🌳 క్రాస్ వర్డ్ పజిల్ 🌹
"శ్శశానం ఎక్కడ ఉందో తెలుసా?" లంచ్ ఓవర్లో వెంకటరావుని అడిగాడు చక్రధర్.. తనుండే విజయనగర కాలనీలోనే అతను ఉండేది
అతను తెల్లబోయాడు
"గోల్కొండ ఎక్కడుంది?..
పురాణ పూల్ ఎక్కడ?..
జూపార్క్ కు ఎటువైపు వెళ్ళాలి? "అని అడుగుతారు కానీ శ్శశానం గూర్చి అతన్ని ఎవరూ ఎప్పుడూ అడగలేదు... "ఎక్కడుందో నాకూ సరిగ్గా తెలియదు!కైలాష్ నగర్ లో స్మశాన మీద ఉందనుకుంటాను...మా నాన్నను అడిగి చెప్తాను.. అయినా స్మశానం గురించి ఎందుకు అడిగావు?"..
కొన్ని క్షణాలు చెప్పటానికి సంకోచించాడు
"మా అమ్మకి ఒంట్లో బాగుండటం లేదు! ఇవాళ..రేపు.. అన్నట్లుగా ఉంది.. ఆ పరిస్థితి వస్తే ఎలా ఫేస్ చేయాలో అర్థం కావడం లేదు.. నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు నువ్వు తప్పితే!"కళ్ళనీళ్ల పర్యంతమవుతూ అన్ని విషయాలు చెప్పాడు వెంకట్రావుకి
"బాధపడకు..మేమున్నాం కదా!అవసరమైతే నాకు కబురు చేయి.. మా నాన్నని,తమ్ముడిని తీసుకువస్తాను" చక్రధర్ కి ధైర్యం చెప్పి తన సెక్షన్ వైపు వెళ్ళాడతను .. క్యాంటీన్ వైపు వెళ్ళ బుద్ధి కాలేదు... చేతిలోకి పేపర్ తీసుకున్నాడు..
జీవితంలో ఏ నిమిషం ఏం జరుగుతుందో ఎవరూహించగలరు!
బంగ్లా బంధు మజబూర్ రహ్మాన్ దారుణంగా కుటుంబ సభ్యులతోసహా హత్య చేయబడతాడని, బుట్టోని ఉరితీస్తారని.. ప్రెస్ వాళ్లు తనను గద్దె దించుతారని అమెరికా ప్రెసిడెంట్ నిక్సన్ ఊహించాడా? ఇందిరాగాంధీ ఎన్నికల్లో ఓడిపోతుందని అనుకుందా?..
చిట్టచివరి మొగలాయి చక్రవర్తి బహదూర్ షాను రంగూన్ లో జైల్లో పెడతారని ముందే తెలిస్తే జహంగీర్ బ్రిటిష్ వాళ్ళకి వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇచ్చేవాడేనా?....
చదువుతున్న పేపర్ ని టేబుల్ పైకి విసిరేసాడు చక్రధర్
యాభై ఏళ్ల వయసులో మనిషి రాయిలా ఉండి ఇంట్లో పని అంతా చేసుకునే అమ్మ హఠాత్తుగా మంచంలో పడుతుందని తాను ఎప్పుడూ అనుకోలేదు...
అమ్మకి క్యాన్సర్..
అమ్మని క్యాన్సరు పూర్తిగా కొరుక్కు తింటుందని మొన్నటి వరకు తెలియదు.. ఉస్మానియా హాస్పిటల్ లో మూడు నెలలు ఉంచి ఇంటికి తీసుకు వచ్చేసాడు
అమ్మ కదల్లేదు.. అన్నీ మంచంలోనే!
శుభ్రం చేస్తుంటే అమ్మ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి.. తనతో ఏదో చెప్పాలనుకుంటుంది.. చెప్పలేదు... కళ్ళులో కన్నీరు వరదతో పొంగే నదుల్లా ఉంటాయి ..
. తనేం ఏం చేయగలడు.. వొచ్చే జీతం తక్కువే!...
ఆఫీసులో మ్యారేజ్ అడ్వాన్స్,మోటార్ సైకిల్ అడ్వాన్స్ అని డబ్బు తెచ్చి అమ్మ జబ్బుకే ఖర్చు చేశాడు..నయం కాలేదు...
అమ్మ కడుపులో తను ఉండగానే నాన్న చనిపోయాడు.. నాలుగేళ్ల సంసార జీవితంలో కనీసం నాలుగు రోజులైనా అమ్మని సుఖపెట్టలేదట.. నాయనమ్మ, నాన్న కలిసి అమ్మని ఏడిపించే వాళ్ళు..నాన్న ప్రతి విషయానికి నాయనమ్మ సలహా తీసుకునే వాడట.. అమ్మతో పెద్దగా మాట్లాడేవాడు కాదట..పనిమనిషి కన్నా హీనంగా ఉండేది అమ్మ పరిస్థితి... నాన్న సినిమాకి నాయనమ్మ తో కలిసి వెళ్లేవాడు.. తలనొప్పి వస్తే నాయనమ్మను తల రుద్దటానికి పిలిచేవాడుకానీ అమ్మని దగ్గర రానిచ్చేవాడు కాదు.. తల్లీ,కొడుకులు మధ్య అనురాగం,ఆత్మీయత ఉండటం సహజమే కానీ, మోతాదు మించితే చాలా ప్రమాదం..... నాయనమ్మ నాన్నని ప్రసవించనప్పుడు వెంటనే బొడ్డు కోసేయ్యొద్దని , తనతోనే కొడుకు బొడ్డు తాడు బంధం మరికొంత సేపు ఉండాలని అడిగిందట మంత్రసానిని.. తను ప్రసవించగానే వెంటనే బొడ్డు కోసేయమని నర్సుకు చెప్పిందంట అమ్మ.. గతంలోని ఆ అనుభవాలు గుర్తుకొచ్చినప్పుడు "నీకు పెళ్లి కాగానే నేను దూరంగా వెళ్ళిపోతాను రా!" అనేది అమ్మ
అమ్మ జీవితమంతా కష్టాల మయం.. సవతి తల్లి హింసలతో పుట్టినింట్లో అష్ట కష్టాలు పడింది... పెళ్లయ్యాక కూడా అమ్మకి కష్టాలు తప్పలేదు...
జీవితం ఆఖరి పుటల్లో కూడా అక్షరాలన్నీ గజిబిజిగానే ఉన్నాయి...ఆఖరి శ్వాస లెక్కపెట్టుకుంటూ మంచం లో పడి కొడుకు చేత అన్ని పనులు చేయించుకోవాల్సి వచ్చిందని సిగ్గుతో, బాధతో క్షణ క్షణం చచ్చిపోతూనే ఉంది...
ఉదయం కూడా భోజనం చేయలేదు.. అన్నం వండితే సరిగ్గా ఉడకక అన్ని బియ్యం గింజలే!...
అమ్మకి బత్తాయి రసం ఇచ్చి తను బయటపడ్డాడు.. డబ్బులు లేవు... క్యాంటీన్ కి వెళ్లి తిందామంటే!..దాదాపు స్నేహితులందరి దగ్గర అప్పు తీసుకున్నాడు అమ్మ మందులు కోసం.. ఎప్పుడు తీర్చాలో ఆ అప్పులు?...
అమ్మ చనిపోతే దహన సంస్కారాలకి డబ్బులు ఎవరిని అడగాలి? చేతిలోని ఫైల్ తిరగేస్తుంటే మంచంలో మగతగా పడుకున్న అమ్మే కనిపించింది..
"సార్ మీకు ఫోన్ వచ్చింది " అటెండర్ వచ్చి చెప్పాడు ఓపి వైపు నడుస్తుంటే గుండెలు దడదడ కొట్టుకున్నాయి అమ్మకు ఎలా ఉందో?
ఇంటి ఓనరు రాఘవయ్య ఆ ఫోను చేయడం లేదు కదా! "మీ అమ్మ చనిపోయిందని" చెబుతాడేమో!
ఆ మాటలు ఎలా భరించాలి?..
..." జాతస్య మరణం ధ్రువం "
పుట్టిన వాడు గిట్టక తప్పదు..
అమ్మ తన కళ్ళ ముందు నుంచి మాయమైపోతుందా? ఆ పరిస్థితిని తట్టుకోవటానికి మనసు సిద్ధంగా లేదు...
అసహనంతో రిసీవర్ ఎత్తాడు
"హలో!" అది వసుమతి గొంతు
" నామీద కోపం వచ్చిందా?
"నీ మీద నాకేం కోపం? "
" మా నాన్న ఉదయం నీ మీద విరుచుకుపడ్డాడు కదా! నాన్నకు కోపం ఎక్కువ... నువ్వేం అనుకోకు... "
నాకు ఎవరి మీద కోపం లేదు... కోపం వచ్చినా అది నాకే నష్టం " అన్నాడు దిగులుగా
" అదిగో నీ మాటలే చెప్తున్నాయి నీకు మా మీద కోపం పోలేదని..మా నాన్న తరపున నేను క్షమాపణలు చెబుతున్నాను.. "
" నాకేం కోపం లేదుగాని... మా అమ్మ దగ్గరికి వెళ్ళావా? ఈ పూట ఎలా ఉంది అమ్మకు? "ఆత్రుతగా అడిగాడు
" మామ్మ గారికి తేలిగ్గానే ఉంది...కొంచెం సేపు మాట్లాడింది కూడా "
తేలిగ్గా ఊపిరి పీల్చాడు
" చల్లటి వార్త చెప్పావు..
నాకు ఫోన్ చేశావు ఏంటి?ఇంట్లో మీ నాన్న లేడా? "
"నాన్న విషయం నీకు తెలుసు కదా! ఉత్త డబ్బుమనిషి... వడ్డీ డబ్బులు ఎవడో ఎగ్గొట్టాడని.. వాడు గొంతు మీద కూర్చుని వసూలు చేస్తానని... అన్నం కూడా సరిగ్గా తినకుండా వెళ్ళాడు.. రాత్రికి గాని నాన్న తిరిగి రాడు! సాయంత్రం బిర్లా భవన్ కి వెళ్దాం! త్వరగా ఆఫీసు పని తెగుల్చుకుని వచ్చేయ్!"
వసుమతి ఫోన్ పెట్టేసిన శబ్దం వినిపించింది
ఇంటికి వెళ్ళగానే ఆమె తండ్రితో మళ్లీ తిట్లు తినక తప్పదు..
ఉదయం గాలివాన లాగా రాఘవయ్య తన మీద దాడి చేయడం గుర్తుకు వచ్చింది
రాఘవయ్య గారి మేడ వెనుక భాగంలో ఉన్న రేకుల షెడ్డులో తాముండేది... రెండేళ్లు అయింది ఆ ఇంట్లోకి వచ్చి... రెండేళ్లలో ఆరు సార్లు అద్దె పెంచాడు...ఆ మాత్రం సౌకర్యంగా ఉన్న ఇల్లు దొరుకుతుందో లేదోనని అద్దె కట్టే ఇచ్చేసేవాడు
.తనతో కలుపుగోలుగా మాట్లాడుతూ, ఆసరాగా ఉండే రాఘవయ్య కూతురు వసుమతిని వదిలి దూరంగా ఉండటం అమ్మకి ఇష్టం లేదు...
"ఉన్న ఫలానా ఇల్లు ఖాళీ చేయమంటే కష్టం కదండీ! అద్దె మీరు అడిగినట్లు ఇస్తున్నా కదా!"
రాఘవయ్య ఇల్లు ఎందుకు ఖాళీ చేయమంటున్నా డో అర్థం కాలేదు తనకి
"మీ అమ్మ ఎక్కువ రోజులు బతుకదట.. మా ఇంటి ముందు శవం లేవటం నాకు ఇష్టం లేదు...ఇంటికి అరిష్టం కూడా.. మా ఇంటి ముందు శవం చూడటం నాకు చాలా భయం!వెంటనే ఖాళీ చెయ్!"మొహం నిండా అసహ్యం పులుముకుని అన్నాడు
" హైదరాబాదులో మరో ఇల్లు దొరకాలంటే కనీసం రెండు నెలల గట్టి ప్రయత్నం చేస్తే గాని దొరకదండి.. ఖాళీ చేయమని ఇప్పుడు చెప్పారు కదా! ఇంక ఆ ప్రయత్నంలోనే ఉంటాను "
"అదే కుదరదయ్యా! రెండు నెలలు అంటే ఈ లోపు మీ అమ్మ గుటుక్కుమంటే నా కొంప మునుగుతుంది.. కొత్తగా కట్టిన ఇంటి ముందు శవం లేవటం అరిష్టం...ఎన్ని సార్లు చెప్పినా వినవే!" అన్నాడు విసుక్కుంటూ
వసుమతి మధ్యలో కల్పించుకోపోతే మరింత రెచ్చిపోతాడు
రాఘవయ్య తోఎక్కువసేపు మాట్లాడటం మనస్కరించక ఆఫీసుకు వచ్చేసాడు...
వసుమతి తల్లి చనిపోయి పదేళ్లు అయింది..ఇంట్లో వంట ఆ అమ్మాయి చూడటంతో ఆమె చదువు కుంటుపడింది పదో తరగతి వరకు చదివి మానేసింది..ఆమె తండ్రే చదువు మాన్పించాడు అంటే బాగుంటుంది.
పుస్తకాలు చదువుతూనో, స్నేహితురాళ్లతో మాట్లాడుతూ కాలక్షేపం చేస్తుంది.. వసుమతికి ఇరవై ఏళ్లు ఉంటాయి.. గుండ్రటి మొహం.. సోగ కళ్ళు.. గులాబీ రేకులు లాంటి పెదవులు..పొడవాటి జడ.. దబ్బ పండులాంటి శరీర ఛాయ.. కళకళలాడుతూ ఉంటుంది..
ఆ అమ్మాయికి తనంటే ఎంతో ఇష్టం...ఆరోజు తనకి ఇంకా గుర్తు...జీవితంలో మర్చిపోని మధురమైన రోజు ఇంటి అద్దె ఇవ్వటానికి మేడ వైపు నడిచాడు... ఇంట్లో రాఘవయ్య లేడు.. వసుమతి తలుపులు తీసింది.. రోజు చూపులతోనే తన మనసు దోచుకునే అమ్మాయి ఎదురుగా నిలబడగానే తడబడ్డాడు...
ఎడారి లాంటి జీవితంలో ఆ అమ్మాయి' ఒయాసిస్సు' లాగా తారసిల్లింది..మనసును శరీరాన్ని స్వాధీనంలోకి తెచ్చుకునే సరికి ఐదు నిమిషాలు పట్టింది.. కళ్ళు ఆర్పకుండా తననే చూస్తున్న వసుమతి "రండి లోపలికి రండి.." అంటూ సోఫా చూపించింది
రావి శాస్త్రి " అల్పజీవి" కనిపించాడు సోఫాపై..
ప్రకృతి దృశ్యాల కలర్ పెయింటింగ్స్ గోడలకు వేలాడుతున్నాయి.. అమ్మాయికి ఆమెకు మంచి టేస్టులు ఉన్నాయని అనుకున్నాడు అతను..
చిక్కని పాలలో బోర్ణ వీటా కలుపుకు వచ్చింది
"నేనేమన్నా క్రికెట్ ప్లేయర్, వస్తాదో అనుకుంటున్నారా?" అన్నాడు పాల గ్లాస్ వైపు చూస్తూ
"బలహీనంగా కనిపిస్తున్నారు..కొంచెం లావు అయితే ఇంకా బాగుంటారు!" అంది తన వైపు చూసి చిలిపిగా నవ్వుతూ
ఆమె తనకు ఆత్మీయురాలు లాగా తోచింది..ఎన్నో జన్మల పరిచయం ఉన్నట్లు అనిపించింది.. ప్రేమాకురాలు గుండెల్లో బలంగా నాటుకున్నప్పుడే అలా అనిపిస్తుంది కాబోలు...
"ఇంటి అద్దె ఇవ్వటానికి వచ్చానండి!"
"ఆ విషయాలు నాన్నతో మాట్లాడండి.. నాన్న లేడు.. సికింద్రాబాద్ వెళ్ళాడు "
సోఫాలోంచి లేచి నిలబడ బోయాడు
"నాతో మాట్లాడటానికి ఇంకా విషయాలేమీ లేవా? " అంది నవ్వుతూ
ఎంత చొరవ!..
వెన్నెల రాత్రుల్లో నీ ఒడిలో తల పెట్టుకుని యుగాంతం వరకు సరిపడే విషయాలు చెప్పాలి...గుండెల్లో కొలెస్ట్రాల్ లాగా పేరుకుపోయిన కష్టాల్ని తుడిచేసే నీ ప్రేమని వెచ్చని ఊపిరితో నింపుకోవాలి...
తనే మాట్లాడలేదు.. మనసే ఆమెతో కొన్ని నిమిషాలు మాట్లాడింది.. పెదాల కదలిక లేదు...చీకట్లో వెన్నెల కిరణం లాగా కనిపించింది వసుమతి ఆ క్షణం లో...
"నేనంటే మీకు ఇష్టమేనా? " అంది మెల్లగా ధైర్యంగా
"............"
" నీతో జీవితాన్ని పంచుకోవాలని ఉంది.."
తనే మాట్లాడలేకపోయాడు..ఆమె తల్లోని సన్నజాజులు కూడా తన పిరికితనాన్ని చూసి నవ్వేశాయి...
" చక్రధర్... ఇదిగో తపాల బుక్కు..మీ పేపర్స్ తీసుకొని పి. ఆర్ లో ఎంట్రీ వేసుకోండి!" సెక్షన్ ఆఫీసర్ మాటలతో అతని మనస్సు వసుమతి దగ్గర నుంచి ఆఫీసులోకి వచ్చి పడింది..
సాయంత్రం వరకు ఫైల్స్ తో కుస్తీబట్టి సెక్రటేరియట్ నుంచి బయటపడ్డాడు చక్రధర్..
సిటీ బస్సు దొరకలేదు
ఇంటి వైపు నడక సాగించాడు..
" జీవితమే ఒక క్రాస్ వర్డ్ పజిల్!" అనిపించింది లకిడికపూల్ జంక్షన్ దాటి ముందుకు నడుస్తూ ఉంటే...
గుమ్మడి పాదులా మెదడు పొరల్లో పాకిన సమస్యలు...
చావు బతుకుల్లో అమ్మ..
దహనసంస్కారాలకు డబ్బులు..
అద్దెకు మరో ఇల్లు వెతుక్కోవడం..
వసుమతి తనకు కనిపించకుండా రాఘవయ్య కట్టడి..
ఆఫీసులో కనపడనిపాత జీవోల కోసం, ఫైళ్ల కోసం వెతుకులాట..
" క్రాస్ వర్డ్ పజిల్' లో పరిష్కారం దొరకని సమస్యలు.. పూర్తి చేయలేని గడులు...
ఐటిఐ, పాలిటెక్నిక్ క్యాంపస్ దాటుకుని సెయింట్ ఆన్స్ స్కూల్ దగ్గరికి వచ్చాడు..
ఎంతసేపు ఆలోచించినా " క్రాస్ వర్డ్ పజిల్ " పూర్తి చేయలేడేమో?..
ఇంటి దగ్గరికి వచ్చేసాడు చక్రధర్
రాఘవయ్య మేడ ముందు జనం గుంపులు గుంపులుగా కనిపించారు..
చక్రధర్ కి చెమటలు పట్టాయి..
కళ్ళలో నీళ్లు తిరిగాయి...
అమ్మ... అంతా అయిపోయింది..
జనాన్ని నెట్టుకుని ముందుకెళ్లాడు
ఏడుస్తూ వసుమతి కనిపించింది
ఇంటి ముందు పడుకోబెట్టిన శవం వైపు చూశాడు చక్రధర్
కొన్ని క్షణాలు నిర్వీణ్ణుడయ్యాడు అయ్యాడు...
రాఘవయ్య శవం..!!
వడ్డీ డబ్బులు వసూళ్ల కోసం వెళ్లి అసలు మనిషే గల్లంతయ్యాడు, హఠాత్తుగా గుండెజబ్బు రావడంతో...
*** ***** ****
నలభైఐదేళ్ల క్రిందటి "యువ" మాస పత్రికలో వెలుగు చూసిన కథ..( జూన్1981 సంచిక)🌳
No comments:
Post a Comment