Tuesday, September 1, 2026

 "కమీషన్ కోటయ్య"

         కృష్ణాపురంలో గోవిందయ్యనే ధాన్యం దళారి ఉండేవాడు. అతడు దళారీ వృత్తి చేపట్టి ఎన్నేళ్ళు గడిచినా ఏమీ సంపాదించిన వాడు కాదు. కాస్తో కూస్తో ఆ వచ్చిన కమీషన్ డబ్బులు పై ఖర్చులకే సరిపొయ్యేవి.

ఇకపోతే తిండి గింజలకు కొరత లేకుండా అతడి తాత తండ్రులు రెండెకరాల మాగాణిని యిచ్చి పొయ్యారు. దాన్ని సాగుబడి చేసుకుంటూ ఆ వచ్చిన ధాన్యంతో రోజులు బరువుగా గడుపుకొస్తున్నాడు.

ఏ పని చేతగాని అతని ఒక్కగానొక్క కొడుకు కోటయ్య ఒకరోజు తండ్రితో, "నేనూ నీకులాగ దళారి పని చేద్దామను కొంటున్నాను, నాన్న గారు!" అన్నాడు.

ఆ మాటకు యింతెత్తున ఎగిరి పడిన గోవిందయ్య, “ఎందుకది దండగ పని! దేశదిమ్మరిలా ఊళ్ళు తిరుగుదామనా! హాయిగా యింటి పట్టున ఉండి ఏ కిరాణా కొట్టో, కిళ్లీబంకో, బట్టల దుకాణమో పెట్టుకో ! సుఖ పడతావు! నన్ను చూస్తున్నావుగా, ఏమి సంపాదించాను సూదిలో దారంలాగా అమ్మకం దారుకి - కొనుగోలు దారుకి మధ్య తిరిగి ఎన్నో బాధలు పడుతున్నా!” అన్నాడు తన బాధలను ఏకరువు పెడుతూ.

అయినా అతడి మాటలను పట్టించుకోని కోటయ్య, "నేను కేవలం వడ్ల దళారిగానే ఉంటానేమిటీ ? పశువులు, గొర్రెలు, మేకలు, వివిధ రకాల వస్తువులు కొని కమీషన్కి అమ్మి పెడతాను. పెళ్ళిళ్ళు కుదురుస్తాను, వారికి కావల్సిన బంగారం, బట్టలు, ఉగాది కానుకలు కొనిపిస్తాను. వారిరువురి నుండి నాకు కావాల్సిన కమీషన్ని ఒకరికి తెలియకుండా మరొకరి నుండి వసూలు చేస్తాను. చూస్తూ ఉండడి ఎలా చేస్తానో!" అన్నాడు.

కొడుకు మాటలకు మహదానంద పడిన గోవిందయ్య, "నాకన్ని తెలివి తేటలు లేవురా! అందుకే చాలీ చాలని సంపాదనతో నరకం అనుభవించాను. ఏమైనా యీనాటి కుర్రాళ్ళు తెలివి తేటలే వేరు ! నీ కోరిక నేనెందుకు కాదనాలి. దళారిగానే జీవించి, పది రూపాయలు వెనకేసుకో, బాబూ!" అన్నాడు.

తండ్రి అనుమతి లభించగానే కోటయ్య ఎక్కడ లేని ఆనందంతో అటు దళారిగాను యిటు కమీషన్ ఏజంట్గాను ఎంతో ప్రగతిని సాధించాడు. ఎవరికి ఏ అవసరం వచ్చినా కమీషన్ కోటయ్యను కలవమని చెప్పసాగాడు.

కమీషన్ కోటయ్య పేరు నలు దిక్కులా మారుమ్రోగింది. వ్యాపారస్థులు, కొనుగోలు దారులు, పెళ్ళి కావాల్సిన పిల్లలు ఉన్నవారు కోటయ్య వెంటబడసాగారు.

ఇలా ఉండగా - ఒకరోజు కనకయ్య హొల్సెల్ బట్టల కొట్లోకి ఓ పెళ్ళి బృందాన్ని తరలించుకొని వచ్చాడు, కోటయ్య ! "వారికి కావాల్సిన బట్టలు యివ్వండి ! పని మీద వెళ్తున్నాను. సాయంకాలం కలుస్తాను. మరి నా.......", అన్నాడు, నసుగుతూ, వ్రేళ్ళు త్రిప్పి చూపుతూ !

అది చూసి ఓనర్ కనకయ్య, “అర్థమైందిలే! కోటయ్య ! వెళ్ళిరా!", అన్నాడు. సరేనని వెళ్ళిన కోటయ్య, ఆ సాయంకాలం తిరిగి వచ్చి. కనకయ్యతో, "వ్యాపారం మాబాగా జరిగిందను కొంటాను. మరి నా కమీషన్ యిప్పించండీ!", అన్నాడు.

“అలాగే! తప్పుతుందా! పెళ్లి వాళ్ళు బట్టల తాలూకు బేలన్స్ పాతికవేలు నీచేత పంపారను కొంటాను. ఏదీ ఆ డబ్బు! యిటివ్వు." అన్నాడు.

"వాళ్ళు నా చేత డబ్బు పంపడమేమిటి? వాళ్ళు మీ దగ్గర కొన్న బట్టలకు పూర్తిగా డబ్బెందుకు కట్టలేదు. అసలు మీరెలా వాళ్ళకి అప్పు యిచ్చారు?" అన్నాడు కోటయ్య. అందుకు కనకయ్య నొచ్చుకొని, "ఏమి మాటలవి కోటయ్య ! నీవు తీసుకొచ్చిన వాళ్ళు ఏభైవేలకు కొన్నారు. పాతికవేలే తెచ్చాము! సాయంకాలం కోటయ్య చేత పంపుతాం అన్నారు. కాదనలేంగదా ! ఎలాగూ నీకు తెల్సిన వాళ్ళేగదా ! పైకం తీసుకుని రా ! నీ కమీషన్ తీసుకెళ్ళు!" అన్నాడు.

ఆ మాటలకు కోటయ్య కాస్తా ఏడుపు మొఖం పెట్టి, "ఆ దేవుడిపై ఒట్టు! వాళ్ళెవరో నాకు తెలియదు. దారిన వస్తుంటే పెళ్ళి బట్టలు కొనాలన్నారు. కమీషన్కి కక్కుర్తిపడి నీ బట్టల కొట్టుకి తీసుకొచ్చాను. కొంవ మునిగింది !" అన్నాడు.

అందుకు బాగా కోపం తెచ్చుకున్న కనకయ్య, "నీకు తెల్సిన వాళ్ళని, నీవు చెప్పావని బట్టలిచ్చాను. మా డబ్బు మాత్రం కట్టు !"అన్నాడు. దాంతో చేసేదేం లేక కోటయ్య తండ్రి పాదాలపై బడి దళారి పని మానతానని చెప్పి, ఎకరం పాలం అమ్మి కనకయ్య బాకీ తీర్చాడు. మిగిలిన డబ్బుతో కిరాణాకొట్టు పెట్టుకొని వ్యాపారం చేసుకోసాగాడు, దళారి కాలేదు.

No comments:

Post a Comment