*విశ్వరూపుడు*
పరీక్షిత్తు శ్రీ శుకుని ఇలాగ ఒక ప్రశ్న అడిగాడు. *“దేవగురువైన బృహస్పతి స్థానంలో త్వష్ట పుత్రుడైన విశ్వరూపుడు దేవ గురువు కావడం ఎలా జరిగింది?”*
దానికి శ్రీశుకుడు ఇలాగ జవాబు చెప్పాడు. గర్వమదాంధుడైన ఇంద్రుడు ఒకనాడు కొలువు తీరి వున్నాడు. వసువులు, మునులు స్తుతిస్తున్నారు. అప్సరసలు ఆడుతూ పాడుతున్నారు. ఆ సమయాన దేవతల గురువు బృహస్పతి ప్రవేశించాడు. శిష్ట సంప్రదాయం ప్రకారం ఎదురేగి ఆహ్వానించకుండా ఇంద్రుడు తన స్థానం నుండి లేవకుండా గురువుగారిని అలక్ష్యం చేశాడు. బృహస్పతి దుఃఖితుడై వెళ్ళిపోయాడు.
ఇంద్రుడు తెలివి తెచ్చుకుని, గురుద్రోహాన్ని గ్రహించి, క్షమాపణ కోరడానికి గురుగృహానికి వెళితే, ఆయన కనిపించ లేదు. బృహస్పతి జాడలేదని తెలిసిన అసురులు, దేవతలపై దండెత్తి వచ్చారు. ఇద్దరి మధ్య గొప్ప యుద్ధం జరిగింది. అసురులదే పైచేయి కాగా, దేవతలంతా పారిపోయి బ్రహ్మదేవుని ఆశ్రయించారు. బ్రహ్మ దేవతలను ఇలాగ మందలించాడు.
“దేవతలారా! మీరు జన్మించిన లగాయతు మీకు విద్యాబుద్ధులు నేర్పి, యోగక్షేమాలను కనిపెట్టిన బ్రహ్మజ్ఞాని, సర్వ శ్రేయోభిలాషి పూజనీయుడైన ఆ మహాత్ముని అవమానించి తీరని అపచారం చేశారు కదా! రాక్షసులైనా వారు తమ గురువు శుక్రాచార్యులను ఎంతగా గౌరవిస్తున్నారో మీరు చూడలేదా? మీ దురహంకారమే మిమ్మల్ని ఈ దుస్థితికి తెచ్చింది. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకొని, 'త్వష్టు అనే మనువు పుత్రుడైన విశ్వరూపుని గురువుగా వుండమని ప్రార్థించి, వేడికోండి. అతడు మహాతపస్వి. మీ కోరిక మన్నిస్తాడు. అతని తల్లి బంధువులు కనుక మీ పట్ల కొంత సానుభూతి ఉండవచ్చు. అయినా దానిని మీరు పట్టించుకోనవసరం లేదు.”అని బ్రహ్మదేవుడు చెప్పాడు.
ఇంద్రాది దేవతలందరూ విశ్వరూపుని దగ్గరకు పోయి గురువుగా ఉండమని ప్రార్థించారు. పిన్నవాడు, బ్రహ్మచారీ అయిన విశ్వరూపుడు గురువుగా వుండటానికి సందేహించాడు. తన తపశ్శక్తి క్షీణిస్తుందన్నాడు. అయినా దేవతలు వదలిపెట్టలేదు. ఎలాగో లోకకళ్యాణం కోసమేనని చెప్పి ఒప్పించారు.
విశ్వరూపునకు శ్రీ నారాయణ కవచమనే మంత్రం తెలుసు. ఈ మంత్రం అతి శక్తివంతం. విజయం చేకూరుస్తుంది. దీనిని విశ్వరూపుడు ఇంద్రునికి బోధించాడు. దానితో అతడు నారాయణుని రక్షణ పొందాడు. ఈ కవచాన్ని ధరించినవానిని చూచినా, తాకినా సర్వభయాలు నశిస్తాయి.
పూర్వం కౌశికుదడనే బ్రాహ్మణుడు ఈ కవచాన్ని ధరించి, యోగసిద్ధి ద్వారా ఒక ఎడారిలో దేహత్యాగం చేశాడు. చిత్రరథుడు భార్యలతో విమానంలో వెళ్తుండగా, ఆ విమానం నీడ కౌశికుని అస్థిపంజరం మీద పడగా, విమానం కదలలేక క్రింద పడిపోయింది. ఏమీ తోచక చిత్రరథుడు అనే ఆ గంధర్వుడు నేలమీద భార్యలతో సహ పడివుండగా, వాలఖిల్యుడనే ముని ఆ దారిన వెళుతూ, వీరిని చూచి ఇలా అన్నాడు. “ఇది నారాయణ కవచ ప్రభావం. దీన్ని ధరించిన బ్రాహ్మణుని అస్థి పంజరం ఇది. దానిపై నీ విమానపు నీడ పడడం వల్ల నీకీ గతి పట్టింది. నీవు ఈ పుణ్యాత్ముని అస్థికలను తీసికొనిపోయి సరస్వతీ నదిలో కలిపి వస్తేనే, నీ కష్టం తొలగేది” అనిచెప్పాడు.
ఇంతటి శక్తిగల మంత్రాన్ని విశ్వరూపుడు ఇంద్రునికి ఉపదేశించాడు. అతడు శ్రీ నారాయణుని రక్షణలో అసురులను జయించాడు. దేవతలకు గురువు లేని లోటు తీరింది. అని శ్రీ శుకుడు పరీక్షిత్తుతో చెప్పాడు.
సుర పురోహితుడైన విశ్వరూపునకు మూడు శిరస్సులు. ఒక శిరస్సుతో సురాపానం, రెండవ శిరస్సుతో సోమరసపానం, చేస్తాడు. మూడవది అన్నం తినేది. అతని తల్లి అసుర స్త్రీ కావడం చేత యజ్ఞయాగాల్లోని హవిర్భాగాన్ని ఇతరులకు తెలియకుండా అసురులకు కూడ కొంత ఇస్తుండేవాడు. ఇది ఇంద్రుడు తెలుసుకొని, బ్రహ్మదేవుని మాట లెక్కచేయకుండా, గురువు అని ఆలోచన లేకుండా, విశ్వరూపుని మూడు శిరస్సులను ఖండించాడు. మూడు శిరస్సులు కపింజలము, కలవింకము, తిత్తిరి అనే మూడు పక్షులై బ్రహ్మహత్య చేసిన మహాపాతకుడవు అని అంటూ ఇంద్రుని చుట్టూ తిరుగుతుండేవి.
అతడు ఆ బాధ భరించలేక, ఆ పాపాన్ని స్వీకరించి, నాలుగు భాగాలుగా విభజించి, భూమికి, నీటికి, వృక్షాలకు, స్త్రీలకు పంచివేస్తాడు. దాని ఫలితంగా భూమికి చెవిటి దోషం, నీటికి నురుగు, బుడగల దోషం, వృక్షాలకు చిగురు దోషం, స్త్రీలకు బుతుస్రావ దోషం కలిగాయి. తన పాపాన్ని భరిస్తున్నందుకు ప్రతిఫలంగా భూమిని త్రవ్వితే దానంతట అదే పూడుకొని పోయేటట్టు, మాలిన్యాలను శుభ్రం చేసే గుణాన్ని నీటికి, నరికినా చిగిర్చే గుణాలు చెట్లకు, కామభోగాన్నివ్వగల శక్తిని స్త్రీలకు ఇచ్చాడు. *ఆధ్యాత్మిక కుటుంబం*
No comments:
Post a Comment