Tuesday, September 1, 2026

 "మిత్రప్రేమ"

      గంగా తీరాన ఒక గ్రామంలో జయ ప్రతాపులని ఇద్దరు క్షత్రియ కుమారులుండేవారు. వారు పసితనం నుంచీ కూడా అత్యంత స్నేహితులు. వారు యుక్త వయస్సు వచ్చేవరకు విద్యాభ్యాసం చేసి, ఏ రాజుల వద్దనైనా కొలువు చేసుకోవటానికి చెరొక వేపూ వెళ్ళారు.

వారిలో జయుడు అమరావతీ నగరంలో విదర్భదేశపు రాజు వద్ద కొలువు సంపాదించి, తన శౌర్య విశ్వాసాల చేత తన ప్రభువును మెప్పించి పైకి వచ్చాడు. అదే విధంగా ప్రతాపుడు ఉజ్జయినీ నగlరంలో మాళ్వదేశపు రాజు వద్ద కొలువులో ప్రవేశించి పేరు ప్రతిష్ఠలు తెచ్చు కున్నాడు.

పన్నెండేళ్లపాటు బాల్యమిత్రులు ఒకరినొకరు చూసుకోకుండానే కాలం జరిగిపోయింది. కాని వారు ఒక్కనాడు కూడా ఒకరినొకరు మరవలేదు. అమరావతి నుంచి ఎవరైనా ఉజ్జయినికి పోతుంటే వారి వెంట జయుడు తన మిత్రుడికి అపూర్వమైన వస్తువులు కానుకగా పంపేవాడు. అదే విధంగా ఉజ్జయిని నుంచి అమరావతి వెళ్లే వారి వెంట ప్రతాపుడు జయుడికి కానుకలు పంపుతూండేవాడు.

కొంతకాలానికి జయుడికి తన బాల్య మిత్రుణ్ణి కళ్ళారా చూడాలని తీవ్రమైన కోరిక కలిగింది. అతను రాజుగారి వద్ద సెలవు తీసుకుని బయలుదేరి అమరావతి నుంచి ఉజ్జయినికి వెళ్ళాడు. ప్రతాపుడి ఆనందానికి మేరలేదు. అతను జయుడికి తన ఇంట సమస్తమైన సౌకర్యాలు అమర్చాడు. కాని ప్రతాపుడి సత్కారాలన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మారినట్టు కనబడ్డాయి.

ఆరోజు కారోజు గడుస్తున్న కొద్దీ జయుడు తిండి తినటమూ, నిద్రపోవటమూ మానేసి, చిక్కి నీరసించసాగాడు. దీనికి కారణమేమంటే, ప్రతాపుడి ఇంట జయుడికి ఒక చక్కని ఆడపిల్ల కనిపించింది. ఆమెను చూసినది మొదలు అతనికి ఆ పిల్ల ధ్యాస తప్ప మరొకటి లేకుండా పోయింది.

''ఏమిటిది, జయా ? ఎందుకలా చిక్కి పోతున్నావు? నీ ఒంట్లో సరిగా లేదా? వైద్యుణ్ణి పిలిపించనా?" అని ప్రతాపుడు తన మిత్రుణ్ణి ఆత్రంగా అడిగాడు.

"నీకన్న నాకు ఆప్తులెవరున్నారు? నిజం చెప్పేస్తాను. మీ ఇంట ఒక అందగత్తెను చూశాను. ఆమెను పెళ్ళాడని పక్షంలో నేను చచ్చి తీరుతాను," అన్నాడు జయుడు.

"ఆ పిల్ల పేరు మనోరమ. ఆమెకు తలిదండ్రులు లేరు. కాని చాలా ఆస్తి గలది. మా యింటనే పెరుగుతున్నది. నేను పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను. అయితే నువు ఆమెను ఇంతగా ప్రేమిస్తున్నావు గనక, నువే చేసుకో,” అంటూ ప్రతాపుడు జయుణ్ణి బలవంతాన ఒప్పించి, మనోరమనిచ్చి పెళ్లి చేసేశాడు. మరి కొద్ది రోజులకు జయుడు మనోరమతో సహా ఉజ్జయిని నుంచి అమరావతికి తిరిగి వెళ్ళాడు.

కొద్దికాలం గడిచింది. ఉజ్జయినీ రాజు చనిపోయి యువరాజు సింహాసనం ఎక్కాడు. గిట్టనివాళ్ళు ప్రతాపుడి మీద చాడీలు చెప్పి అతనిని కొలువులో నుంచి తొలగించారు. త్వరలోనే ప్రతాపుడు అతి బీదస్థితికి వచ్చాడు. అతనికి ఏమి చెయ్యటానికీ తోచలేదు. చుట్టుపక్కల అందరూ శత్రువులుగా మారిపోయారు.

ఈ స్థితిలో జయుడు ఒక్కడే దిక్కనిపించి ప్రతాపుడు కట్టుబట్టలతో అమరావతీ పట్టణానికి బయలుదేరి వెళ్ళాడు. అతను నగరం ప్రవేశించేసరికి బాగా చీకటి పడింది." ఈ చీకట్లో, ఈ మాసిన బట్టలతో, వికృతాకారంతో, పెరిగిపోయిన గడ్డంతో వెళితే జయుడు నన్ను గుర్తిస్తాడో, గుర్తించడో. ఈ రాత్రికి ఎక్కడైనా తల దాచుకొని, రేపు ఉదయం అతన్ని చూస్తాను," అనుకొని ప్రతాపుడు ఆ రాత్రి గడపటానికి దాపుల వున్న ఒక శ్మశానం వేపు వెళ్లాడు.

అక్కడ అతను ఒకచోటు చూసుకుని పడుకున్నాడు. కాని నిద్రపట్టలేదు. ఒక రాత్రివేళ అక్కడికి ఇద్దరు మనుషులు వచ్చారు. వారి సంభాషణ చూస్తూండగానే పోట్లాటగా పరిణమించింది. చివరకు ఒకడు బాకు తీసి రెండోవాణ్ణి పొడవ బోయాడు. రెండవవాడు కూడా బాకు తీసి మొదటివాణ్ణి పొడిచాడు. బాకు దెబ్బతిన్నవాడు పెద్ద కేక పెట్టి పడి పోయాడు. పొడిచినవాడు కంగారుపడి పరిగెత్తుకొంటూ ప్రతాపుడు పడుకున్న వేపుగా వెళ్ళిపోయాడు.

ఇద్దరు వ్యక్తులు పోట్లాడటమూ, ఒకడు మరొకణ్ణి పొడిచి పారిపోవటమూ మొదలైనవి ప్రతాపుడిలాగే, ఆ అపరాత్రి వేళ మరికొందరు కూడా చూశారు. వాళ్ళు హంతకుడు పరిగెత్తిన దిక్కుగా పరుగున వచ్చి ప్రతాపుణ్ణి చూసి, అతనే హంతకుడనుకుని, అతన్ని పట్టుకుని కొత్వాలు వద్దకు తీసుకుపోయారు. కొత్వాలు ప్రతాపుణ్ణి తెల్లవార్లూ ఖైదులో వుంచి, మర్నాడు భటుల వెంట న్యాయస్థానానికి పంపాడు.

ప్రతాపుణ్ణి వీథి వెంబడి తీసుకు పోతూండగా, జయుడు చూసి గుర్తించి, "ఏమిటిది ? ఇతన్ని ఎక్కడికి తీసుకు పోతున్నారు?" అని భటులను అడిగాడు.

"నిన్న రాత్రి శ్మశానంలో ఈ మనిషి మరొక మనిషిని హత్య చేశాడు. విచారణకు తీసుకుపోతున్నాం." అన్నారు భటులు.

"పిచ్చివాళ్లల్లారా, శ్మశానంలో హత్య చేసినవాణ్ణి నేను, ఇతన్ని విడిచేసి నన్ను పట్టుకు పొండి." అన్నాడు జయుడు.

"ఇతనెవరో నాకు తెలీదు. శ్మశానంలో రాత్రి హత్య చేసింది నేనే, పదండి." అన్నాడు ప్రతాపుడు.

భటుల కేమీ పాలుపోక ఇద్దర్నీ పట్టుకుని న్యాయస్థానానికి తీసుకుపోయారు. న్యాయాధికారి ఇద్దరినీ విచారించి కూడా హంతకుడెవరో నిర్ణయించలేకపోయాడు. ''ఈ యిద్దరిలో ఒకడు హంతకుడు, రెండోవాడు పిచ్చివాడు. ఎవరెవరో నిర్ణయించటం నా తరం కాదు. ఇద్దర్నీ తీసుకుపోయి కొరత వెయ్యండి!" అని ఆయన చివరకు తీర్పు చెప్పాడు.

భటులు జయప్రతాపుల నిద్దరినీ వధ్య స్థానానికి తీసుకుపోయి, అక్కడికి వచ్చిన కొత్వాలుకు న్యాయాధికారి తీర్పు అందజేశారు. శిక్ష చూడటానికి అమరావతీ పౌరులు చాలామంది గుమికూడారు. వారిలో అసలు హంతకుడు కూడా వున్నాడు. అధికారులు తనను పట్టుకోలేక పోగా ఇద్దరు నిర్దోషులను కొరత వేయిస్తూండటం చూసి హంతకుడికి మండి పోయింది. వాడు కొత్వాలు దగ్గిరికిపోయి, మీ న్యాయం అఘోరించినట్టే ఉంది! అసలు హంతకుణ్ణి నేను. వీళ్ళిద్దరినీ విడిచిపుచ్చి నన్ను కొరత వేయించండి!" అన్నాడు.

విచారణ చెయ్యనివాణ్ణి శిక్షించటానికి కొత్వాలుకు అధికారం లేదు. ముద్దాయిల సంఖ్య రెండు నుంచి మూడుకు పెరిగింది. కొత్వాలు ముగ్గురినీ వెంటబెట్టుకొని న్యాయస్థానానికి వెళ్ళాడు.

'' ఈ హత్యానేరం విచారణ చేసి శిక్ష విధించానే?" అన్నాడు న్యాయాధికారి. "ఇప్పుడు మరొక హంతకుడు దొరికాడు. తమరు ముగ్గురినీ కలిపి విచారించండి." అన్నాడు కొత్వాలు.

ఈసారి విచారణలో జయ ప్రతాపులు తాము హంతకులు కానట్టు ఒప్పుకున్నారు. "నువు హంతకుడవు కానప్పుడు ఔనని ఎందుకన్నావు?" అని న్యాయాధికారి జయుణ్ణి అడిగాడు.

''అయ్యా, ఈ ప్రతాపుడు నా ప్రాణ స్నేహితుడు. నా కోసం తన సర్వస్వమూ ధారపోసినవాడు. అతన్ని భటులు హత్యా నేరం పైన పట్టుకుని తీసుకుపోతుంటే, అతన్ని తప్పించటానికి ఆ నేరం నా పైన వేసుకున్నాను." అన్నాడు జయుడు. 

"నీ మాటేమిటి?" అని న్యాయాధి కారి ప్రతాపుణ్ణి అడిగాడు.

"నా మిత్రుడు తానే హంతకుణ్ణి అనే సరికి నమ్మి, అతన్ని తప్పించటానికి హత్యానేరం నా పైన వేసుకున్నాను. అంతకంటె ఏమీ లేదు." అన్నాడు ప్రతాపుడు. న్యాయాధికారి అసలు హంతకుడి వైపు తిరిగి, "నీ మాటేమిటి? వాళ్ళిద్దరినీ కొరత వేయబోయేదాకా నిజం చెప్పని వాడివి, అప్పుడెందుకు చెప్పావు?" అని అడిగాడు.

"అయ్యా, నా చేత చచ్చినవాడు పాపి, ద్రోహి. అయినా వాణ్ణి ఆత్మరక్షణార్థమై మాత్రమే చంపవలసి వచ్చింది. వాణ్ణి చంపినందుకు న్యాయంగా మీరు నన్ను
సన్మానించవచ్చు. కాని అలా చేయరు. కొరత వేస్తారు. అందుకని నేను బయట పడలేదు. కాని నాకు బదులుగా ఇద్దరు మనుషులు, ఏ పాపమూ ఎరగనివారు కొరత పడితే, నేను నరకానికి పోనా ? అందుచేత నా నేరం బయటపెట్టాను. నేను బయటపడటానికి కారణం కొత్వాలు గారి సమర్థత కాదు, అసమర్థత,” అన్నాడు అసలు హంతకుడు.

న్యాయాధికారి దూరం ఆలోచించి ముగ్గురినీ విడిచి పుచ్చుతూ, ''నీవు హత్య చేసినప్పటికీ చాలా యోగ్యుడివిగా కనబడుతున్నావు. నిన్ను వదిలేసినందువల్ల ఇంకా హత్యలు జరగవనీ, నీకు మనుషుల ప్రాణాల పట్ల గౌరవం ఉన్నదనీ గుర్తించి నిన్ను విడిచిపుచ్చుతున్నాను.'' అన్నాడు.

తరవాత ప్రతాపుడు జయుడి దగ్గిరే ఉండి, అతని ద్వారా రాజుగారి కొలువులో నౌకరీ సంపాదించాడు. అప్పటినుండీ మిత్రులిద్దరూ ఒకరినొకరు జీవితాంతం దాకా ఎడబాయక, సుఖంగా జీవించారు.

No comments:

Post a Comment