*కర్మ ఎలా వస్తుందో ఒకసారి చదవండి...*
ఒకప్పుడు...ఒక ధర్మపరుడు, ప్రజాహితాన్ని కోరుకునే మహారాజు తన రాజ్యంలో బ్రాహ్మణులను సత్కరించేందుకు అత్యంత వైభవంగా అన్నసంతర్పణ ఏర్పాటు చేశాడు. రాజమహల్‌కు ఆనుకొని ఉన్న అందమైన ఉద్యానవనంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. అందుకే అక్కడే విశాలమైన వంటశాల నిర్మించి భోజనం సిద్ధం చేస్తున్నారు.
అదే సమయంలో ఆకాశంలో ఒక డేగ తన గోళ్లలో విషసర్పాన్ని పట్టుకొని ఎగురుతోంది. తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ సర్పం డేగపై విషాన్ని చిమ్మింది. యాదృచ్ఛికంగా ఆ విషపు కొన్ని చుక్కలు కింద బ్రాహ్మణుల కోసం వండుతున్న ఆహార పాత్రలో పడ్డాయి.
ఈ విషయం వంటవారికి ఏమాత్రం తెలియలేదు. భోజనం సిద్ధమైన తర్వాత అత్యంత భక్తి, గౌరవాలతో బ్రాహ్మణులకు వడ్డించారు. అయితే ఆహారంలో విషం కలవడంతో భోజనం చేసిన వారందరూ దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘోర సంఘటన తర్వాత ఒక ప్రశ్న అందరి ముందూ నిలిచింది.ఈ పాపానికి బాధ్యుడు ఎవరు?
ఆహ్వానించిన రాజుదా ?విషం కలిసిందని తెలియని వంటవాడా?తన ఆహారాన్ని తీసుకెళ్తున్న డేగనా? తనను తాను రక్షించుకోవడానికి విషం చిమ్మిన సర్పమా?
సమాధానం ఎవరికీ దొరకలేదు. అందరూ నిర్దోషులుగానే కనిపించారు. అందువల్ల ఆ కర్మఫల నిర్ణయం చాలా కాలం వాయిదా పడింది.
కొంతకాలం తర్వాత కొందరు బ్రాహ్మణులు ఆ నగరానికి వచ్చారు. వారు ఒక మహిళను రాజమహల్‌కు దారి అడిగారు.ఆమె దారి చూపిస్తూ చిరునవ్వుతో ఇలా చెప్పింది:
"రాజమహల్‌కు వెళ్లండి... కానీ కాస్త జాగ్రత్త. అక్కడ బ్రాహ్మణులకు భోజనంలో విషం పెట్టి చంపుతారట!"*
ఆ మాటలు విన్న వెంటనే భగవంతుడు ఇలా అన్నాడు*"ఇప్పుడు ఈ కర్మఫలాన్ని అనుభవించాల్సిన వ్యక్తి దొరికింది " ఆ కర్మ ఫలాన్ని ఆ మహిళలకు వేయండి అన్నారు.
దేవతలు ఆశ్చర్యపడి అడిగారు:
ప్రభూ! ఈ సంఘటన జరిగినప్పుడు ఈ మహిళ అక్కడ లేదు. విషం కలపలేదు, భోజనం వండలేదు, వడ్డించలేదు. మరి ఆమె ఎలా ఈ పాపానికి భాగస్వామి అవుతుంది?"
అప్పుడు భగవంతుడు ఇలా సమాధానం ఇచ్చాడు:
"ఒక పాపకార్యానికి పాల్పడినవాడే కాదు, ఆ పాపాన్ని ఆస్వాదించినవాడు, అసత్యాన్ని ప్రచారం చేసినవాడు, నిజం తెలుసుకోకుండా అపవాదులు వ్యాప్తి చేసినవాడూ ఆ కర్మఫలంలో భాగస్వామి అవుతాడు."
"రాజు సంకల్పం పవిత్రమైనది. వంటవాడు తెలియక చేశాడు. డేగ, సర్పం తమ సహజ స్వభావం ప్రకారమే ప్రవర్తించాయి. కానీ ఈ మహిళ నిజం తెలుసుకోకుండా అబద్ధపు నిందను ప్రచారం చేసి, ఆ విషాద సంఘటనను ఇతరులకు చెప్పడంలో ఆనందించింది. అందుకే ఆమె కూడా ఆ కర్మఫలానికి అర్హురాలైంది." అన్నాడు.
ఈ కథ మనకు ఒక గొప్ప జీవిత సత్యాన్ని బోధిస్తుంది. మనం చేసే పనులే కాదు... మన ఆలోచనలు, మన భావాలు, మన మాటలు, ఇతరుల పట్ల మన దృష్టికోణం కూడా కర్మలో భాగమే. కావున నిజం తెలుసుకోకుండా ఎవ్వరినీ నిందించకూడదు. అపవాదులు, పుకార్లు వ్యాప్తి చేయకూడదు. ఇతరుల కష్టాల్లో ఆనందించకూడదు. అసత్య ప్రచారం కూడా తీవ్రమైన పాపమే. నేటి కాలంలో అకారణంగా నిందలు వేసే వారికి ఇదొక కనువిప్పు.
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం విజయవాడ 👏
No comments:
Post a Comment