Monday, December 2, 2024

*****❗మనమూ ఆలోచించాలి!❗

 ❗మనమూ ఆలోచించాలి!❗
   -నవతెలంగాణ సంపాదకీయం 

👉మనకు జబ్బు చేస్తే డాక్టరు దగ్గరకెళ్తాం. మందులు వాడతాం.మొన్న కరోనా వైరస్‌ విజృంభించి దాడి చేస్తే ప్రపంచమంతా వణికిపోయి, ఎన్ని జాగ్రత్తలు తీసుకొందో.. ఆఖరుకు వ్యాక్సిను కనుగొని నివారించుకున్నాం. 

👉లెక్కలేనన్ని బాక్టీరియాలు,వైరస్‌లు నిత్యం మనపై దాడి చేయటం,వాటిని తరిమి ఆరోగ్యాన్ని రక్షించు కోవడం ఒక జీవన పోరాటం. ఇవన్నీ కూడా మనకు తెలిసి, కనపడుతూన్న శత్రు దాడులు. అందుకే అరికట్టే ఆయుధాలను సమకూర్చు కుంటాము. 

👉కానీ కనపడకుండా మన మనసుపై, శరీరంపై దాడి చేస్తూ భవిష్యత్తునంతా చిద్రం చేస్తున్న వైరస్సు మన ఆహ్వానం మేరకే వచ్చి తన ప్రతాపాన్ని చూపెడుతున్నది. అదే సామాజిక మాధ్యమం (సోషల్‌ మీడియా). 

👉ఇది వైరస్‌ కన్నా ప్రమాదకరమైనదే.కొన్ని తరాలనే నిర్వీర్యులను చేస్తున్నది. నిస్సత్తువకూ, మానసిక దౌర్భల్యానికి గురిచేస్తున్నది. మిత్రునిలా దరిచేరి, శత్రువులా కబళిస్తున్నది.

👉అది గమనించిన ఆస్ట్రేలియా సర్కారు, ప్రపంచంలోనే మొట్టమొదటిగా మేల్కొన్నది. వారి పార్లమెంటు ఒక మంచి నిర్ణయం తీసుకుంది. శారీరక,మానసిక ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని పదహారు ఏండ్లలోపు పిల్లలకు సామాజిక మాధ్యమాలను నిషేధిస్తూ ఒక బిల్లును ఆమోదించింది. 

👉ఇదొక సాహసోపేతమైన చర్యనే.పిల్లల వయసుకు సంబంధించి సోషల్‌ మీడియా వేదికలు హేతుబద్ధ మైన చర్యలు తీసుకోవాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం సూచించింది. 

👉ఎక్స్‌,ఫేస్‌బుక్‌,ఇన్‌స్టాగ్రామ్‌,టిక్‌టాక్‌, స్నాప్‌చాట్‌, రెడిట్‌ మొదలైన అన్ని సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ లకు ఈ నిషేధం వర్తిస్తుందనీ పేర్కొంది. 

👉అయితే ఈ నిషేధిత జాబితాలో యూట్యూబ్‌ను మినహాయించింది.వయసు నిబంధన కఠినంగా అమలుపరచాలనీ, సోషల్‌ మీడియాలో పిల్లలు ఖాతాలు ఆరంభించకుండా నిరోధించకపోతే, సంబంధిత వేదికలకు 280 కోట్లు జరిమానాగా విధించుతారని చట్టం పేర్కొంది. 

👉ఆ దేశ ప్రధాని ఆంటోనీ అల్బనేసే మాట్లాడుతూ, విపరీతంగా సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్న కారణంగా పిల్లల మానసిక,శారీరక ఆరోగ్యం చాలా ప్రభావిత మవుతోందని,అందువల్లనే ఈ నిషేధ చట్టం తెచ్చామని తెలపడం, మనమంతా కూడా ఆలోచించాల్సిన విషయం.

👉చేతిలోకి సెల్‌ఫోన్లు వచ్చాక వివిధ సోషల్‌ మీడియా వేదికలు అనేకానేక చర్చలకు,అవాస్తవ, అశాస్త్రీయ,భ్రమాత్మక విషయాలకు వేదికగా మారిపోయాయి. 

👉ముఖ్యంగా యువత,పిల్లలు వాటికి అలవాటు పడిపోయి,ఇంకే విషయాలనూ, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని,పనులను, సమస్యలనూ పట్టించు కోకుండా పోయింది. 

👉మొత్తం 24 గంటల్లో అనేక గంటలు ముఖాన్ని కదలకుండా స్క్రీన్‌పై పెట్టడం, వేళ్లతో చాటింగ్‌లూ చేయటంలోనే మునిగి పోవటంవల్ల, శారీరకమైన రుగ్మతలు తలెత్తుతున్నాయి. అనవసరమైన, ఎందుకూ పనికిరాని చెత్తంతా మెదళ్ళపై చేరుతున్నది. 

👉ఇప్పటికే పిల్లలు ఘోరమైన గేమ్స్‌ వీడియోలు చూడటంవల్ల,వారి మానసిక పరిస్థితి హింసాత్మకంగా స్పందనా రహితంగా మారుతోందని మానసిక వైద్యులు వెల్లడిస్తున్నారు.

👉చూపు మందగిస్తోంది.శారీరక కదలికలు, ఆటలు కరువై ఎదుగుదల కూడా ఆగిపోతున్నది. అంతేకాక సోషల్‌ మీడియాలో వచ్చే విషయాలు, సమాచారమే వాస్తవమైనదని భావించి అనేక అపోహలకు గురవుతున్నారు. ఇది భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 

👉ఇక చూడటం అలవాటయిన తర్వాత చూడ కుండా ఉండలేనితనం పెరిగింది. అందుకనే పిల్లలు సెల్‌ఫోన్ల కోసం,యాప్‌ల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు.మానసిక రోగులుగా మారిపోతున్నారు. ఒంటరులవు తున్నారు. దొంగతనాలకు,దోపిడీలకు పాల్పడుతున్నారు.

👉పిల్లలను చైతన్యరహితులుగా,నిస్తేజులుగా తయారు చేయటమే కాకుండా,మానసిక అనారోగ్యానికి గురిచేస్తున్న,శారీరక ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తున్న ఈ సోషల్‌ మీడియాను 16 ఏండ్లలోపు పిల్లలకు దూరంగా ఉంచడం చాలా అవసరమైన చర్య. ఇది చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు.

👉కానీ భవిష్యత్‌ తరాలకు,వారి క్షేమానికి సంబంధించినది. ఆస్ట్రేలియా దేశం చేసినట్టు గానే మన దేశమూ చేయాలి. తల్లిదండ్రులు ఈ విషయమై ఆలోచించి ప్రభుత్వాల ముందుకు నిషేధ డిమండును తీసుకురావాల్సి ఉంది.ప్రభుత్వాలూ భావితరాల బాగుకోసం బాధ్యతగా ఆలోచన చేయాలి.

No comments:

Post a Comment