Monday, April 21, 2025

 *అవ్వ - అనూహ్య* 
🕉️🌻🦚🌹💎💜🌈

 *అనూహ్య బస్ స్టాప్ లో నుంచుని ఇయర్ ఫోన్స్ చెవుల్లో పెట్టుకుని పాటలు వింటోంది..పాటలుంటే చాలు ఇంకేమీ  అక్కర్లేదు అనూహ్యకి..* 

 *బస్ స్టాప్ కి ఎదురుగా రోడ్డు కి అవతల ఓ చిన్న పాకలో అవ్వ ఉంది..కొంతకాలం కిందటివరకూ మొక్కజొన్న కండెలు అమ్ముతూ అక్కడ పాకలో  కూర్చునేది అవ్వ , ఈ మధ్య తన పాక ఎవరికో పళ్ళు అమ్ముకునేందుకు ఇచ్చేసింది , తాను మాత్రం ఓ పక్కనే పాకలో కూర్చుంటూ ఉంటుంది...* 

 *ఆ రోజు ఎదురుగా బస్ స్టాప్ లో వచ్చి నుంచుని పాటలు వింటూ బస్సు కోసం ఎదురుచూస్తున్న అనూహ్యను చూసింది అవ్వ...అవ్వ మొహం వెలిగిపోయింది.. " మా అమ్మే నువ్వేనా , నువ్వే వచ్చేసావా , కమలా కమలా వచ్చేసావమ్మా "  అనుకుంటూ వేగంగా రోడ్డు దాటేసింది అవ్వ , పక్కన వచ్చిపోయే బళ్ళను పట్టించుకోలేదు...* 

 *ఎండ మండుతోంది , ..అనూహ్యని కళ్ళారా  అపురూపంగా చూస్తోంది అవ్వ ...అనూహ్య ఫోన్ చూసుకుంటూ అవ్వని గమనించుకోలేదు..* 

 *అవ్వ తన వణికే చేతులతో అనూహ్య చేతిని ఆప్యాయంగా తాకింది...అవ్వ చేతినుంచీ చల్లని స్పర్శ అనూహ్యకి ఊరటనిచ్చింది , మనసుకి కుదురుగా అనిపించింది , ఎందుకలా అని అనూహ్యకి అర్థం కాలేదు...అవ్వని చూసింది...అడుక్కునే ఆవిడ కాదు అనిపించింది , ఏమన్నా సాయం కావాలా అన్నట్టు చూసింది అనూహ్య , అవ్వని...* 

 *కమలా అంది ప్రేమగా అవ్వ..నవ్వింది అవ్వ ...అమ్మా కమలా..అంది మళ్ళీ అవ్వ..* 

 *అనూహ్యకి భయం మొదలైంది , అమ్మో అవ్వ పిచ్చిదేమో అనిపించింది...నెమ్మదిగా కదిలి వెనక్కి అడుగులు వేస్తోంది...అవ్వ తన సంచీలోకి చెయ్యి పెట్టింది...ఏదో బయటకు తీస్తోంది...అందరూ వారిద్దరినే ఆసక్తిగా చూస్తున్నారు...* 

 *కొన్నినెలల కిందట అవ్వ మొక్కజొన్నలు కాలుస్తుంటే కమల వచ్చింది.. " రాయే కమల గుడిసెలో ఉండకుండా ఈడకొచ్చినావేంటే " అంది అవ్వ, తన కూతురు కమలతో..* 

 *" అక్కడ తాగుబోతు సచ్చినోళ్ళు పట్టపగలే తగలడ్డారు..చుట్టూ మనుష్యులు ఎక్కువ లేరు , భయం పుట్టి పరిగెత్తుకొచ్చా " అంది కమల..* 

 *" అబ్బబ్బా ఎప్పుడొదల్తదో ఈ తాగుడు శని , పంటల్లో కలుపుమొక్కలు ఏరిపడేసే తెలివితేటలు రైతులకి ఉన్నాయి కానీ ఈ నాయకులకి ఈ వెధవ వ్యసనాన్ని మనుష్యులకి అందుబాటులో లేకుండా సేయాలన్న జ్నానం మాత్రం లేదు , డబ్బులొచ్చి పడతాయని , మడుసుల్ని తాగుడుకి ఎరేసెత్తన్నారు...ఛీ ఛీ , అసలే సరిగ్గా బతకలేక తిప్పలు పడతాఉంటే ఈ తాగుడొకటి , తాగుబోతులొకటి మన ప్రాణాలకి , అవునే మణమ్మగారి జాకెట్లు కుట్టేసినావా లేదా వారింటి పెళ్ళి టయానికి ఇయ్యకపోతే మాటొచ్చేత్తదే "  అడిగింది అవ్వ...* 

 *ఇంకా రెండే రెండు కుట్టాలి , సాయంత్రానికి కుట్టేద్దును , మంద మంద ఆ వెధవలొచ్చిపడ్డారు పక్క గుడిసెలోకి , భయమేసి వచ్చేసానమ్మా అంది కమల...చక్కగా మణి గారు జాకెట్ల డబ్బులిచ్చేస్తే , ఉన్న డబ్బులకి జత చేసి ముత్యాలదండొకటి , ఘల్లుఘల్లు కాలిపట్టీలు కొనేసుకుంటా....* 
 *ఘల్లుఘల్లుమని తిరుగుతుంటే ఎంత బావుంటుందో అని కమల మురుసుకుంటుంటే అవ్వ కళ్ళారా కూతురి సంబరం చూసుకుంటోంది...* 

 *అల్లుడు తాగేసి రోడ్డుకడ్డం పడి మత్తుగా పడిపోతే , పిచ్చికుక్క ఒకటి రాత్రిపూట కరిచి కరిచి పెట్టింది , పొద్దునకల్లా మెలకువే రాకుండా గాల్లో కలిసిపోయాడు అల్లుడు , పిల్లలు ఎలానూ లేకపోయే , మొగుడిని చూసుకుంటూ బతికేద్దామనుకుంది కమల..ఏం లాభం మొగుడు పోయి తల్లి పంచన చేరింది కమల....ఎప్పుడూ దిగులు పడుతూ కూర్చుని పదేళ్ళు లాగేసిన కమల ఈ మధ్యే కొంచెం హుషారు తెచ్చుకుంటోంది అనుకుని అవ్వ దీర్ఘంగా నిట్టూర్చుకుని కూతురి నవ్వుని అపురూపంగా చూసుకుంటోంది...ముత్యాలగొలుసని , కాలిపట్టీలని తలుచుకుని ఊహల్లో ఆనందపడుతున్న కూతురిని చూసుకుంటోంది అవ్వ...మణి నుంచి ఫోన్ వచ్చింది , కమలా జాకెట్లు సాయంత్రానికి ఇచ్చెయ్యవే , రాత్రికి ఊరు బయలుదేరుతున్నాము పెళ్ళికి  అని తొందరపెడుతోంది మణి...కారణం ఇదీ అని మణికి వివరించలేక కమల కాళ్ళీడ్చుకుంటూ గుడిసెకి బయలుదేరింది....* 

 *సాయంత్రం మణి అవ్వ దగ్గరకు పరిగెత్తుకొచ్చింది...అవ్వా నీ బిడ్డను చూడు , జాకెట్ల కోసం గుడిసెకు పోయా , పిలిస్తే కమల పలకలేదు , తలుపు తోసి లోపలికి చూస్తే కమల భయంకరమైన స్థితిలో కనిపించింది , అంబులెన్స్ కి ఫోన్ చేసి నీదగ్గరికి పరిగెత్తుకొచ్చా , పద పదా అని అవ్వకి ఆసరా ఇస్తూ గుడిసెకి తీసుకుపోబోయింది , అంబులెన్స్ ఎదురొచ్చింది , అవ్వ కూడా అంబులెన్స్ ఎక్కింది ...కూతురు కళ్ళు మూసుకుని ఉంది...కమలమ్మా అని నెమ్మదిగా పిలిచింది, కూతురిని తట్టిలేపుతూ...అలా పిలుస్తూ పిలుస్తూనే ఉంది... హాస్పిటల్ లో చెప్పారు కమల ఇంక లేదని , పదిమంది పందుల్లా మీదపడితే ప్రాణం గుటుక్కుమందని....అవ్వ గుండెపగిలేలా ఏడ్చింది...నలభైనాలుగేళ్ళ మహిళ కూడా మగమ్రృగాలకి ఆటవస్తువే అయిందే , నాలుగేళ్ళ చిన్నారి , అరవయ్యేళ్ళ ముసలమ్మ ఎవరినీ విడిచిపెట్టరే ఈ అడవిదున్నలు , తాగేసి ఇంగితం మరిచి అయ్యో అని అవ్వ ఏడుస్తుంటే , పక్కనే అవ్వని పట్టుకుని కూర్చున్న మణి అయ్యో ఇదంతా నా వల్లనేనేమో అని మనసులో కుమిలిపోతోంది...పెళ్ళి కి వెళ్ళకుండా అవ్వకి ఓ నాలుగు రోజులు తోడుగా ఉంది మణి...* 

 *ఒక నైరాశ్యంలో ఉన్నా కూడా అవ్వ ఏదో వెతుకులాడుతూ ఉండేది , అవ్వా ధైర్యంగా ఉండు అని మణి వచ్చి పలకరించిపోతూ ఉండేది...అవ్వ కమల ఫొటో చూసుకుంటూ , ఒక చేతిసంచీ ఎప్పుడూ తన చేతికి తగిలించుకుని ఉండేది , లోకంలో మిగిలి ఉన్న ఒక్క బంధం కమల , ఇప్పుడు తను కూడా లేక బతుకు శూన్యం అయిపోయింది అవ్వకి...బుద్ధిపుట్టినంతసేపు గుడిసెలో కూర్చుంటుంది , లేదంటే వచ్చి పాకలో కూర్చుంటుంది , మొక్కజొన్నలు అమ్మటం మానేసింది...* 

 *ఈ రోజు అవ్వ అనూహ్యని తాకి పలకరించి చాలారోజుల తరువాత మనసారా , నోరారా నవ్వి కమలమ్మా అని కూతురి పేరు మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ చేతిసంచీలోకి చెయ్యి పెట్టింది...ఒక మూట తీసింది...అనూహ్య భయంతో గబగబా వెళ్ళటానికి రెడీ అయింది...కమలా అంటూ అవ్వ తన బలహీనమైన చేతితోనే బలంగా అనూహ్యని వెళ్ళకుండా ఆపి అనూహ్య చేతిలో తన మూట పెట్టింది , అనూహ్య చిరాకుగా మూటను ఇచ్చేయబోయింది , కొనుక్కో కమలా ముత్యాలదండ కొనుక్కో , ఘల్లుఘల్లు కాలిపట్టీలు కొనుక్కో , సంతోషంగా వేసుకుని తిరుగమ్మా , బంగారుతల్లీ అని అనూహ్య బుగ్గలు ప్రేమగా తాకి తన రెండుచేతులు అనూహ్య మొహానికి చుట్టూ తిప్పి మెటికలు విరిచింది...నెమ్మదిగా నేలకు జారిపోయింది అవ్వ , కుప్పలా ముడుచుకుని కూర్చుండిపోయిన అవ్వను చూసి పక్కనున్నతను అవ్వను లేపాలని చూసాడు...అవ్వ మొహంలో చిన్న చిరునవ్వు , తన కోరిక తీరినట్లు , తాను ఆశించినది చేయగలిగినట్లు , చివరి ఆశ తీరిందనేమో చివరి శ్వాస కూడా వదిలేసింది...అయ్యో అవ్వ చనిపోయింది అన్నాడు ఒకతను...ఆ అంది భయంగానూ , బాధగానూ అనూహ్య...కళ్ళ నుంచీ నీళ్ళు ధారగా కారిపోతున్నాయి అనూహ్యకి , చేతిలో మూట , అవ్వ తాలూకూ చిహ్నం అనూహ్య కి చేతిలో బరువు పెరిగిపోతున్నట్టుగా తోచి మూటని అవ్వ పక్కన పెట్టేయబోయింది...వద్దమ్మా మూట వదిలెయ్యకు , బహుశా మూటలో డబ్బులుంటాయి , అవ్వ తన కూతురు ఆశ పడ్డ గొలుసు , పట్టీలు నీ రూపంలో తనకూతురిని చూసుకుని నీకు డబ్బురూపంలో అందించింది , అవ్వ నీకిచ్చిన బహుమతిని వదులుకోకు , అవ్వ కోసం స్వీకరించు , మానవత్వం కోసమన్నా ఈ పని చెయ్యి అంది , ఎప్పటినుంచీ అక్కడకి వచ్చి అంతా చూసిందో మణి , అవ్వ కోసం తన బాధ్యతగా అనూహ్యకి అవ్వ ఆశని తెలియచెప్తోంది...* 

 *సేకరణ* 

🕉️🌻🦚🌹💎💜🌈

No comments:

Post a Comment