింది విన్నది ఆ రోజు సాయంత్రం ఒంటరిగా ఏకాంతంగా కూర్చుని పునశ్చరణ(రివిజన్) చేసుకోవాలి. మననం చేసుకోవాలి. కనీసం ఒక్క శ్లోకమైనా ఆచరణలో పెట్టగలగాలి. దానికి నిరంతర స్మరణ, మననం ముఖ్యం. మాటిమాటికీ స్మరించుకోవాలి. మనసుకు పట్టించుకోవాలి. ఆచరించడానికి ప్రయత్నించాలి. అదే వ్యాసుడు మనకు సంజయుని ద్వారా చేసిన బోధ. (ఈ ప్రక్రియ విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది. క్లాసులో ఏ రోజు చెప్పిన పాఠాలు ఆ రోజు సాయంత్రం చదివి, అర్థం చేసుకుంటూ మననం చేసుకుంటే, ఫస్టు క్లాసు ఖాయంగా వస్తుంది అనడం ఎలాంటి సందేహం లేదు.)
దీనికి మనం ఏమీ శ్రమ పడనవసరం లేదు. ఉదయమే నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకొని గీతను చేతబట్టుకొని ఏదో ఒక పేజీ తీసి అందులో ఏదో ఒక శ్లోకమును చదివి అర్ధం చేసుకొని ఆరోజు దానిని మనకు శక్తి ఉంటే ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. దీనికంతా పదినిముషాలు పడుతుంది. 24 గంటలలో పది నిమిషాలు మనం వెచ్చించగలిగితే జీవితంలో మనశ్శాంతి లభిస్తుంది. సుఖంగా ఉంటుంది అనడంలో సందేహము లేదు. ✍️```
(సశేషం)
🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం,
(రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
No comments:
Post a Comment