Tuesday, September 1, 2026

 365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథతో
♥️ కథ - 67 ♥️
చదవడానికి ముందు ... దీర్ఘంగా శ్వాస తీసుకోండి... సున్నితంగా కళ్ళు మూసుకుని మీ హృదయం నుండి వచ్చే ప్రేమపూర్వక స్వరాన్ని వినడానికి ప్రయత్నించండి... ఇప్పుడు చదవడం కొనసాగించండి...

*మేలు చేయండి - మేలు జరుగుతుంది *

ఈ రోజు మనం ఈ కథ ద్వారా చాలా సులభమైన ఒక ప్రకృతి నియమాన్ని అనుభూతి చెందడానికి ప్రయత్నిద్దాం.
ఒకసారి, ఒక వ్యక్తి రోడ్డు పక్కన నిలబడి ఉన్న వృద్ధురాలిని చూసి, ఆమెకు సహాయం అవసరమేమో అని భావించి, వెంటనే ఆమె మెర్సిడెస్ కారు వద్దకు వెళ్ళాడు.
అతను చాలా ఆహ్లాదకరమైన చిరునవ్వుతో వృద్ధురాలి ముందుకెళ్లి నిలబడ్డాడు, కాని ఆ స్త్రీ ఆందోళనలో ఉన్నట్లుగా గమనించాడు. ఆవిడ భయంగా ఉన్నట్లు ఆమె కళ్లలో స్పష్టంగా అర్థమైంది. ఆ వ్యక్తి తనను తాను పరిచయం చేసుకుని, "మేడమ్, నా పేరు ఆండీ. నేను మీకు సహాయం చేయాలనుకుంటున్నాను. మీరు కారులో కూర్చొని వేచి ఉండండి.”
ఇది విన్న మహిళ ముఖంలో కొంత ఉపశమనం కలిగింది, ఆమె వెళ్లి కారులో కూర్చుంది. కారు టైరు పంక్చర్ అయ్యి ఉంది, దాన్ని సరిచేయడానికి ఆండీ కారు కిందకి పాకాడు. అతను టైర్ బిగిస్తున్నప్పుడు, ఆ వృద్ధురాలు కిటికీ అద్దం క్రిందికి దించి, అతనితో మాట్లాడటం ప్రారంభించింది. ఆమె తన పేరు నోరా అని, ఆమె సెయింట్ లూయిస్‌లో నివసిస్తోందని, ఈ మార్గం గుండా పయనిస్తోందని అతనికి చెప్పింది. తనకు సహాయం చేసినందుకు ఆమె ఆండీకి కృతజ్ఞతలు చెప్పుకుంది.
అతను నవ్వుతూ తన పని పూర్తి చేసాడు. వృద్ధురాలు, "నేను మీకు చాలా రుణపడి ఉన్నాను, మీకు చాలా కృతజ్ఞతలు", అని చెప్పింది. 
ఈ సహాయానికి ప్రతిఫలంగా ఎంతైనా ఇవ్వడానికి ఆమె సిద్ధంగా ఉంది, ఎందుకంటే అతను ఆమెకు సహాయం చేయకపోయి ఉంటే జరిగే ఘోరమైన విషయాలన్నింటినీ ఆమె ముందే ఊహించుకుని ఉంది.
ఆండీ ప్రేమగా, "నేను డబ్బు కోసం మీకు సహాయం చేయలేదు, ఇది నాకు ఉద్యోగమూ కాదు, నేను ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తున్నాను అంతే. గతంలో నాకు సహాయం చేసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారన్న విషయం భగవంతునికి మాత్రమే తెలుసు. నేను నా జీవితమంతా నిజాయితీతో జీవించాను, మరొక విధంగా ప్రవర్తించాలని నాకు ఎప్పుడూ అనిపించలేదు"
 " మీరు నిజంగా నాకు డబ్బివ్వాలనుకుంటే, ఇంకోసారి ఎవరైనా అవసరంలో ఉన్నారని మీరు గమనించినప్పుడు వారికి సహాయం చేయండి. వారికి అవసరమైనప్పుడు మీరు చేయగలిగిన సహాయం చేయండి.అప్పుడు నన్ను గుర్తుచేసుకోండి" అని చెప్పాడు. నోరా తన కారు తీసుకుని వెళ్లేవరకు ఆండీ వేచి ఉన్నాడు. 
డ్రైవింగ్ చేస్తూ, కొన్ని మైళ్ల దూరంలో, నోరా ఒక చిన్న రెస్టారెంట్ ని చూసి ఏదైనా తిందామని ఆగింది. ఆ రెస్టారెంట్ చాలా అందంగా ఉంది. ఆమె టేబుల్ వద్ద కూర్చున్నప్పుడు, వెయిట్రెస్ చిరునవ్వుతో వచ్చి, తడి జుట్టుతో ఉన్న ఆ వృద్ధురాలికి తుడుచుకోడానికి టవల్ ఇచ్చింది.
వెయిట్రెస్ సుమారు ఎనిమిది నెలల గర్భవతి అయినా, ఒత్తిడి, వేదన ఏమీలేకుండా ఆమె వైఖరి ఆహ్లాదకరంగా ఉండడం నోరా గమనించింది. ఈ స్త్రీకి ఏమీ లేకపోయినా ఒక అపరిచితురాలి కోసం ఇంతగా ఎలా ఆలోచించగలగిందా, అని నోరా ఆలోచిస్తోంది. అంతలో హఠాత్తుగా ఆమెకు ఆండీ మాటలు గుర్తొచ్చాయి.
నోరా భోజనం పూర్తి చేసి, వంద డాలర్ల నోటుతో బిల్లు చెల్లించింది. వెయిట్రెస్ వంద డాలర్ల నోటుకు చిల్లరను మార్చడానికి హడావిడిగా కౌంటర్‌కి వద్దకు వెళ్లింది, అయితే ఆమె తిరిగి వచ్చే సమయానికి నోరా వెళ్లిపోయింది. అప్పుడు టేబుల్ మీద ఉంచిన రుమాలు మీద ఏదో రాసి ఉండడం చూసింది.
ఆ చేతి రుమాలు మీద వ్రాసినది చదివి ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి.                                                                                నోరా ఇలా వ్రాసింది: "నీవు నాకు ఏమీ ఋణపడి లేవు. నేను నీకు సహాయం చేసినట్లే ఎవరో ఒకసారి నాకు సహాయం చేసారు. నీవు నిజంగా నా ఋణం తీర్చుకోవాలనుకుంటే, ఎవరైనా అవసరంలో ఉన్నప్పుడు సహాయం చేసి, ఈ ప్రేమ వరుసను నీతో ముగించకుండా కొనసాగించు.”                                                                              రుమాలు కింద మరో $100 నోటు ఉంది.
ఆ రాత్రి వెయిట్రెస్ ఇంటికి వచ్చి భోజనం చేసి  రాత్రి పడుకున్నప్పుడు,  డబ్బు గురించి, ఆ స్త్రీ ఏమి వ్రాసిందో...  ఆమెకు, ఆమె భర్తకు ఈ డబ్బు ఎంత అవసరమన్న విషయం ఆ స్త్రీ ఎలా తెలుసుకోగలిగిందా అని ఆలోచిస్తూఉంది. వచ్చే నెలలో బిడ్డ పుట్టడం వల్ల, వారి జీవనం చాలా కష్టమవుతుంది.
ఈ విషయంలో తన భర్త ఎంత కంగారుపడుతున్నాడో  తెలిసి, పక్కనే నిద్రపోతున్న అతనికి ముద్దు పెట్టి, “అంతా బాగానే జరుగుతుంది .... ఐ లవ్ యూ ఆండీ” అని గుసగుసలాడింది.
ప్రతీ ఆలోచన, ప్రతీ చర్య, మన వద్దకు తిరిగి వస్తుంది, ఇది ప్రకృతి నియమం, సృష్టి నియమం.
ఎల్లప్పుడూ సహాయం చేస్తూ ఉండండి.
♾️
ఏదైనా ఉన్నతమైనది జరిగినప్పుడు, ఆ ఆనందాన్ని పంచుకోండి. అప్పుడు చైతన్యం అపరిమితమైన రీతిలో విస్తరిస్తుంది. 🌼
దాజీ

హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం  💌

No comments:

Post a Comment