*బంధాలకు వారధి*
నాన్నా… అమ్మమ్మ గారి ఊర్లో ఉన్న పొలం అమ్మేద్దాం. అమ్మ పోయి నాలుగేళ్లు అయింది. ఇప్పుడు మనకు ఆ ఊరితో సంబంధం ఏముంది ? నువ్వు కూడా పెద్దవాడివి అయిపోతున్నావు. ఇక అక్కడికి వెళ్లి చూసుకునే పరిస్థితి లేదు. నేను ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నాను. రోజులు కూడా అసలే బాగాలేవు… అని అన్నాడు రామశాస్త్రి తన తండ్రి రాజయ్యతో.
కొడుకు మాటలు విన్న రాజయ్య గుండెల్లో రాయి పడినట్టైంది. కాసేపు నిశ్శబ్దంగా కిటికీ బయటకు చూస్తూ గత జ్ఞాపకాలలోకి జారిపోయాడు.
ఎందుకురా పొలం అమ్ముకోవడం ? తరతరాల నుంచి వచ్చిన ఆస్తి అది. వచ్చే ఆదాయం తక్కువైనా భూమి విలువ రోజురోజుకూ పెరుగుతుంది. మనం లేకపోయినా అది మన తర్వాతి తరాలకు అండగా ఉంటుంది, అన్నాడు నెమ్మదిగా.
రాజయ్య, లక్ష్మమ్మ ఇద్దరూ కాయకష్టం చేసి రామశాస్త్రిని చదివించి ప్రయోజకుడిని చేశారు. ఆ ఒక్క పొలం తప్ప రాజయ్యకు మరే ఆస్తి లేదు.
అయినా జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినా పొలం అమ్మేద్దాం అనే మాట లక్ష్మమ్మ నోట ఎప్పుడూ రాలేదు. ఎవరైనా ఆ మాట ఎత్తితే ఆమె బాధపడేది.
భూమి అంటే కేవలం మట్టి కాదు అండి… అది మన పూర్వీకుల చెమట. వాళ్లు కష్టపడి సంపాదించి మనకు అందించిన గుర్తు. మనం దాన్ని కాపాడి తర్వాతి తరానికి అందించాలి, అని చెప్పేది.
రాజయ్య కళ్ల ముందు లక్ష్మమ్మ రూపం మెదిలింది.
ఒకసారి రామశాస్త్రి చదువు కోసం చాలా డబ్బు అవసరమైనప్పుడు, ఊరిలోని కొందరు ఆ పొలం అమ్మమని సలహా ఇచ్చారు. అప్పుడు లక్ష్మమ్మ దృఢంగా చెప్పింది—
నా తండ్రి నాకు పసుపు కుంకుమగా ఇచ్చిన ఈ భూమి కేవలం పొలం కాదు. ఇది నా పుట్టింటి ప్రేమ. ఈ పొలం నుంచి వచ్చే గింజల్లో కూడా మా అమ్మానాన్నల ఆశీర్వాదం కనిపిస్తుంది. ఎంత కష్టం వచ్చినా దీనిని అమ్మకండి.
ఆ రోజు లక్ష్మమ్మ మాటలు విని రాజయ్య కూడా మౌనంగా అంగీకరించాడు.
రామా… మీ అమ్మ ఉన్నప్పుడు ఆమె మనసుకు వ్యతిరేకంగా నేను ఏ పని చేయలేదు. ఇప్పుడు ఆమె లేని సమయంలో ఆమెకు ప్రాణమైన ఈ పొలాన్ని ఎలా అమ్మగలను ? అని రాజయ్య గొంతు బరువెక్కుతూ అడిగాడు.
రామశాస్త్రి మౌనంగా తండ్రి ముఖం చూశాడు.
చెట్టు వేర్లు ఉన్నంత కాలం నిలబడుతుంది రామా. మనిషికి కూడా తన మూలాలు గుర్తుండాలి. ఊరు దూరమైనా మనసు దూరం కాకూడదు.
మీ అమ్మ పోయిన తర్వాత కూడా ఈ పొలం కారణంగానే మీ మేనమామ ఇంటికి వెళ్లి నాలుగు రోజులు ఉండగలుగుతున్నాం. ఫోన్‌లో మాట్లాడుకుంటున్నాం. డబ్బు రావడం ముఖ్యం కాదు రామా… రాకపోకలు ఉండాలి. లేదంటే ఈ కాలంలో మనిషి పోయిన తర్వాత చాలా బంధాలు కూడా నెమ్మదిగా దూరమైపోతాయి.
నువ్వు నీ జీవితంలో కొత్త బంధాలను సంపాదించుకున్నావు. కానీ *మేనమామ అంటే తండ్రి తర్వాత తండ్రి* లాంటి వాడు. కనీసం ఈ పొలం కారణంగానైనా అమ్మ *పుట్టింటి బంధాలు* నిలిచి ఉంటాయి, అన్నాడు రాజయ్య.
ఆ మాటలు రామశాస్త్రి హృదయాన్ని తాకాయి.
నాన్నా… ఇప్పటివరకు నేను డబ్బు కోణంలో మాత్రమే ఆలోచించాను. కానీ ఈ పొలంలో మట్టి మాత్రమే లేదని ఇప్పుడు తెలిసింది. ఇందులో అమ్మ ప్రేమ ఉంది, తాతయ్య ఆశీర్వాదం ఉంది, మన *బంధాల వేరు* ఉంది. ఈ పొలం ఎప్పటికీ అమ్మం, అని అన్నాడు.
ఆ సాయంత్రం అస్తమిస్తున్న సూర్యుడు కిటికీ గుండా ఇంట్లోకి తన మృదువైన కాంతిని చల్లుతున్నాడు.
రాజయ్యకు లక్ష్మమ్మ ఎక్కడో దగ్గరగా నిలబడి చిరునవ్వుతో చూస్తున్నట్టుగా అనిపించింది.
చూశావా లక్ష్మీ… నువ్వు కాపాడిన బంధాన్ని మన కొడుకు కూడా అర్థం చేసుకున్నాడు అని మనసులో అనుకున్నాడు.
కిటికీ బయట సూర్యుడు అస్తమిస్తున్నాడు. కానీ రాజయ్య హృదయంలో మాత్రం ఒక *బంధం* మళ్లీ ఉదయించింది.
రచన : మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
No comments:
Post a Comment