Tuesday, April 22, 2025

 *🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
  *ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
                *గోపాలక విద్య*

*శ్రీకృష్ణుడు మురళీధరుడు. ఆయన నాద వినోదుడు. శ్రావ్యమైన మురళీ నాదంతో జీవరాశులన్నింటినీ మైమరపించి మురిపించాడు. ఆ మురళి వల్లే ఆయన పురాణపురుషుడైనాడని రాగ గోవిందంలో మీరాబాయి కీర్తించింది. వెదురుతో చేసిన పిల్లనగ్రోవిది ఎంత అదృష్టమో కదా... ఆయన అధరాలను తాకి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ఆస్వాదించి రాగాలను సృజిస్తోందని మీరాబాయి గానం చేసింది. అథర్వణ వేదానికి సంబంధించిన కృష్ణోపనిషత్తులో మురళిని గురించిన వివరాలు ఉన్నాయి. ఇది అత్యంత ప్రాచీనమైన వాద్యమని, దీని నుంచి వెలువడే రాగాలను పంచ భూతాలు తమలో లీనం చేసుకొంటాయని కృష్ణోపనిషత్తు చెబుతోంది. ఆదిమజాతి మానవులు సాధు జీవాలను మచ్చిక చేసుకోవడానికి తమ నోటితో రాగయుక్తమైన ధ్వనులు సృజించి వాటికి ఆనందం చేకూర్చేవారట.* 

*ఆ తరవాత వెదురు బొంగు నుంచి పిల్లనగ్రోవిని తయారుచేసి రాగ ధ్వనులతో వాటి చెవులకు ఇంపు చేకూర్చేవారని నీలకంఠ శాస్త్రి రాసిన పుస్తకం వేదకాలం నాటి భారతీయ సంస్కృతిని చాటుతోంది. శ్రీకృష్ణుడు ఆలమందల పోషణలో భాగంగా వేణువును ఊదుతూ వాటిని రంజింప జేసేవాడు. అవి మోరలెత్తి ఆ వేణుగానాన్ని వింటూ ఆహారాన్ని నెమరు వేసుకొంటూ ఆనందాన్ని వ్యక్తం చేసేవి. అథర్వణ వేద విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఆవులు సైతం తొమ్మిది రకాల భావావేశపూరిత అనుభూతులకు లోనవుతాయని ఒకటో శతాబ్దానికి చెందిన పలకాప్యుడు, ఆ తరవాతి తరం నాటి శాలిహోత్రుడు పేర్కొన్నారు. నింపాదిగా కూర్చుని ఆహారాన్ని నెమరు వేసుకుంటూ నిమీలిత నేత్రాలతో ఆవు ఉంటే సాంత్వనంతో నిమ్మళంగా ఉన్నదని గుర్తు. ఆవు చెవులు నిటారుగా ఉంటూ రెప్పలార్చకుండా ఉంటే వ్యాకులతతో కూడిన ఒత్తిడిలో ఉన్నట్లు భావిస్తారు. కళ్లు మాటిమాటికీ మూసుకొంటూ కళ్లలో తెలుపు భాగం ఎక్కువగా కనిపిస్తే అది భయంతో శరీరంలో ఎక్కడో నొప్పిని అనుభవిస్తున్నట్లుగా సంకేతం. కళ్లు మూసుకుని నిద్రిస్తున్నట్లుగా ఉంటే ఆవు సేదతీరుతున్నట్లు గోపాలకులు గమనిస్తారు. నడకలో విశ్వాసం, ధైర్యం కనపడితే పశువులు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుసుకొంటారు. అవి తలను నేలవైపు దించి అడుగులు వేస్తుంటే సౌఖ్యంగా లేనట్లు భావిస్తారు. అలా వాటి అవస్థలను గుర్తెరిగి మురళిని శ్రీకృష్ణుడు ఊదేవాడట. ఆలమందలు అలా ఊరట చెందేవి.*

*సంగీతం తీయని మాటకన్న మధురమైందని సామవేదం చెబుతోంది. గోపాలుడికి పశుపోషణతోపాటు వాటి నైజం బాగా తెలుసునని శ్రీకృష్ణోపనిషత్తు వివరిస్తోంది. ఆహారంతో పాటు శ్రావ్యమైన సంగీతాన్ని ఆవులు ఆస్వాదిస్తాయని నందుడు శ్రీకృష్ణుడికి చెప్పాడంటారు. ఆలమందల అలవాట్లను క్షుణ్నంగా పరిశీలించి వాటిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి వేణునాదాన్నే ఎన్నుకున్నాడు మాధవుడు. ఉదయమే ఆవుల పొదుగులు పాలతో నిండి ఉన్నప్పుడు భైరవి రాగాన్ని మధురంగా పిల్లన గ్రోవిపై ఊదేవాడు. ఈ రాగాన్ని వింటూ ఆవులు కడివెడు పాలు ఇచ్చేవట. భైరవి రాగాన్ని వినగానే గోప బాలకులందరూ చద్ది అన్నాలు కట్టుకొని పశువులను వెంటపెట్టుకొని అడవి వైపు వెళ్ళేవారట. పచ్చిక బయళ్లలో మేసి మధ్యాహ్నం ఆవులు తీరికగా కూర్చున్నవేళ మధ్యమావతి పలికించాలంటారు. రాత్రి పశువులు నిద్రించేవేళ హిందోళం చాలా మంచి రాగమని చెబుతారు. శ్రీకృష్ణుడికి, ఆయన వెంట తిరిగే గోప బాలురకు తెలిసిన ఈ విద్యను గోపాలక విద్య అంటారు. శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధానికి ముందు ఈ గోపాలక విద్యను పాండవులలో అందరికన్నా చిన్నవాడైన సహదేవుడికి అందించాడని భారతం చెబుతోంది.*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
🌴🌳🌴 🌳🌴🌳 🌴🌳🌴

No comments:

Post a Comment