Tuesday, September 1, 2026

 భవితకు స్వాగతం

'గతంగతః' అని శాస్త్రం చెబుతోంది. చేజారినవి తిరిగి రావడం అంత సులభం కాదు. కొన్ని అసాధ్యం. కొన్ని ఒకవేళ వచ్చినా వెనకటి వైభవం ఉండదు. ప్రతి శాసనానికీ ఒక సవరణ ఉంటుంది. ప్రతి నిబంధనకూ సడలింపు ఉంటుంది. పట్టూవిడుపూ లేక పోతే బతుకు బండబారుతుంది. ఆలోచన మందగిస్తుంది, ఆచరణ కుంటుపడుతుంది. ప్రవహించినప్పుడే వ్యర్థాలు కొట్టుకుపోయి నదీజలాలు పరిశుభ్రం అవుతాయి. ఊహాలోకాలలో విహరించే కవులకు పగలే వెన్నెలగా కనిపించవచ్చు. గతకాలమే వచ్చు కాలము కన్నా మేలు అనిపించనూ వచ్చు. జ్ఞానులు వేరు; వారి దృష్టికోణాలు సూర్యకిరణాల్లా కాంతిరేఖలను ప్రసరిస్తాయి. భూత, భవిష్యత్, వర్తమానాలను వారు జ్ఞాననేత్రంతో తెలుసుకోగలుగుతారు. గతం, భవితవ్యం రెండు తీరాలని, వర్తమానం వాటిని కలిపే వంతెన అని చెబుతారు.

పూర్వులు జీవించిన తీరుతెన్నులు, సాధిం చిన విజయాలు, జీర్ణించుకున్న అనుభవాలు, పొందిన అనుభూతులు, భావి జీవితానికి దారి దీపాల్లాంటివి అంటారు చారిత్రకులు. గతంలో జరిగిన మంచి పనులను స్వీకరించ మని, విషాద సంఘటనలను పాతిపెట్టమని, విజ్ఞులు జ్ఞానబోధ చేస్తారు. హంస, పాలూ-నీరూ వేరు చేసినట్లు, మంచీ- చెడూ అంచనా వేసి, ఆచితూచి, అడుగు కదిపితే జీవితం ఒక జైత్రయాత్ర అవుతుంది.

జీవుడికి హంస శబ్దం అన్వయిస్తుంది. విచక్షణ, వివేకం ఉన్న ఆ జీవుడే పరమ హంస అవుతాడు. గతంలో మనిషి చేసిన కర్మలను బట్టి సంస్కారాలు ఏర్పడతాయి. అవి చెరగని వేలిముద్రలు. జన్మాంతర గత స్మృతుల ఘంటారావం ప్రతి జన్మలోనూ ప్రతి ధ్వనిస్తుంది. సంస్కారాలను బట్టి ఆలోచనలు, ఆ ఆలోచనల నాణ్యతను బట్టి జీవి తాలు సాగుతాయి. ఈ సత్యం తెలిస్తే సుఖమైనా దుఃఖమైనా ఒకేలా చూడగల సామ ర్థ్యం వరిస్తుంది. 'అద్వైతం సుఖదుఃఖయోః' అంటాడు భవభూతి అందుకే. సుఖాన్ని, దుఃఖాన్ని ఒకేలా చూడగల స్థితికి ఎదగాలి అన్నదే కవి వాక్యం.
జరిగిన దాని గురించి ఎంతగా ఆలోచిస్తే, అంత బాధాకరంగా పరిణమిస్తుంది. పుండు మానకుండానే కెలికితే అదే బ్రహ్మ రాక్షసిగా మారి భయపెడుతుంది. గతంలో చేసిన పొరపాట్లు ఇకపైన జరగకుండా జాగ్రత్తపడాలి. మొదటి తప్పునకు క్షమాపణ ఉంటుందంటారు. అందుకని సరికొత్తగా మరికొన్ని తప్పులు చేయవచ్చనుకోవడం అజ్ఞానం. క్లేశాగ్ని దహిస్తూనే ఉంటుంది రావణకాష్టంలా. ఎప్పుడైనా ఎవరైనా, చేసిన తప్పునకు తగ్గ పరిహారం చెల్లించక తప్పదు. ఆర్థికంగా అది నష్టపరిహారం అవు తుంది. హార్దికంగా పాపానికి తగిన పరిహారం పరితాపం, తపన, మానసికంగా ఎవరికి వారు వేసుకునే శిక్ష. అదే చేసిన పాపానికి శాశ్వతమైన పరిష్కారం. చెరసాలలో పెట్టినా, చావగొట్టినా, కొంతమందిలో ఎలాంటి మార్పు రాదు. సంస్కారం మంచిదైతే, ఒక్క నిట్టూర్పుతో వరదలో పడ్డ దుంగలా పాపం కొట్టుకుపోతుంది. మనసు స్వచ్ఛమై, అంతరంగం శాంతి సాగరం అవుతుంది. అందుకే వీలైనంత వేగంగా గతాన్ని శివుడిలా కంఠంలోనే బిగించి, భవిత అనే అమృతకలశాన్ని ఆహ్వానించాలి.

ఉప్పు రాఘవేంద్రరావు

No comments:

Post a Comment