*భట్టివిక్రమార్క కథలు-21*
(శ్రీ ఇచ్ఛాపురపు రామచంద్రం)
119/374
*మణిమంతుడి కథ*
పట్టువదలని విక్రమార్కుడు మరల మోదుగ చెట్టునెక్కి భేతాళుడిని తాళ్ళతో కట్టి భుజాన వేసుకుని మౌనంగా నడవసాగాడు.
అప్పుడు శవంలోంచి భేతాళుడు, "విక్రమార్కమహారాజా! నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను. విను. అంటూ ఇలా ప్రారంభించాడు.
ధరామండలంలో పుష్కరం అనే పట్నం ఉండేది. దానిని గ్రహభుజుడనే రాజు పాలించేవాడు.
అతని పుత్రిక మదనమాలిక. ఆమెకు ఈడు రాగానే రాజు ఆమెకి సకలవిద్యా ప్రవీణుడిని యిచ్చి వివాహం -చేస్తానని ప్రకటించాడు.
అది తెలిసి ఎందరో రాజకుమారులు తమ విద్యానైపుణ్యాన్ని ప్రదర్శించారు. కాని గ్రహభుజుడికి సంతృప్తికరంగా ఉండక తన పుత్రికను ఇవ్వడానికి అంగీకరింపలేదు.
చివరికి శ్రీపుర అధిపతి కుమారుడు మణిమంతుడు వచ్చి తనపాండిత్యం చూపాక రాజు సంతోషించి తన అమ్మాయికిచ్చి వివాహం చేశాడు. కూతురికీ అల్లుడికీ అనేక బహుమతులు యిచ్చి అత్తారింటికి పంపాడు.
ఒకనాడు మణిమంతుడూ మదనమాలికా మంచం మీద పడుకుని సరదాగా మాట్లాడుకుంటూంటే ఆ మంచం కింద చీమలు బారుకట్టి వస్తూ మంచానికి కొంచెం దూరంలో ఆగిపోయాయి. "ఎందుకాగిపోయారు?" అని వెనక చీమలు ముందు వాటినడిగాయి.
"ఇక్కడ రాజకుమారదంపతులు ఏకశయ్య మీదున్నారు. వారి మధ్యనుంచి వెళ్ళడం ధర్మవిరుద్ధమని ఆగిపోయాం." అన్నాయవి.
"అలా ఐతే ఆ మంచాన్నెత్తి అవతల పెట్టి మనం పోకూడదా?" వెనక చీమలడిగాయి.
"అలా చెయ్యవచ్చు. కాని మర్యాద ఉండాలి కదా?" అన్నాయి ముందు చీమలు.
ఈ సంభాషణ వింటున్న మణిమంతుడికి సర్వ ప్రాణుల భాషలూ తెలుసు కనుక వాటి మాటలు వింతగా తోచి ఫక్కున నవ్వాడు.
"ఎందుకు నవ్వుతారు? నా మాటలలో నవ్వు తెప్పించేదేమీ లేదే!" అడిగింది మదనమాలిని.
"నేను నవ్వింది నీ మాటలకి కాదు. కారణం వేరు. అది పరమరహస్యం."
"నాకు చెప్పడానికేం? నేను బయటపెట్టనుకదా. మీకు నా మీద నిజంగా ప్రేముంటే ఆ కారణం చెప్పండి. అప్పుడు కాని మీ ప్రేమను నమ్మను." అందామె మొండిగా.
"ఎందుకలా అంటావు? ప్రేమకీ ఈ రహస్యానికీ సంబంధమేమిటి? ఆ రహస్యం యితరులకి చెబితే నాకు మరణం సంభవిస్తుంది. అంచేత దానినడగకు." అన్నాడతను.
ఎలాగయినా ఆ రహస్యం తెలుసుకోవాలనే పట్టుదల పెంచుకున్న మదన మాలిక - “ఎంత చిత్రంగా మాట్లాడతారు! ఒకమాట చెబితేనే మరణం వొచ్చేస్తుందా? ఎందుకు నన్ను మరపించాలని చూస్తావు? ఆ రహస్యమేమిటో వింటేనే గాని నాకు తృప్తి కలగదు. నువ్వు మరణించినా సరే, అదేమిటో చెప్పు." అని పట్టుపట్టిందామె.
"నాకు జంతువుల భాష తెలుసు. చీమల మాటలు విని నవ్వాను. అది బయటపెడితే మరణిస్తాను. ఇది గురుశాపం. అంచేత ఒత్తిడి చెయ్యకు."
అని అతను బతిమాలినా వినకుండా ఆమె- "నువ్వు మరణించినా సరే, నేనా రహస్యం తెలుసుకోనిదే ఉండలేను." అందామె.
మణిమంతుడు విధిలేక.. కాటిలో తనకి చితిపేర్పించి.. భార్యతో అక్కడికి వెళ్ళి తాను చితిమీద పడుకుని.. చీమల సంభాషణ చెప్పబోతూంటే,
దగ్గరలోని పాడుపడిన బావి వద్ద మగ పొట్టేలు ఆడ గొర్రెను కలియబోగా,
"ఏం, దగ్గర కొస్తున్నావు? నీ కోరిక నేనొప్పుకోను." అందాడగొర్రె.
"ఎందుకని?" అడిగింది పొట్టేలు.
“నీకు నా మీద మునిపటిలా ప్రేమలేదని నా బుద్ధికి తోచింది. నిజంగా నీకంత ప్రేమే ఉంటే ఆ పాడుబావి మీద పెరిగిన మృదువైన గరికని తెచ్చి యివ్వు. అప్పుడు నీకు నామీద ప్రేముందని నమ్మి... నీ కోరికకి లొంగుతాను." అంది.
అందుకా పొట్టేలు - "ఆ గరిక బావి మీదుంది. దాని కోసం వెళ్తే బావిలో పడి చస్తాను. నీ షరతు మంచిది కాదు." అంది.
“ఏమిటీ! నా కోరిక తీర్చడంకంటే నీ ప్రాణం గొప్పదా? చస్తేచావు. ఆ గరిక తెచ్చి యివ్వక తప్పదు.
అదుగో! అటు చూడు. భార్యకి చెప్పకూడని నిజం చెప్పి చావడానికి కా రాజకుమారుడు సిద్ధంగా ఉన్నాడు, అని ఖచ్చితంగా చెప్పేసరికి పొట్టేలు కోపగించి - “ఓసీ దుష్టురాలా! నేను చస్తానన్నా నీ పట్టువదలవా! ఛీ! నీ ముఖం చూడకూడదు.
నీతో కలియనంత మాత్రాన నష్టమేమీ లేదు. ప్రాణముంటే నీలాటి భార్యలను ఎందరినైనా
సంపాదించవచ్చును. కాని నేనలా రాజకుమారుడిలా బుద్ధిహీనుణ్ణి కాదు. నువ్వు చెప్పినట్లు చెయ్యను." అని నిరాకరించింది.
ఆ సంభాషణ వినగానే మణిమంతుడు చితిమీద నుంచిలేచి 'జంతువులే అంత వివేకంతో ప్రవర్తిస్తూంటే మనిషి నైన నేను భార్యకి లోబడి దాని యిష్టం తీర్చడానికి ప్రాణం వదలడానికి సిద్ధపుతున్నాను.
ఎంత బుద్ధిహీనత!
దీనికీ రహస్యం చెప్పడమెందుకు, నేను చావడమెందుకు? - అని నిశ్చయించుకుని రహస్యం వినాలని తన దగ్గరగా వచ్చి నిలుచున్న భార్యకు "ఫో! ఆ రహస్యం చెప్పను. నువ్వు అలిగి నాకు దూరంగా ఉంటానంటే అలాగే ఉండు.
నీలాటి భార్యలైతే ఎందరైనా వస్తారు కాని ప్రాణం ఒకసారి పోతే మరి రాదు." అని తన మందిరానికి వెళ్ళిపోయాడు.
తన పంతం నెరవేరనందుకు చింతిస్తూ మదనమాలిక కూడా వెళ్ళిపోయింది.
భేతాళుడు. రాజా! వీరిలో బుద్ధిమంతుడెవరో చెప్పు." అని అడిగాడు
"జంతువయినా తెలివి ఉపయోగించి తన భార్య చెప్పిన ఆ కార్యాన్ని చేయడానికి తిరస్కరించి మానవుడైన రాజకుమారుడికే తెలివి వికసించేలా చేసిన పొట్టేలే యోగ్యమయిన బుద్ధికలది." అని చెప్పాడు విక్రమార్కుడు.
విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కాగానే భేతాళును కట్లు విడిపించుకుని రివ్వున ఎగిరిపోయి మోదుగ చెట్టుకొమ్మకి తలకిందులుగా వ్రేలాడసాగాడు.
విక్రమార్కుడు మళ్ళీ అతని కోసం బయలుదేరాడు.
(సశేషం)
No comments:
Post a Comment