Tuesday, September 1, 2026

 *వానలేదు వంగడలేదు. ఏమిటో ఈ వంగడ ?*
.........................

కరువనేది దీర్ఘకాలం పాటు వర్షాలు లేకపోవడం వల్ల జీవనం తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి. ఆహారం,త్రాగునీరు కొరత ఏర్పడి మానవులతో పాటు పశుపక్ష్యాదులు కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటాయి.ఈ పరిస్థితి కొన్ని సందర్భాల్లో వరుసగా అనేక సంవత్సరాలు కొనసాగవచ్చు. దీనికి భిన్నంగా కాటకం అనేది తుఫానులు వరదలు అగ్నిప్రమాదాలు భూకంపాలు అంటువ్యాధులు యుద్ధాలు అతివృష్టి అనావృష్టి వంటి కారణాల వల్ల సంభవించే తాత్కాలిక దుర్భిక్ష పరిస్థితి.అయితే ఈ దుర్భిక్షం దీర్ఘకాలం కొనసాగితే అది కూడా క్రమంగా కరువుగా పరిణమిస్తుంది.

వ్యవసాయ ఆధారిత సమాజాల్లో వర్షానికి అత్యంత ప్రాధాన్యం ఉంది.వర్షాలు లేకపోతే పొలాలను దున్నడం,దుక్కి చేయడం,నాట్లు వేయడం,కలుపు తీయడం వంటి వ్యవసాయ కార్యకలాపాలు జరగవు.ముఖ్యంగా వరిసాగులో రైతులు,కూలీలు గంటల తరబడి వంగివంగి నాట్లు వేయవలసి ఉంటుంది. అందువల్ల గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులను సాధారణంగా వంగడమనే పదంతో సూచిస్తారు.ఈ నేపథ్యంలోని జానపదుడు తన ఆర్థికసామాజిక కష్టాలను వానలేదు – వంగడలేదనే జాతీయం ద్వారా వ్యక్తం చేశాడు. ఇక్కడ వంగడ అనే పదానికి నారు లేదా పైరు అనే అర్థం కాదు.వర్షాలు లేకపోవడం వల్ల వ్యవసాయ పనులు లేకపోవడం ముఖ్యంగా వంగి చేసే నాట్లు కలుపు వంటిపనులు జరగకపోవడం అనే అర్థం. అంటే వాన లేకపోతే వ్యవసాయ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోతాయని ఈ జాతీయం సూచిస్తుంది.

రైతుకు ఎంత ప్రాధాన్యం ఉందో వ్యవసాయ కూలీకి కూడా అంతే ప్రాధాన్యంవుంది. వర్షాలు బాగా కురిసి చెరువులు కుంటలు వాగులు వంకలు ఏర్లు బావులు నదులు నీటితో నిండివున్నప్పుడు రైతులతో పాటు కూలీలకు కూడా పని బాగా దొరుకుతుంది.ఆ పనుల ద్వారా సంపాదించిన కూలీ డబ్బుతో లేదా ధాన్యంతో వారు తమ జీవనాన్ని సాగిస్తారు.అయితే వర్షాలు లేకపోతే కూలీలకు పని దొరకదు.ఆదాయం లేక కుటుంబ పోషణ కష్టసాధ్యమవుతుంది. ఈ వాస్తవాన్నే జానపదుడు కూలీ పోతే కుండకాలు  అనే జాతీయంలో ప్రతిబింబించాడు. పూర్వకాలంలో కూలీ సంపాదనతోనే ఇంట్లో పొయ్యి మీద కుండ పెట్టి అన్నం వండుకునేవారు. కూలీ లేకపోతే కుండలో వండడానికి ధాన్యం ఉండదు.అప్పుడు ఆ కుండ వంటకు కాకుండా ఎండకు కాలడం మాత్రమే జరుగుతుంది. అందుకే వానలేదు – వంగడలేదు.కూలీనాలీ లేదు కనుక కుండకాలు అనే భావన గ్రామీణ జీవనంలోని ఆర్థిక వాస్తవాన్ని పరిస్థితులను ప్రతిబింబిస్తుంది.

అలాగే కుండల శుభ్రత విషయంలోనూ గ్రామీణ సమాజం ఎంతో జాగ్రత్త వహించేది.పూర్వం కుండలను బూడిద చింతపండు కొబ్బరి పీచు, వరిగడ్డి వంటి సహజపదార్థాలతో శుభ్రంచేసి ఎండలో ఆరబెట్టేవారు. సూర్యరశ్మిలోని అతి నీలలోహిత కిరణాలు క్రిమికీటకాలను నశింపజేస్తాయని అనుభవపూర్వకంగా వారు గ్రహించారు.కుండ శుభ్రంగా ఉంటేనే ఆహారం ఆరోగ్యకరంగా ఉంటుందని తెలుసుకున్నారు. ఈ సందర్భంలోనే వేమన ఇలా ఉపదేశించాడు.

ఆత్మశుద్ధిలేని యాచార మదియేల ?
భాండశుద్ధి లేని పాకమేల ?
చిత్తశుద్ధిలేని శివపూజ లేలరా ?
విశ్వదాభిరామ వినుర వేమ.

మనసుశుద్ధి లేకుండా పూజలులు చేసినా ప్రయోజనం లేదని అలాగే కుండ శుభ్రంగా లేకపోతే వంటకూ విలువ లేదని వేమన ఈ పద్యంలో స్పష్టం చేశాడు.కరువు కాలంలో వ్యవసాయ పనులు లేక కూలీలు ఉపాధి కోల్పోయి కుండలు ఖాళీగా మారిపోవడం గ్రామీణ జీవితంలోని విషాద వాస్తవం.అంటే ఎండకు పెట్టిన కుండలు పొయ్యి మీదకెక్కి కాలవని అర్థం.            *ఆధ్యాత్మిక కుటుంబం*                        

No comments:

Post a Comment