*190 - శ్రీ విద్యా - శాశ్వతమైన శక్తి / Sri Vidya – The Eternal Energy*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩
*30. ఓం కామేశబద్ద మాంగళ్యసూత్ర శోభిత కంథరాయై నమః!!*
కామేశ్వరుడు కట్టిన మంగళసూత్రంతో అమ్మవారి మెడ శోభిస్తున్నది.
ఈ మంగళసూత్ర ప్రభావం వల్ల కామేశ్వరుడు లోకపాలకుడై,చిరంజీవియై ఉన్నాడు.
మ్రింగేవాడు భర్త అని,మ్రింగెడిది విషమని అని తెలిసినా లోకశ్రేయస్సు కోసం పార్వతి శివుడిని విషం త్రాగమన్నది.
దీని అంతరార్థం తన మంగళసూత్ర బలమే శివుడికి రక్షణ అని పార్వతి భావించిదన్నమాట.
శ్రీ లలితామాత మాంగల్య బలంతో కామేశ్వరుడు లోకపాలకుడు అయ్యాడు.
పరమశివునిచే కట్టబడి, మన్మథుడు మళ్ళీ బ్రతకటానికి కారణమై, సౌభాగ్యాభరణమైన
మంగళసూత్రముచే ప్రకాశించు మెడగలది.
కామేశ్వరునిచే కట్టబడిన సౌభాగ్యకారకమైన మంగళసూత్రముచే ప్రకాశించు మెడగలది శ్రీదేవి. ఇచ్చట వర్ణనము శ్రీదేవి మెడనుగూర్చి అందమైన ఆమె మెడకు మంగళసూత్రము మరింత శోభ కలిగించినది.
ఆ మంగళసూత్రము కూడ విశిష్టమైనది. ఎందువలనన కామమునకు ఈశ్వరుడగు శివునిచే కట్టబడినది కదా! శివుడు కామేశ్వరుడు. అనగా మన్మథునకు కూడ ప్రభువు.
మన్మథుడు అతని కనుసన్నల ఆజ్ఞల ననుసరించి జీవించవలసినదే. కామమును ఉజ్జీవింప జేయుటకు, హరించుటకు అధికారముగల ఈశ్వరునిచే కట్టబడిన మంగళసూత్రమిది.
సాధారణముగ జీవులలో మంగళసూత్ర ధారణము చేయు సమయమున పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె ఒకరి కనులలోనికి ఒకరు చూచుకొనునప్పుడు కాముడు జనించి ఒకరికొకరు ఆకర్షితులగుదురు.
దాంపత్య జీవనమున పరస్పర ఆకర్షణ ప్రాథమికముగ కామాకర్షణయే. మంగళసూత్ర ధారణ కారణముగ మన్మథుడుధ్భవించి చెలరేగును.
కాని, ఇచ్చట మంగళసూత్రము కట్టినది కామేశుడు. మన్మథుడు తనంతట తానుగ చెలరేగుటకు అవకాశము లేదు.
అందుచే వర్ణింపబడిన మంగళసూత్రము విశిష్టమైనది. ఆ మంగళసూత్రము అలంకరించిన మెడ కూడ సరిసమానమైన విశిష్టత గలది. శ్రీదేవి కాంతులీను మెడవలన మంగళ సూత్రము శోభించుచున్నది.
పరమశివుడు కట్టిన మంగళసూత్రము కారణముగ అమ్మవారి మెడకూడ శోభించుచున్నది. మంగళసూత్రము కామసంజనకము కానప్పుడు అది సౌభాగ్య కారణ మగును. కనులు కనులతో కలసిన సమయమున జీవాకర్షణము జనియించినచో వివాహము సౌభాగ్యప్రదము కాగలదు. అట్టి సౌభాగ్యమును సూచించు సూత్రము కావున అది వట్టి దారము కాక మంగళసూత్రమైనది. మంగళ సూత్ర ధారణము వేదము నందు ప్రస్తావింపబడలేదు.
దక్షిణభారతమున ఏర్పడిన ప్రాచీన సంప్రదాయ మిది. స్త్రీ-పురుషులకు పరస్పర బాధ్యతలను, బద్ధ జీవనమును గుర్తుచేయు సంకేతమే ధరింపబడిన మంగళసూత్రము.
కామేశుఢు అనగా శ్రీచక్రము మధ్యభాగమున బిందుమండల నివాసియైన నిశ్చల పరమాత్మ. అతనిచే కంఠసీమ యందు కట్టబడిన మంగళ సూత్రముచే శోభిల్లునది.
పరాశక్తి శ్రీ లలితాదేవి పరస్పర విరుద్ధ స్వభావంతో ఉండినను శివ-శక్తుల జంట అవిభాజ్యము అని తలంపబడును. అనగా శక్తిని వీడి శివుడు లేడు, శివుని వీడి శక్తియు లేదు అని ఫలితార్థము సౌభాగ్య ఆభరణములలో మాంగల్యము అతి ముఖ్యమైనది.
ప్రణవ మంత్ర స్థానము కంఠము - విశుద్ధచక్ర స్థానము - శబ్ద, విద్యా మంత్రములకు మూలము అగును. ముఖ వృత్తమందలి ప్రణవేతర సంఖ్యలు సమాహారంతో ముప్పది రెండు (32) అగును. దీనిచే శుద్ధ విద్యా సంఖ్యయు సూచితమగును అనగా ద్విజపంక్తి ద్వయము (16+16). మరియు దీనిచే పూర్ణగాయత్రీ సంఖ్యయు సూచితమగును. మంగళ సూత్రము నందలి సంఖ్యల వివరము ఇలా ఉంటుంది....
1) *వేదములు*: ఋక్ - యజుస్ - సామ - అథర్వణ వేదములు (4).
2) *నవబ్రహ్మలు* మరీచి - భరద్వాజ - అంగీరస - పులస్త్య - పులహ - క్రతు -అదక్ష - వశిష్ట - వామదేవులు (9)
3) *సప్తఋషులు* కశ్యప - అత్రి - భరద్వాజ - విశ్వామిత్ర - గౌతమ - జమదగ్ని - వశిష్టులు (7)
ఇందులో వేదాల సంఖ్య (4) + ఋషుల సంఖ్య (7) అనగా ప్రథమ, తృతీయ సంఖ్యా మేళనముచే ఏర్పడు సంఖ్య 11.
అనగా ఈ ఏకాదశ సంఖ్య ఏకాదశ రుద్రులను సూచించును వారు...
1) ఉగ్రుడు,
2) సోముడు,
3) శర్వుడు,
4) మృగవ్యాధుడు,
5) రంతిజుడు,
6) బిక్షకుడు, 7)అహిర్బుద్నుడు,
8) పినాకి,
9) పాదుకేశ్వరుడు,
10) కాపాలికేయుడు, 11) భౌముడు వీరిని ఏకాదశ రుద్రులు అందురు, అప్పుడు 4 + 9 + 7 + 11 = 31 మొత్తము. వీటి సమాహారము 1 + 31 = 32 అగును.
ఇదియే శ్రీమాత కంఠమున విరాజల్లే మాంగల్య సూత్ర స్వరూపము అనియు తలంపనగును. పరమశివునిచే కట్టబడిన మంగళ సూత్రముచే శోభించుచున్న కంఠమని బాహ్యార్థము. కంఠమున విశుద్ధిచక్రం ఉంటుంది. దీనికి రెండు దళములు ఉండును. ఈ రెండు దళములు శివపార్వతులని అర్థము. ఇక్కడ వాక్కు కదులుతుంది.
ఇక్కడే హంసద్వంద్వము ఉంటుంధి. ఆ ద్వంద్వము 1) స - కారము,
2) హ - కారము.
ఈ రెండు ఉచ్ఛ్వాస, నిశ్వాసలను తెలుపును. మంగళసూత్రము కంఠంలో ఉంటుంది. తలను మొండెమును కలుపు స్థలము. తల కారణాన్ని సూచిస్తుంది. మిగతా దేహం (మొండెం) కార్యాన్ని సూచిస్తుంది.
No comments:
Post a Comment