ప్రాణభీతి
మృత్యువు ఎవరి మీద ఆపేక్ష చూపదు. ఎవరినీ ద్వేషించదు. ఎవరి పక్షపాతీ కాదు. పండితులు, పామరులు ధనిక, పేద అన్న తేడా లేనే లేదు. ఏ వయసు వారైనా దానికి ఒకటే. ఎవరినీ ఉపేక్షించదు. ప్రాణి ఆయువు తీరగానే తన విధిని నిర్దాక్షిణ్యంగా నెరవేర్చే సమదర్శి నిర్వికార స్వభావి.
పుట్టిన ప్రతి జీవికి చావు తప్పదు. ఈ సత్యం తెలియడానికి ఏ జ్ఞానమూ అవసరం లేదు. ఇంగిత జ్ఞానం చాలు. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో నిత్యం కంటికి కనిపించే అత్యంత సాధారణ విషయం... మరణం. ఈ భూమి నుంచి ప్రాణులన్నిటికీ సహజాతి సహజమైన నిష్క్రమణం మన రక్తసంబంధీకులైన, ఆప్తులైన, ఆత్మీయులైన వారి విషయంలో జరిగినప్పుడు తల్లడిల్లిపోతాం! మనకూ అది తప్పదన్న ఆలోచన వస్తే భీతిల్లిపోతాం. చావు తథ్యమన్న సత్యాన్ని బుద్ధి గ్రహించినంత త్వరగా, మనసు అంగీ కరించదు. ఈ శరీరం మీద మమకారం, భ్రాంతి, ప్రేమానుబంధాల బంధం అది. సృష్టి ఆరఃభం నుండి ఇప్పటివరకు ఏ జీవీ శాశ్వతంగా ఇక్కడ ఉండిపోలేదు! పుట్టారు.. గిట్టారు. మృత్యువు ఎవరికీ మినహాయింపు ఇవ్వ లేదు. ఈ సత్యాన్ని ఆకళింపు చేసుకున్న వారు మృత్యువు అంటే భయపడరు. తమ లక్ష్యాలను త్వరత్వరగా చేరుకునే ప్రయత్నం చేస్తారు. అయితే, మరణాన్ని నిలువరించేందుకు లేదా వాయిదా వేసేందుకు ప్రయత్నించిన వారు మన ఇతిహాసాల్లో ఉన్నారు. యయాతి అనే రాజు శాప ఫలితంగా తనకు ప్రాప్తించిన అకాల వార్ధక్యం నుంచి బయట పడేందుకు కొడుకు పరీక్షిన్మహారాజు తక్షకుని నుంచి తప్పించుకునే ఆశతో ఒంటిస్తంభపు మేడ కట్టించుకుని దాగుండటంలో... ఉన్నది ప్రాణభీతే. మానసిక పరిపక్వతతో యయాతికి, విజయమో వీరస్వర్గమో అన్న కృతనిశ్చయంతో దుర్యోధనుడికి, పురాణకథలను వినడంతో పరీక్షిత్తుకు మృత్యుభయం తొలగింది. ఆ భయం తొలగినప్పుడే ధైర్యం వస్తుంది. అంతిమయాత్రకు కావాల్సిన మానసిక సంసిద్ధత లభిస్తుంది.
దీర్ఘాయుష్షు కోసం, అమరత్వం కోసం ప్రయత్నాలు చేశారు. శక్తియుక్తుల్ని వ్యర్థం చేసుకున్నారు. జ్ఞానోదయం అయ్యింది. ఈ భూమి మీద మన ఉనికికి అర్థం ఒనగూరాలంటే మంచిని సంపాదించుకోవాలి. మంచి పనులు చేయాలి. మనిషిని జంతుప్రపంచం నుంచి వేరుచేసి ప్రత్యేకతను చాటేది అతని ఆలోచనాశక్తే. అది నిరంతరంగా కొత్త పుంతలు తొక్కుతూనే ఉంది. దానికి వివేకం తోడైతే మనిషి చేసే పనులు అర్థవంత మైనవీ, లోకప్రయోజనకరమైనవీ అవుతాయి.
ప్రేమ, కరుణ, పరోపకారం, శాంతి, క్షమ, సహానుభూతి... అనే మానవీయ లక్ష ణాలు మనిషిని ఉన్నతుణ్ని చేస్తాయి. వీటిని తమ జీవితాలలో ఆచరించినవారు, భౌతి కంగా భూమిమీద లేకున్నా, వారి గొప్పదనం నిలిచిపోతుందనటానికి సాక్ష్యం... మన ముందున్న ఎందరో మహానుభావుల జీవితకథలు. నిజానికి మనిషికి అమరత్వాన్ని ఇచ్చేది ఇదే కదూ! మృత్యువును జయించటమన్నా అదేగా?!
బొడ్డపాటి చంద్రశేఖర్
No comments:
Post a Comment