*కుందేలు విందు*
రచన : కూచిమంచి నాగేంద్ర.
కొండవీటి అడవిలో జంతువులన్నీ కలిసిమెలిసి వుండేవి. అక్కడ సరళం అనే కుందేలు వుంది. అది రోజంతా కష్టపడుతూ ఆహారం సంపాదించి దానిలో కొంత ముసలి జంతువులకు, పిల్ల జంతువులకు పెట్టేది. దానితో అక్కడి జంతువులన్నీటికి సరళం అంటే అభిమానం. కానీ కృతకం అనే నక్క మాత్రం సరాళాన్ని ఎప్పుడెప్పుడు తినేయాలా అని చూస్తూ వుండేది.
జంతువులన్నీటికి సరళం అంటే అభిమానం కనుక దాన్ని ఏమన్నా చేసింది తానే అని తెలిస్తే అవి వూరుకోవు అనే భయం. ఒక రోజు తన నేస్తమైన తోడేలుకి విషయం చెప్పింది.
“ ఓసి ఇంతేనా ముందు సరళం మీద వుండే అభిమానం పోగొడితే సరి. జంతువులు దాన్ని చీదరించు కుంటాయి తరవాత నీ పని సులువు అవుతుంది” అంది తోడేలు. ఆ రోజు నుండి నక్క సరళాన్ని ఎప్పుడెప్పుడు చెడ్డ చేయాలా అనే ఆలోచన చేస్తూ వుండేది. ఒకరోజు సరళం అన్ని జంతువులని విందుకి పిలిచింది.
“ ఎందుకు సరళం కష్టపడి జంతువులకి విందు ఇవ్వడం” అంది కోయిల. “ మా అమ్మ చెప్పేది ఒకరి ఆకలి తీరిస్తే ఎంతో పుణ్యం వస్తుందని అందుకే నేను ఎప్పుడూ ఇతరుల ఆకలి తీర్చడానికి ప్రయత్నం చేస్తుంటా ” అంది సరళం.
ఈసారి జీవులకి స్వయంగా వండి పెట్టాలి అనుకుంది సరళం. సరళం చేసే హడావిడి చూస్తోంది కృతకం. అదే అవకాశం విందుకి ఏనుగు మంత్రి కూడా వస్తుందని తెలిసి సరళం వండే వంటలో ఏదన్నా కలిపేస్తే సరి అన్నీ దాని ఛీదరించు కుంటాయి అనుకుంది. దారిలో కనిపించిని కాకమ్మను “ ఇక్కడ కుంకుడు చెట్టు ఎక్కడుంది” అని అడిగినది. “ ఇప్పుడు అదెందుకు ” అంది కాకి.
“ సరళం విందుకు పిలిచింది కదా , తలారా స్తానం చేసి వస్తాను” అంది కృతకం. సరే .. అని దానికి కుంకుడు చెట్టు ఎక్కడ వుందో చెప్పింది కాకి. కానీ దానికి కృతకం మీద అనుమానం వచ్చింది.
తరువాత సరళం ఇంటి దగ్గర గుమ గుమ లాడుతున్న పాయసం లో ఎవరు చూడకుండా కుంకుడు రసం కలిపింది కృతకం. సరళం ఎప్పుడెపుడు వడ్డన చేస్తుందా అని చిన్న చిన్న జంతువులన్నీ ఎదురు చూస్తున్నాయి. “వడ్డన చేసేటప్పుడు ముందు పాయసం కృతకానికి రుచి చూపించు అప్పుడు అందరికీ వడ్డించవచ్చు” అంది కాకి.
“ నాకు రుచి చూడడం రాదు” అని తప్పించుకో బోయింది కృతకం. “ నీకు రుచి చూడడం రాక పోవడం ఏమిటి ఎవరేమి తెచ్చినా మృగరాజుకి అన్నీ రుచి చూసి పెడతావు కదా” అంది ఏనుగు మంత్రి.
“కృతకానికి అన్నీ తెలుసు కానీ పాయసం రుచి చూడలేదు ఎందుకంటే దానిలో కుంకుడు రసం కలిపింది అదే “ అంది కాకి. ” ఛీ.. ఛీ ..ఒకరికి పెట్టడం చేతకాదు కానీ పాడు చేయడం మాత్రం వచ్చు” అని చీవాట్లు పెట్టాయి జంతువులు.
మిగిలిన పదార్ధాలతో విందు ఘనంగా సాగింది. ఇక సరళాన్ని ఏమి చేయలేము అని మౌనంగా విందులో పాల్గొంది కృతకం.
కూచిమంచి నాగేంద్ర.
కథామంజరి లో ప్రచురణ.
No comments:
Post a Comment