Monday, December 2, 2024

 *189 - శ్రీ విద్యా - శాశ్వతమైన శక్తి / Sri Vidya – The Eternal Energy*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩

*29. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీవిరాజతా*

పరమేశ్వరి యొక్క చుబుకాన్ని వర్ణించటానికి ఇంతవరకు ఉపమానమే దొరకలేదు.
బ్రహ్మాది దేవతలందరూ కూడా నునుపైన చెక్కిళ్ళు గలిగి గుండ్రంగా ఉన్నటువంటి
ముఖానికి ఈ చుబుకము తొడిమలా ఉన్నది అన్నారు. అంతేకాని ఆ చుబుకానికి
ఇంతవరకు సరియైన ఉపమానాన్ని చూపలేకపోయారు. అంటే పరమేశ్వరి చుబుకము
సాటిలేనటువంటి అందముగలది. అద్దములో చూసినప్పుడు దాని ప్రతిబింబమే దానికి
సరియైన ఉపమానము.


శంకరభగవత్పాదులవారు కూడా దేవిచుబుకాన్ని వర్ణించటానికి వీలు కాదు
అంటున్నారు సౌందర్య లహరిలోని 67వ శ్లోకంలో....


*కరాగ్రేణ స్పృష్టం - తుహినగిరిణా వత్సలతయా*
*గిరీశే నోదస్తం - ముహు రధరపానాకులతయా |*
*కరగ్రాహ్యం శంభో - ర్ముఖముకురవృంతం గిరిసుతే*
*కథంకారం బ్రూమ - స్తవ చుబుక మౌపమ్యరహితమ్‌67*


గిరిసుత చుబుకము, తండ్రిచే ప్రేమగా పుణకబడింది. శివునికి దేవి ముఖము అద్దము కాగా, ఆ అద్దమునకు పిడివంటిది, ఆమె చుబుకము. దానిని పోల్చుటకు, మరేదియును సాటిరాదు.


పర్వతరాజ పుత్రీ ! తండ్రియగు హిమవంతునిచే అమితమగు వాత్సల్యముతో
మునివ్రేళ్ళతో పుణకబడినది, కైలాసపతి చేత అధరపానమునందలి అనులత్వము చేత
మాటిమాటికి తొట్రుపడుచు పైకెత్తబడినది, శంభుని చేతితో మాత్రమే పట్టుకోతగ్గది,
సాటిలేనిది అయిన ముఖము అనే అద్దానికి పిడివంటిది అయిన నీ చుబుకమును ఏ
విధంగా వర్ణించను అన్నారు తండ్రికి పిల్లల మీద ఉండే ప్రేమను వాత్సల్యము అంటారు.


ఈ ప్రేమను వివిధ సందర్భాలలో వివిధ పేర్లతో పిలుస్తారు.


పిల్లల మీద ఉండేది - వాత్సల్యము
భార్య ఎడ ఉండేది గా ప్రేమ
శిష్యులయందుండేది - అనుగ్రహము
అగ్రజులందుండేది - భక్తి.


హిమవంతుడు పరమేశ్వరికి తండ్రి కాబట్టి, అతనికి దేవియందుండునది
వాత్సల్యము.


అమ్మవారి చుబుకంతి నిరుపమానము. అనగా దేనితోనూ
పోల్చిచెప్పుటకు సాధ్యపడని అంశము. సరస్వతి మొదలుకొని సమస్త కవులకు వర్ణించుటకు ఏ ఉపమానము లభ్యముకానంత అందమైన చుబుకము అమ్మవారి చుబుకము. సాధకుడు తనకు తానుగ ఊహించు కొనవలసిన అందమైన చుబుకమేగాని, పోల్చిచెప్పుటకు ఉపమానము లేదు.


కొన్ని దివ్య విషయములు సాధకుని ఊహకు వదలుట సహజమైన ఋషి సంప్రదాయము. సాధకుడు తనకు తానుగా కాంతి రూపమును ఊహించుట ఇచ్చట సంకేతింప బడినది. నామమును స్తోత్రము చేయునప్పుడు తత్సంబంధమైన కాంతిరూపమును ఉపాసకుడు ఊహింపవలెను.


కాంతివంతమైన రూపమును తాను ఊహించి దర్శించుచున్న కొలదియూ ఉపాసకునిలో కాంతి పెరుగును. యాంత్రికమైన స్తోత్రాదికములు చేయుటలో శ్రమయేగాని, ఫలము దక్కదు. దేవి నామములను, ప్రత్యేకించి ఆయా రూపములను వర్ణించు నామములను పఠించునపుడు కాంతి రూపమును దర్శించుట ఉపాసకునకు ప్రాథమిక కర్తవ్యము.


కాంతిని స్తోత్రాదికములు చేయుచూ ఊహించుట దీక్షగ సాగినచో సాధకుడు తన పరిసరములను మరచి కాంతిలోకమున చేరును. కాంతి లోకమున మనసు నిలబడుటవలన బుద్ధికిని, మనసునకును వంతెన నిర్మాణము కాగలదు. అది కారణముగ సాధకునియందు క్రమశః దైవీస్వభావము ఏర్పడుట, ముఖము నందు, కన్నులయందు కాంతి పెరుగుట జరుగగలదు.


నిరుపమానమైన, కాంతివంతమైన చుబుకము అందమైన దేవి ముఖమునకు దీటుగ నూహించి, శ్రీదేవి ముఖధ్యానము పరిపూర్తి గావించుకొన వలెను. కేశపాశములు మొదలుకొని చుబుకము వరకు గల వర్ణనము స్తోత్రము చేయువాని మనస్సును ఆకర్షింపచేయగలదు. పన్నెండవ నామము నుండి ఇరవైతొమ్మిదవ నామము వరకు పదునెనిమిది నామములతో దేవి ముఖ వర్ణనము రమణీయముగ చిత్రింపబడినది. 


అర్థసహితముగ మనసు పెట్టి ఈ నామములను రాగయుక్తముగ ఆలాపన చేయు సత్సాధకునకు శ్రీదేవి ముఖము సమస్త సన్మంగళములను కూర్చును గాక!


చుబుకం అన్నా చిబుకం అన్నా గడ్డం అనే అర్థం. అందమైన వస్తువులను మరొక అందమైన వస్తువు తో పోల్చడం కవి లక్షణం. కానీ కవిత్వానికి,ఏ వస్తువుతోనూ పోల్చలేని ఒక మహా అద్భుత సౌందర్యం  అమ్మవారి చుబుకం.ఈ చిబుకం నుంచి వచ్చే కాంతిని కొంచెం స్వీకరించి రవిచంద్రులు,గ్రహాలు, నక్షత్రాలు వెలుగుతున్నాయి.


కామేశ్వరుడు అమ్మవారి ఈ చిబుకపు సొగసుకు లొంగి అమ్మ చుట్టూ తిరుగుతున్నాడు.
ఈ కారణం, కార్యాలే పురుష, ప్రకృతులు. శివ, పార్వతులు ఇద్దరు సూత్రముచే సంధింపబడుదురు. పరబ్రహ్మం నుండి సృష్టి వరకు ఉండెడి బ్రహ్మ సూత్రము. మనిషిలో కదలుతున్న భావమనే ఆనందం మాట్లాడే వరకూ ఉన్న అనుభవమే సూత్రం. శ్రీమాత నామంలో పంచదశి మంత్రంలోని *క, ఏ, ఈ, ల, హ్రీం* అనే కాది విద్య వాగ్భవ కూటము సమాప్త సమాప్తమగుచున్నది.


వేదంలో మంగళసూత్రం ప్రసక్తి లేదు. అక్కడ పాణిగ్రహణము, సప్తపది మాత్రమే
చెప్పబడ్డాయి. కాని కాలానుగుణంగా సంప్రదాయం మారిపోయింది.


మాంగల్యం తంతునాల నేన మమ జీవనహేతునా ।

కంఠే బధ్నామి సుభగే ! త్వం జీవ శరద శృతం ॥


“నా జీవమునకు హేతువైన యీ సూత్రముచేత నేను నీ కంఠమున మాంగల్యమును
బద్ధము చేయుచున్నాను. నీవు నూరు సంవత్సరములు జీవించుము” అని చెప్పి
మంగళసూత్రధారణ చెయ్యటము వివాహంలో ముఖ్యమైన తంతుగా మారిపోయింది.
ఈ మాంగల్యం - ప్రథమాభరణము..


ఇక్కడ శివునిచే కట్టబడిన మాంగల్యముతో శోభించుచున్న కంఠసీమ గలది అని
భావన.


ఈ విషయాన్ని శంకరుల వారు తమ సౌందర్య లహరిలోని 69వ శ్లోకంలో...


*గళే రేఖాస్త్రిస్రో - గతిగమకగీతైక నిపుణే*
*వివాహవ్యానద్ధ - ప్రగుణగుణసఖ్యా ప్రతిభువః|*
*విరాజంతే నానా - విధ మధురరాగాకరభువాం*
*త్రయాణాం గ్రామాణాం - స్థితినియమ సీమాన ఇవ తే69*


దేవీ ! వివాహ సమయంలో నీ మెడలో కట్టిన మంగళసూత్రములోని మూడు
ముడులు మృదు మధుర రాగాలయిన షడ్డగ్రామ, మధ్యగ్రామ, గాంధారగ్రామముల
యొక్క ఉనికికి హద్దులాగా కనపడుతున్నవి.


పరమేశ్వరి వివాహ సమయంలో శివుని చేత వేయబడిన ముడులు మూడు
ముడతలలాగా కనిపిస్తున్నాయి. అవే దేవి కంఠసీమయందు మూడు ముడుతలు గలవైన
మూడు రేఖలు. ఈ రేఖలు అనేక రకాలయిన మనోహరమైన రాగాలు, ఉపరాగాలు,
జనకరాగాలు, భాషారాగాలు, విభాషారాగాలు, అంతరాలు, భాషలు అనే ప్రసిద్ధమైనటు
వంటి రాగాలకు గనులై, స్వరస్థానాలై, ఆశ్రయములై, షడ్జమ, మధ్యమ, గాంధార.  


గ్రామాలనబడే స్వర ఆరోహణ, అవరోహణ క్రమాలన్సింటికీ సరిహద్దుగా ఆ మూడు
ముడుతలు కనిపిస్తున్నాయి.


ఈ శ్లోకంలో దేవి కంఠసీమలోని మాంగల్యంలో ఉన్న మూడు ముడులు
వళిత్రయమని అదే గాత్రత్రయము అని చెప్పబడింది. ఈ విధంగా పరమేశ్వరి సంగీతనిధి అంటున్నారు శంకరులు.

🕉🌞🌏🌙🌟🚩

No comments:

Post a Comment