Monday, April 21, 2025

 కాఫీ కబుర్లు సంఖ్య 871 (ఏప్రిల్ 21 - 2025) -- విద్యార్థులు-వేసవి ---- వేసవి సెలవులు వచ్చేశాయి.  మన పాఠశాల రోజుల్లో పెద్ద పరిక్షలు ఎప్పుడవుతాయా, సమ్మర్ వెకేషన్ ఎప్పుడొస్తుందా అని ఆత్రంగా ఎదురు చూసేవాళ్ళం.  సుమారు రెండు నెలలు వేసవి సెలవలే.  స్కూల్స్, పుస్తకాలు, హొంవర్క్ లు, పరీక్షలు.. వీటన్నింటినీ మరచిపోయి రెండు నెలలు సెలవులు హాయిగా బామ్మ అమ్మమ్మ తాత ఉన్న పల్లె ప్రాంతాలకు వెళ్లి గడపవచ్చునని.  లేదా విహార యాత్రలకి వెళ్లి ఎంచక్కా గడపొచ్చని.  అలానే చేసేవారం..  మరచిపోని ఆనంద క్షణాలు అవి మనకి బాల్యంలో.  ఐతే ఇప్పుడా వేసవి సరదాలు అడుగంటిపోయాయి..  కాన్వెంట్ కార్పొరేట్ చదువుల పుణ్యమా అని.  ఏన్యువల్ ఎగ్జామ్స్ అయ్యాక ఓ వారం సెలవిచ్చి కొత్త క్లాసులు ఆరంభించేస్తున్నారు.  ఒక నెల రోజులు పాఠాలు చెప్పి ఒక నెలా నెలన్నర వేసవి సెలవులు ఇస్తూ తగ్గ హోం వర్క్ కూడా ఇచ్చేస్తున్నారు.  ఇక వేసవి ఇనందం ఆవిరే.  ఒక పదినెలలు కష్టపడి చదువుకుని పెద్ద పరీక్షలు రాశాక పిల్లలకు ఓ రెండు నెలలు వేసవి సెలవులు అంటూ వదిలేయాలి.  జ్జానంతో పాటు లోకజ్ఞానం కూడా పిల్లలకు అలవడాలి.  ఆట పాటలు, విహారయాత్రలు, తాతగారి ఊరు సందర్శనం, గ్రంథాలయాలకు వెళ్ళడం, పుస్తక పత్రికా పఠనం, స్నేహితులతో సరదాగా గడపడం.. ఇవన్నీ పిల్లలకు లోకజ్ఞానం ఇచ్చేవే.  చదువులు ఉండవు గనుక.. రెండు నెలలు వీటితో గడిపితే మంచి  విజ్ఞానం సంపదే కాకుండా వినోదం కూడా.  15-16 వయసులోపు ఉన్న పాఠశాల విద్యార్థులకు ఈ వేసవి విడిది చాలా అవసరం. వేసవి సెలవుల్లో కూడా పిల్లలు చదువులు హోంవర్క్ అంటూ గడపడం చూస్తే మనకి జాలి వేస్తుంది.  ఇక మరో కోణంలో చూస్తే చాలా కుటుంబాల్లో ముఖ్యంగా నగరాల్లో, దూర దేశాల్లో ఉంటున్న తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగస్తులే.  సెలవులు దొరకవు.  పిల్లలకి పాఠశాల సెలవుల్లో పేరెంట్స్ కి కుదరదు.  ఈ కారణాల వలన కూడా వేసవి సెలవులు హాయిగా ఎంజాయ్ చేసే వీలుండడం లేదు.  కార్పొరేట్ చదువులు ఉద్యోగాలు వేసవి సెలవుల ఆనందానికి ప్రతిబంధకాలు.  గత రెండు మూడు దశాబ్దాలుగా పిల్లలకు లోకజ్ఞానం సరిగా అలవడటం లేదు పై కారణాల వలన.  దానికి తోడు మొబైల్స్ రావడంతో వాళ్ళకి నచ్చినవే చేస్తారు గనుక మంచి సంస్కారం ప్రవర్తన అలవడే విధంగా పిల్లలు ఎదగడంలేదు.  దూరంగా ఉంటారు గనుక పెద్దలకి చెప్పే అవకాశం ఉండదు.  సరియైన జ్జానం పరిపక్వత లేకపోవడం, కుటుంబ బంధాలు జీవిత విలువలు తెలియకపోవడం వలన బంధాలు నిలుపుకో లేకపోతున్నారు..  ఫలితంగా ఏడు జన్మల వివాహబంధం ముణ్ణాళ్ళ ముచ్చటగా మిగిలిపోతోంది.  ఆధునిక జీవనశైలి యువతను తప్పుతోవ పట్టిస్తోంది.  పిల్లల్ని కన్న పెద్దలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.  తమ పిల్లల్లో విజ్ఞానం వికాసం అలవడేలా పేరెంట్స్ చర్యలు తీసుకోవాలి.  మన పిల్లల్ని సమాజానికి దేశానికి ఉపయోగపడే విధంగా ప్రయోజకుల్ని ఛేయడంలో ప్రయత్నలోపం ఉండకూడదు. మన అనుభవాలే వారికి జీవిత పాఠాలు.  బాధ్యత తెలిసిన వ్యక్తి ఉపయోగకరంగా ఉంటాడు.  అనేక కుటుంబాల్లో వివిధ దశలలో ఉండే ఇబ్బందులు కలతలు పోవాలంటే మనకి సంస్కారం బాధ్యత వికాసం లోకజ్ఞానం ఉండాలి.  పిల్లల పెంపకంలో సరియైన విధానాలు మనం పాటించ గలగాలి..  మంచి అభిరుచులు అలవడేలా చేయాలి.  అన్నివిధాలా చక్కగా ఎదుగుతున్న పిల్లలు నూటికి పదిహేను మందేనని నిపుణులు అంటున్నారు.  ఈ శాతం మరింత పెరిగేలా చేయాల్సిన బాధ్యత మనదే.. అంటే పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ దే.  పిల్లల వికాసానికే వేసవి సెలవులు అని అందరూ గుర్తించాలి.  మన పిల్లలు అంటే‌ మన సమాజం.. మనదేశం..  ఈరోజు కాఫీ కబుర్లుకి అక్షరాలతో ఉన్న టీ షర్ట్ ఇమేజ్ పంపిన..  విశాఖపట్నంలో ఉంటున్న నా కాఫీ కబుర్లు అభిమాని శ్రీ  వి సూర్య గారికి కృతజ్ఞతలు..  ------ గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని) విజయనగరం ఫోన్ 99855 61852....

No comments:

Post a Comment