*🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🌵🌵🌵 🌵🌵🌵 🌵🌵🌵
*జీవితం అంటే*
*జీవితంలో నిజంగా మనం జీవిస్తున్నామా? ఇది అంతుచిక్కని ప్రశ్న. వ్యధలతో, బాధలతో, అసంతృప్తులతో, నిరాశా నిస్పృహలతో జీవితమంతా గడిచిపోయింది. వెనక్కి తిరిగి చూసుకుంటే చివరకు మిగిలేది ఏమిటి?అనంతమైన పశ్చాత్తాపం కళ్ల ముందు సాకారమవుతుంది. దేవుడిచ్చిన బహుమానమైన ఈ జీవితం ఇలా నిష్ఫలంగా ముగిసిపోతుందనే చింతన చరమాంకంలో వేధిస్తుంది. అందుకే ముందే మేల్కోవాలి. జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. శాశ్వతంకాని దేహం మీద మమత్వాన్ని వదిలిపెట్టి శాశ్వతుడైన పరబ్రహ్మను భజించమని జగద్గురువు ఆదిశంకరులు మహోపదేశం చేశారు. అవిద్య, రాగద్వేషాలు, జీవితంపట్ల నిర్లక్ష్యం, మానవీయత లేకపోవడం, జడత్వం- వీటిని పంచ మహాదుఃఖాలుగా పతంజలి మహర్షి అభివర్ణించారు.*
*జీవితమంటే చావు వచ్చేంతవరకు కొనసాగించే పయనం ఎంత మాత్రమూ కాదు. ‘మృత్యువు నిన్ను నీడలా ఎల్లప్పుడూ అనుసరిస్తుంది. అది నిన్ను అక్కున చేర్చుకోకముందే, దాన్ని జయించాలి. మరణించే నువ్వు జీవించాలి’ అని ఉపనిషత్తులు ప్రబోధించాయి. అన్ని దుఃఖాలకంటే మరణ దుఃఖం అతి భయంకరమైనది. మరణ దుఃఖాన్ని, మృత్యుభీతిని అధిగమించడం ఎలా?పరమాత్ముడికి ప్రియమైన రీతిలో మనం జీవన సంవిధానాన్ని అవలంబించడం ద్వారా మృత్యువునైనా ప్రియమైన మిత్రుడిగా మార్చుకోవచ్చు. నిష్కామ భావంతో కర్మాచరణ చేస్తూ, ధర్మపథంలో పయనించడం ద్వారా, చింతనామృతాన్ని నిరంతరం ఆస్వాదించడం ద్వారా జీవన మార్గాన్ని సుగమం చేసుకోవచ్చు. మాననీయమైన మానవీయ విలువలతో కూడిన జీవితాన్ని గడిపినవారే చిరంజీవులు. అలాంటివారే అసలైన కీర్తిశేషులు!*
*మనిషి తన జీవితాన్ని ధర్మానికి అనుగుణంగా మలచుకుంటే మరణ భయం నుంచి బయట పడవచ్చు. తన కోసం, సమాజం కోసం, దైవం కోసం ఎలాంటి కర్తవ్యాల్ని ఆచరించి తరించాలో తెలుసుకుని మసలుకోవచ్చు. తనను తాను తెలుసుకోలేనివాడు సామాన్యుడు. ఆ జ్ఞానాన్ని పొందినవాడు మాన్యుడు. సమస్త ప్రాణులపట్ల అనురక్తిని ప్రదర్శిస్తూ, సర్వభూతాల పట్ల మిత్రత్వాన్ని కలిగి ఉంటూ, సకల జనుల పట్ల దయాభావాన్ని ప్రకటిస్తూ, అహంకార రహితులై, సుఖదుఃఖాల్లో సమభావం కలవారే తనకు ప్రియమైనవారని భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు. క్షమ, నిగ్రహం, ప్రేమ, సత్యసంధత, రుజువర్తన, వినయం, భూతదయ, సేవాతత్పరత ఈ అష్టసూత్రాల్ని జీవితానికి అనుసంధానించుకోవడం ద్వారా లోకాన్ని వశం చేసుకోవచ్చని భాగవతం ప్రతిపాదించింది. జీవన రథానికి ఇంధనం ఆత్మవిశ్వాసం. ‘బతుకు అనేది మెతుకుల కోసం పోరాటం కాదు. బతుకు గతుకుల మయం కాకూడదు. బతుకు అతుకుల బొంతగా కనిపించకూడదు. ఈ బతుకు దయగల భగవంతుడిచ్చిన అపురూప అవకాశం.*
*దాన్ని అందిపుచ్చుకో. చరితార్థుడిగా మిగిలిపో!’- ఓ సూఫీ కవిత వెల్లడించిన జీవన సత్యమిది. జీవితం పట్ల భయం ఉండకూడదు. భక్తి ఉండాలి. శేష ప్రశ్నగా మిగిలే భవిష్యత్ జీవితంపట్ల వర్తమానంలో ఆందోళన అనవసరం. ధీరచిత్తంతో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సదా సమాయత్తంగా ఉండాలి. ఇదే ఉదాత్త చరితుల ఉత్తమలక్షణం. ధైర్యం, నిర్భయత్వమనేవి ఆత్మజ్ఞానంతోనే సిద్ధిస్తాయి. సర్వశుభంకరమైన ధర్మకర్మల్ని ఆచరిస్తూ కర్మసాక్షి అయిన భగవంతుడు మనల్ని గమనిస్తున్నాడనే ఎరుకను కలిగిఉండాలి. తరతరాలుగా అనుసరిస్తున్న ఆధ్యాత్మిక జీవన సంవిధానాన్ని పాటించాలి. నైతికశీల సంపత్తితో వేదవిహితమైన విధివిధానాలతో జీవన సంగీతపు మధురిమల్ని ఆస్వాదించాలి. జీవితనౌకను వెలుగు తీరానికి చేర్చాలంటే ముందు అంతర్వీక్షణతో మనలో కాంతిని నింపుకోవాలి. హృదయాలయంలో జ్ఞానజ్యోతుల్ని ప్రజ్వలింపజేసుకోవాలి!*
🌵🌵🌵 🌵🌵🌵 🌵🌵🌵
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
🌴🦚🌴 🦚🌴🦚 🌴🦚🌴
No comments:
Post a Comment