🌸 చందమామ కథకుల రచనా వివరాలు 🌸
2. మాచిరాజు కామేశ్వరరావు గారు 🙏
చందమామలో తన తొలి కథ **‘గుడ్డి వాడి డబ్బు’**ను 1969 సెప్టెంబర్ సంచికలో ప్రచురింపజేసుకున్న ప్రముఖ కథకులు మాచిరాజు కామేశ్వరరావు గారు.
చందమామలో అత్యధిక కథలు రాసిన రెండో రచయితగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది.
ముఖ్యంగా దయ్యాలు, పిశాచాల కథలు రాయడంలో ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. ఉత్కంఠ, భయం, ఆసక్తిని కలగలిపి కథలను చెప్పడంలో ఆయనది ప్రత్యేకమైన శైలి.
ఆయన రచనల్లోని విశిష్టతకు నిదర్శనంగా ‘పారిపోయిన దొంగ’ కథను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు తమ సిలబస్‌లోకి తీసుకున్నారు.
అలాగే ‘విధి నిర్వహణ’ కథను మహారాష్ట్ర ప్రభుత్వం కూడా స్వీకరించింది.
🙏 చందమామ కథా ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన మాచిరాజు కామేశ్వరరావు గారి రచనలు తెలుగు బాలల సాహిత్యంలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాయి. 📖🌸
***************************************
"గుడ్డివాడి డబ్బు"
ఒక గ్రామంలో ఒక సాలె ఉండేవాడు. అతను రకరకాల బట్టలు నెయ్యటంలో మంచి నిపుణుడు. ఊళ్ళో వాళ్ళ ఒత్తిడి అంతగా లేనప్పుడు ఖరీదైన శాలువలు నేసి, నగరానికి తీసుకుపోయి అమ్ముతూండేవాడు. ఒకసారి సాలె ఒక అందమైన శాలువ నేసి, దాన్ని ఒక సంచిలో పెట్టుకుని రాజధానీ నగరానికి బయలు దేరాడు, దూరప్రయాణం ; కొండలూ, గుట్టలూ దాటి వెళ్ళాలి. ఒక రోజు అతను నదీ తీరాన్ని చేరుకునేసరికి ఒక పక్కనుంచి, "గుడ్డివాడి డబ్బు! నీటిలో పడిపోతోంది!” అన్న కేక వినిపించింది.
ఆ కేక విని సాలె నది ఒడ్డుకు పరిగెత్తాడు. అక్కడ ఎవరూ లేరు, కాని నది ఒడ్డు పెళ్ళ వరదనీటికి విరిగి పడిపోతూ ఉండటమూ, ఆ పెళ్ళలో ఒక పాతకాలపు చెంబు ఉండటమూ అతని కంట పడింది. సాలె ఆ చెంబును పడి పోకముందే అందుకున్నాడు. ఆ చెంబులోపల కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ బంగారు కాసులున్నాయి. వాటిని చూసి సాలె పరమానంద భరితుడైనాడు. అతను చెంబుమూతికి రేకు అడ్డం పెట్టి, వాసెన కట్టి, తన సంచీలో నుంచి శాలువ తీసి భుజాన వేసుకుని, ఆ సంచీలో చెంబు ఉంచి, ఇంటి ముఖం పట్టాడు.
అతను ఒక గ్రామం చేరేసరికల్లా చీకటి పడింది. ఆ రాత్రి ఆ గ్రామంలోనే గడిపి, మర్నాడు బయలుదేరి తన గ్రామానికి పోవచ్చు ననుకుని, అతను ఒక ఇంటి తలుపు తట్టాడు. ఒక ముసలిది తలుపు తెరిచి, " ఎవరు, నాయనా ? ఏం కావాలి నీకు ?” అని అడిగింది.
"ఈ రాత్రికి మీ వసారాలో పడుకో నివ్వండి. భోజనం కూడా పెట్టారంటే ఒక రూపాయి యిస్తాను,” అన్నాడు సాలె.
"దానికేం భాగ్యం, నాయనా?” అని ముసలిది సాలె దగ్గిర ఒక రూపాయి తీసుకుని, అతనికి భోజనం పెట్టి, వసారాలో పడుకో నిచ్చింది.
అంత బంగారం తెల్లవార్లూ తన వద్దనే ఉంచుకుంటే ఎవరైనా కాజెయ్యవచ్చు ననుకుని, సాలె ముసలిదాన్ని పిలిచి, "ఈ చెంబులో ఆముదం ఉన్నది. దీన్ని లోపల జాగ్రత్తగా ఉంచండి. నేను రేపు ఉదయం వెళ్లిపోయేటప్పుడు ఇద్దురు గాని," అన్నాడు.
"అలాగే, నాయనా,” అని ముసలిది అతని చెంబును తీసుకుపోయి, లోపల భద్రంగా దాచింది. తరవాత ఆమె తలుపు వేసుకుని పడుకున్నది.
తలవని తలంపుగా ఆ రాత్రే ముసలి దాని కుమార్తెకు పురుడు వచ్చింది. ఇంట్లో ఆముదం కోసం చూస్తే కనిపించ లేదు. అయిపోయినట్టున్నది. వసారాలో పడుకున్న మనిషి ఇచ్చిన చెంబులో ఆమదం ఉంటుందన్న విషయం ముసలిదానికి గుర్తు వచ్చింది. ఆమె సంచీలో నుంచి చెంబు పైకి తీసి, కట్లు విప్పి, రేకు మూతతీసి చూస్తే బంగారు కాసులు కనబడి కళ్ళు చెదిరిపోయాయి. పిల్లాడు భూమి మీద పడ్డ వేళా విశేషం కదా అనుకుని ముసలిది ఆ కాసులన్నీ తీసి భద్రం చేసింది. దొడ్డి దారిన వెళ్ళి పొరుగింటి వాళ్ళను లేపి, ఒక శేరు ఆమదం ఆరువు తీసుకుని, చెంబులో పట్టినంత పోసి, దానికి మూత పెట్టి, వాసెన కట్టి సంచీలో ఉంచి, మిగిలిన అమదాన్ని అవసరానికి ఉపయోగించుకున్నది.
సాలెమనిషి మర్నాడు నిద్రలేచి, ముసలి దాన్నడిగి తన సంచీ తాను తీసుకుని, తిన్నగా ఇంటికి వెళ్ళిపోయాడు.
భార్య అతని భుజాన శాలువా చూసి, " అది అమ్మకుండానే తిరిగి వచ్చావేం?” అని అడిగింది.
"ఆ తలుపు వెయ్యవే ! ఎంత బంగారం తెచ్చానో చూద్దువు గాని ! ” అంటూ సాలెమనిషి సంచీ నుంచి చెంబు పైకి తీసి, మూతతీశాడు. చెంబు నిండా ఆమదం!
"ముసలిముండ ఎంత పని చేసిందీ. ఇది దానిపనే. అది తప్ప ఇంకెవరూ ఈ చెంబును తాకలేదు,” అంటూ అతను భార్యకు జరిగినదంతా చెప్పి, "నే నిప్పుడే వెళ్ళి ఆ ముసలిదాని అంతు తేల్చుకొస్తాను,” అని, తాను క్రితం రాత్రి మజిలీ చేసిన గ్రామానికి బయలుదేరాడు.
ముసలిది సాలెవాణ్ణి చూసి, "ఏం, నాయనా, మళ్ళీ వచ్చావు? ఏమైనా మరిచి పోయావా ఏమిటి? లేక ఈ రాత్రికి కూడా ఇక్కడే పడుకుంటావా?” అన్నది.
“నా దగ్గిర ఇంకో బంగారు కాసులమూట ఉన్నదని ఆశపడుతున్నావా?” అన్నాడు సాలె కసిగా.
"బంగారు కాసులేమిటి, నాయనా?" అన్నది ముసలిది అమాయికంగా.
" అవును, పాపం! నీ కేమీ తెలీదు! నా చెంబులో కాసులన్నీ కాజేసి అందులో ఆమదం పోసిన దానివి నువుకాదూ?" అన్నాడు సాలె.
"ఆ చెంబులో ఆమదం ఉందని నువ్వన్న మాటేగా? ఇప్పుడందులో కాసులున్నాయని నాకు దొంగతనం అంటగట్టుతున్నావా? కాస్త మాటలు జాగర్తగా రానీ!" అని ముసలిది గొంతెత్తింది.
చుట్టుపక్కల వాళ్ళు పోగయారు. అందరూ ముసలిదాన్నే సమర్థించారు. వాళ్ళలో కొందరు, "నీకు చెంబునిండా
కాసు లెక్కడివి? చెంబులో కాసులు పెట్టి ఆమదమని ఎందుకు అన్నావు? నీ వాలకం చూస్తే దొంగలాగున్నావే!" అని ఎదురు దబాయించారు.
తనకు ఎలాంటి సాక్ష్యమూ లేనిచోట న్యాయం జరగదని సాలె అనుకుంటూండగా ఒక స్త్రీ అతనితో, "చూడు, నాయనా ! అసలే గుడ్డిమనమడు పుట్టాడని ఏడుస్తున్న ఆ ముండమీద దొంగతనం కూడా ఎందుకు పెడతావు?” అన్నది.
సాలె నిర్ఘాంతపోయాడు. తాను పడుకున్న రాత్రే ముసలిదాని కూతురు ప్రసవించిందనీ, పుట్టిన పిల్లవాడు పుట్టు గుడ్డి అనీ నలుగురూ అన్నమాటలను బట్టి తెలిసింది.
"ఇకనేం? ఆ బంగారం ఈ గుడ్డివాడిదే అయి ఉండాలి. నేను ఆడబ్బు వాడికి అందజేయటానికే వినియోగ పడ్డాను,” అనుకుని సాలె ఇంటిదారి పటాడు.
ఎం. కామేశ్వరరావు.
#చందమామ #చందమామకథలు #చందమామకథకులు #మాచిరాజుకామేశ్వరరావు #తెలుగుసాహిత్యం #బాలలసాహిత్యం #Chandamama #TeluguLiterature
No comments:
Post a Comment