Tuesday, September 1, 2026

 *భట్టివిక్రమార్క కథలు-22*
(శ్రీ ఇచ్ఛాపురపు రామచంద్రం)
123/374

*మదనసేన కథ*

పట్టువదలని విక్రమార్కుడు మరల మోదుగ చెట్టునెక్కి భేతాళుడిని తాళ్ళతో కట్టి భుజాన వేసుకుని మౌనంగా నడవసాగాడు.

అప్పుడు శవంలోంచి భేతాళుడు, "విక్రమార్కమహారాజా! నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను. విను. అంటూ ఇలా ప్రారంభించాడు.

వీరవర్మ అనే రాజు కౌశాంబి అనే మహాపట్నాన్ని రాజధానిగా చేసుకుని పాలించేవాడు. అతనికి వసుదత్తుడనే కుమారుడు, మదనసేన అనే కుమార్తె. 

ఆమెకి పెళ్ళీడు రాగానే తల్లితండ్రులు తమ బంధువులలో ఉత్తముడూ, బుద్ధిమంతుడూ అయిన ధనదత్తుడికి తమ అమ్మాయినిచ్చి వివాహం జరిపించాలని నిశ్చయించుకున్నారు.

ఒకనాడు మదనసేన చెలులతో ఉద్యానవనంలో విహరిస్తూంది. ఆ సమయంలో - ఆమె అన్న స్నేహితుడైన గుణవర్ధనుడు ఏదో పనిమీద ఆ తోటలోకి వచ్చి.. అక్కడ ఆడుతున్న మదనసేనని చూశాడు. 

వసుదత్తుడతనికి ఆప్తమిత్రుడే అయినా గుణవర్ధనుడు ఆమెని చూడడం అదే మొదటిసారి. అతనామె రూప లావణ్యాలకి ఆమె మీద మోహంలో ములిగి - 'ఈమె ననుభవింపని మగజన్మ వ్యర్థం. ఈమెను పొందకుండా నిముషమయినా ఉండలేను. కాముకులు వదలకపోతే కార్యం సఫలం కాదట. నా అభిప్రాయం ఈమెకి చెప్పి చూస్తాను. సిగ్గు, లజ్జ, భయమూ ఏమంటుందో?! అనుకుంటూ ఆమెను సమీపించాడు.

ఆమె అతన్ని గౌరవంగా పలకరించి.. "ఎందుకువచ్చావు?" అని అడిగింది. "నీ అందం చూసేసరికి ఎందుకువచ్చానో మరిచిపోయి
నీమీద మోహంలో చిక్కుకున్నాను. నీ కౌగిలి ప్రసాదంగా నాప్రాణం నిలుపు. కాదన్నావో నా ఉసురు పోసుకుంటావు." అంటూ పలువిధాల ప్రాధేయపడ్డాడు.

చాలా వివేకంకల మదనసేన తనకోసం ప్రాణాలు కోల్పోనున్న ఆ కాముకుని దైన్యానికి జాలిపడింది. 

భర్త నిశ్చయించబడిపోయాడు కనుక తను అతనికి విరుద్ధమైన పని చెయ్యదు. అందుచేత - “ఓ కాముకుడా! నా తల్లితండ్రులింతకు మునుపే నన్నొకని కిచ్చి వివాహం చేస్తామని మాటిచ్చేశారు. పతి కాబోయేవానికి ద్రోహం చేయలేను. ఐనా నీకొకటి చెబుతాను. విను.

వివాహమై నేను నా పతితో శయ్యమందిరానికి వెళ్ళిన తొలిదినమే నా భర్త అనుమతి తీసుకుని నీ దగ్గర కొస్తాను. మొదట నువ్వు నాతో కూడాక నే భర్తతో కలుస్తాను."

"ఇలాటి పనికి మగాడు సమ్మతిస్తాడా?" అడిగాడతను. “అతన్ని ఒప్పించడం నా పని. నా మాటలు నమ్మి అంతవరకూ చిత్తాన్ని చిక్కబట్టుకుని ఉండు." అని అతనికి నమ్మకం కలిగేలా ప్రమాణాలు చేసింది.

గుణవర్థనుడికి చేసేదేమీ కనిపింపక - ఆమె మాటలకంగీకరించి, యింటికి పోయి మదనసేన మనువెప్పుడు జరుగుతుందా 

అని ఎదురు చూడసాగాడు. కొద్దిరోజులలోనే ఆమె వివాహం జరిగింది. భర్తతో శయన గృహానికి వెళ్ళగానే ఆమె తటాలున అతనికి దూరంగా నిలిచింది. భర్త ఆశ్చర్యంగా చూస్తూంటే,

“ప్రాణేశ్వరా! ఒక విషయం విన్నవించుకుంటాను. వినండి. 

నా వివాహానికి ముందు మా అన్న స్నేహితుడొకడు నన్ను కామించి కలియకోరాడు.." అంటూ జరిగినదంతా చెప్పి తానతనికి వాగ్దానం చేసినసంగతి కూడ చెప్పింది. 

"ఇప్పుడు మాట తప్పడం న్యాయం కాదు. మాట ప్రకారం జరిగించి మీ వద్దకు వస్తాను. దయచేసి అనుజ్ఞయివ్వండి." అని ప్రార్ధించింది నిర్భయంగా,

ధనదత్తుడు మొదట ఒకక్షణం నిర్ఘాంతపోయి తరవాత బాగా ఆలోచించాడు. 'ఈమె నిష్కల్మషమైన చిత్తం కలది. సత్యానికి ధర్మానికీ కట్టుపడేది. కనుక నేను కాదంటే పాపమే.' అని- "మంచిది. నువ్వు అలా ప్రమాణంచేసి ఉంటే నీ యిష్టప్రకారమే చెయ్యి నీ మీద నా కేమీ కోపం లేదు. "వేగం వెళ్ళిరా” అన్నాడు. ఆమె - పడకటింటికి వచ్చిన అలంకరణలోనే వీధిలోకి నడిచింది.

ఆ సమయంలో ఒక దొంగ చీకటిలో తిరుగుతున్న ఆమెనూ అలంకరణనీ చూసి ఆశ్చర్యపోయాడు. తనకి రెండు లాభాలనుకుంటూ ఆమెను అడ్డగించాడు. "నేను దొంగని.. నీ నగలిచ్చేసి నాతో కలవకపోతే నిన్ను వదలను. -" అన్నాడు. 

"ఆభరణాలు తీసుకుని వదిలెయ్." అని చాలా వేడుకున్నా వాడంగీకరింపక ఆమెని పట్టుకోబోయాడు. 

అప్పుడామె శాంతంగా తను వెళ్తున్న పని, తన నిశ్చయము, తన భర్త అనుమతించడమూ చెప్పి "మొదట వాగ్దానం చేసిన ప్రకారము ఆ పురుషుణ్ణి కలవకుండా యితరులని కలవడం ధర్మం కాదు. 

ఈ న్యాయం తెలిసే నా భర్త నన్ను ముట్టకుండా వెళ్ళమన్నాడు. నువ్వు కూడా నన్ను కరుణించి అలాగే నన్ను విడిచిపెట్టి యిక్కడే కాచుకుని ఉండు. నేను వేగంపోయి గుణవర్ధనుడి కోరిక తీర్చి నీ వద్దకు వస్తాను. అప్పుడు నీ యిష్టం తీర్చి నగలిచ్చి పోతాను.” అని బతిమాలి వాడికి నమ్మకం కలిగేలా ప్రమాణాలు చేసింది.

అప్పుడు వాడు "సరే నీ విషయమూ, సత్యపాలనా తెలియవుగాని వేగంగాపోయి రా." అని ఆమెను వదిలాడు. 

ఆమె గుణవర్ధనుని వద్దకుపోయి- "ఆనాడు తోటలో నన్ను కలవగోరినప్పుడు చెప్పిన ప్రకారం వచ్చాను. ఇంతవరకూ నాభర్త కూడా నన్ను ముట్టలేదు. నాతో కలసి నీ కోరిక తీర్చుకుని పంపెయ్." అంది. 

అతడామె నిశ్చయానికీ, సత్యానికీ, పతికూడా అంగీకరించినందుకూ ఎంతో ఆశ్చర్యపడి.. ఆమెకు చేరువలో నిలబడడానికి కూడా భయపడి, నమస్కరించి “ఓ పతివ్రతా రత్నమా! బుద్ధిహీనుడనై నిన్ను కోరాను. ఆ పాపమే చాలు. 

నువ్వు నా తల్లివంటి దానివి. నన్ను మన్నించి నీ పతి వద్దకు వెళ్ళు. అన్యుడైన ఏ పురుషుడు నిన్ను కోరినా ముట్టుకున్నా వాడు నాశనమౌతాడు. వెళ్ళు.” అని పంపివేశాడు.

అక్కడినుండి ఆమె చోరుడి వద్దకు వచ్చి "నీ యిష్టం తీర్చుకుని సొమ్ములు తీసుకో. నా కోసం భర్త ఎదురుచూస్తూంటాడు. ఆలస్యం చేయకు.” అని ప్రార్ధించింది. 

వాడామె సత్యపాలనకి ఆశ్చర్యపోయి.. మహా పతివ్రతగా భావించి - "అమ్మా! నువ్వు సాధ్వివీ, పుణ్యశీలవీ. నీ మహిమ తెలియక మూర్ఖుడినై అలా ప్రవర్తించాను. నీ దగ్గరకు కూడా రాలేను. నా తప్పు క్షమించి నీ యింటికి వెళ్ళి భర్తతో సుఖంగా ఉండు." అని అక్కడుండక వెళ్ళిపోయాడు. 

ఆమె యింటికి వెళ్ళి- "నీ వాగ్దానం చెల్లించి వచ్చావా?" అని అడిగిన భర్తకి జరిగినదంతా చెప్పి "ప్రాణనాధా! భగవంతుడు నా 'పాతివ్రత్యానికి కొంచెమైనా భంగం కలగనివ్వకుండా సంరక్షించాడు. ఇంక నన్ను కూడి నీకు కావలసిన సుఖాలనుభవించు." అంది.

ధనదత్తుడు తన భార్య సత్ప్రవర్తనకి, పతివ్రతా మహిమకీ మెచ్చి ఆమెతో సుఖంగా ఉండసాగాడు.

రాజా! గుణవర్ధన, ధనదత్త, చోరులలో ఉత్తముడెవరో చెప్పు" అన్నాడు భేతాళుడు.

"భేతాళా! ధనదత్త, గుణర్ధనులు సహజంగానే బుద్ధిమంతులు. అందుచేత సందర్భాన్ననుసరించి మెలిగారు. అవేమీ ప్రత్యేకత కాదు. కాని.. ఎప్పుడూ నిర్భయంగా పరులనుహింసించి వారి సొమ్ముని అపహరించడమే వృత్తిగా కల దొంగకు మంచిబుద్ధి పుట్టడమూ, వాడు, మదనసేనని ముట్టకుండా విడచిపెట్టడమూ మెచ్చుకోదగిన విషయం.. వాడే ఉత్తముడు." అని చెప్పాడు విక్రమార్కుడు.

విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కాగానే భేతాళుడు కట్లు విడిపించుకుని రివ్వున ఎగిరిపోయి మోదుగ చెట్టుకొమ్మకి తలకిందులుగా వేలాడసాగాడు.

విక్రమార్కుడు మళ్ళీ అతని కోసం బయలుదేరాడు.

(సశేషం)

No comments:

Post a Comment