Tuesday, March 2, 2021

జీవితం ఆశల పల్లకి... మన మనసుతో ఆ పల్లకిని మోయిస్తూనే ఉంటుంది. రోజు మొదలైనప్పటి నుండి ఎన్నో ఆశలు.. అవి నెరవేర్చుకోవడానికి ఎన్నో ప్రణాళికలు..

🈴️
జీవితం ఆశల పల్లకి... మన మనసుతో ఆ పల్లకిని మోయిస్తూనే ఉంటుంది. రోజు మొదలైనప్పటి నుండి ఎన్నో ఆశలు.. అవి నెరవేర్చుకోవడానికి ఎన్నో ప్రణాళికలు... అందిపుచ్చుకునే అవకాశాల కోసం వెతుకుతూనే ఉంటాము. కానీ అందుకున్న ప్రతీ అవకాశం అమృత ఫలాలను ఇవ్వదుగా ! అలా ఇచ్చేస్తే మనసు మనల్ని మన లాగా ఉండనిస్తుందా, సరిలేరు నీకెవ్వరూ... అంటూ ఆకాశానికి ఎత్తేసి మనలో అహంకారాన్ని పెంచేస్తుంది.

విజయమనే వెలుగులో విర్రవీగుతున్న మనల్ని ఆ అహంకారమే అంధకారంలోకి తోసేస్తుంది. అందుకే సృష్టి ధర్మంలో భాగంగా... ఒక్కోసారి అవకాశాలు చేజారి మనిషిగా మన వ్యక్తిత్వం జారిపోకుండా కాపాడతాయేమో !! కానీ క్షణికావేశపరులమైన మనం చేజారిన అవకాశం గురించి కృంగిపోతామే గానీ అందులోనుండి పుట్టుకొచ్చిన మరో అవకాశాన్ని గుర్తించము.

జీవితం ఎవరికీ పూలపాన్పు కాదు. కష్టసుఖాల కలబోత... సుఖదుఃఖాల సుడిగుండం ! మన మనసుని, శరీరాన్ని ఒక అనువయిన స్థితికి (కంఫర్ట్ జోన్)అలవాటు చేసేసి.... ఒడిదుడుకులు వచ్చినపుడు నిలబడి ముందడుగు వేయమనకుండా ... చక్కదిద్దుకునే అవకాశమే లేదంటూ బలహీనపరిచేస్తున్నాము.

మనిషికి ఊపిరి ఉన్నంత వరకు ప్రాణం ఎలా ఉంటుందో ... అవకాశాలు కూడా అంతిమ దశవరకు ఉంటూనే ఉంటాయి.

గాలిని కంటికి కనపడట్లేదని లేదనుకుంటే మూర్ఖత్వమేగా.. అవకాశాలు లేవని ప్రయత్నాలను విరమించుకోవడమూ అంతే !
ఎంత చదివినా మార్కులు వచ్చే అవకాశమే లేదని కుంగిపోతుంటారు కొంతమంది ... మార్కులు రాకపోయినా చదివిన చదువు, అది సంపాదించి పెట్టిన విజ్ఞానం మరో అవకాశం కల్పిస్తూనే ఉంటాయనే సూక్ష్మాన్ని విద్యార్థులకు తెలియజెప్పి వారి వెన్ను తడితే... మనం నేడు చూస్తున్న పసి పిల్లల ఆత్మహత్యలు ఉండవుగా !

ఎన్ని అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేక ఉద్యోగం సంపాదించలేకపోతున్నారని యువతను నిందించేకన్నా... వారి భవితను మార్చే మరో అవకాశం గుర్తించేందుకు సహాయపడితే.. నవభారత ప్రగతికి పునాది వేసినట్టేగా !

తల్లి అయిన క్షణం నుండి తన కోసమంటూ క్షణం వెచ్చించే అవకాశం ఉండదు ఏ తల్లికీ ! అయినా మాతృత్వంలోనే మరో అవకాశాన్ని అందిపుచ్చుకుని ఎందరో మహిళలు అద్భుతాలు సృష్టిస్తున్నారు.

కుటుంబంలో అందరి అవసరాలు తీర్చడానికి అందుబాటులో ఉన్న ప్రతీ అవకాశాన్ని చేజిక్కించుకుని అహర్నిశలు శ్రమించే తండ్రి ఒక తపోధనుడు !

గెలుపుతో గర్వం రానీయవద్దు. ఓటమితో ఓడిపోయాననుకోవద్దు. గెలుపే గొప్ప మలుపనుకోవద్దు. ఓటమే నిన్ను మలిచే శిల్పి అని తెలుసుకోవాలి

చేజారిన అవకాశం కోసం చింత మానుకోవాలి యోచించి యత్నించి సృష్టించుకోగలగాలి మరో అవకాశాన్ని !

ఎవరైనా అవకాశాలు లేక కాదు సాధించలేకపోయేది... గుర్తించక !

మనం గమనిస్తే దేనికైనా సృష్టి - స్థితి - లయ ఈ మూడు ఉంటాయి.దేనినైనా సృష్టించగల శక్తి మనిషికి మాత్రమే ఇచ్చాడు భగవంతుడు. అలాగే నాశనం చేసే శక్తి కూడా ! ప్రాణం ఉన్నంత వరకు సృష్టిలో ప్రతీ సవాలుని స్వీకరించి సాధించమని ఈ మానవ జన్మ వరంగా ఇచ్చాడు.

సృష్టిలో నాశనమయినది ఏదయినా తిరిగి సృష్టించబడుతుంది...కానీ దాని స్థితి మారుతుంది. అలాగే చేజారిన అవకాశమేదయినా మరో అవకాశాన్ని మన ముంగిట నిలుపుతుంది. అందలమెక్కినా అరుగుమీద కూర్చున్నా అందరం మనుషులమే !
అంతస్తులు, స్థితులు ఎవరి అవకాశాలని బట్టి వారు పొందుతారు.

కానీ మనిషిగా మానవత్వం చాటుకోవాలంటే మాత్రం మరో అవకాశం రాదు... ఈ జన్మలోనే సాధ్యం అది !
మనిషిగా పుట్టినందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం !
🚩
copied post

Source - Whatsapp Message

No comments:

Post a Comment