Monday, March 29, 2021

జీవితం ఒక హరివిల్లు

జీవితం ఒక హరివిల్లు

సుఖం-దుఃఖం, వేడుక-వేదన, గెలుపు-ఓటమి, లాభం నష్టం... వీటి సమ్మేళనమే జీవితం.

గెలుపు వచ్చినప్పుడు పొంగిపోకుండా ఓటమి ఎదురైనా కుంగిపోకుండా సమతుల్యతతో జీవితం సాగించే ప్రతి మనిషీ స్థితప్రజ్ఞుడేనని పెద్దలు చెప్పిన మాట. వీరు ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, వాటిని తమకు అనుకూలంగా మార్చుకుని విజేతలవుతారు ప్రతికూలతలోంచి సానుకూలతను వెదుకుతారు కీడులోంచి మేలు సాధిస్తారు. ప్రమాదాలను ప్రమోదాలుగా, ఆపదలను సంపదలుగా మలచుకుంటారు.

శకుని మాయాజూదంతో అరణ్యవాసానికి వెళ్ళవలసి వచ్చినా పాండవులు తమ దుస్థితికి బాధపడలేదు రుషులతో ధర్మశాస్త్ర చర్చల ద్వారా ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఆ సమయంలోనే అర్జునుడు తపస్సు చేసి ఇంద్రుడు మొదలైన దేవతల అనుగ్రహం పొంది వారి ద్వారా అనేక అస్త్ర, శస్త్రవిద్యలు సాధించాడు

తనను యువరాజుగా పట్టాభిషిక్తుడిని చేస్తారని తెలిసినప్పుడు శ్రీరాముడు ఆనందపడలేదు. తరవాతి రోజే తండ్రి ఆజ్ఞ మేరకు వనవాసానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆందోళనా చెందలేదు అరణ్యకాండలో మునులను రాక్షసులబారినుంచి రక్షించాడు. శబరి వంటి భక్తులను అనుగ్రహించాడు.

మహానుభావుల జీవిత చరిత్రలు పఠిస్తే వారి అనుభవాలు జీవితసారాన్ని బోధిస్తాయి. మార్గదర్శక సూత్రాలు నిర్దేశిస్తాయి. కష్టాలపాలైనప్పుడు వాటిని ధైర్యంతో ఎదుర్కొన్నారు. వ్యామోహానికి గురైనప్పుడు నిగ్రహం వహించారు. నిరాశ ఎదురైనప్పుడు మానసిక స్థైర్యంతోముందుకు కదిలారు. ప్రతిబంధకాలనుంచి అవకాశాలు సృష్టించుకున్నారు. అలాంటి వారి అడుగుజాడల్లో నడిచిన ప్రతి మనిషి వెలుగునీడల సమ్మేళనమైన తన జీవితగమనంలోని ప్రతి అడుగూ సంయమనంతో వేస్తాడు, స్థితప్రజ్ఞుడిగా ఎదుగుతాడు.

ఒక న్యాయవాది తన ఇరవై ఒకటో సంవత్సరంలోనే వ్యాపారంలో దిగి పూర్తిగా నష్టపోయాడు. తరవాతి సంవత్సరం శాసనసభకు జరిగే ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయాడు. మరో రెండేళ్లకు వ్యాపారంలో దిగి మళ్లీ నష్టపోయాడు. ఆపై రెండేళ్లకు తాను ప్రాణాధికంగా ప్రేమించిన స్నేహితురాలి మరణంతో విషాదం అనుభవించాడు. ముప్పై నాలుగేళ్ళ వయసులో మళ్ళీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయాడు. తిరిగి నలభై అయిదేళ్ళ వయసులో బరిలోకి దిగీ చట్టసభలో స్థానం సంపాదించుకోలేకపోయాడు. ఇంకో రెండేళ్లకు దేశ ఉపాధ్యక్షుడి పదవికి పోటీచేసి ఓటమి చవిచూశాడు అయితేనేం అన్ని వైఫల్యాల తరవాత తన యాభై రెండో ఏట సువిశాల అమెరికా దేశానికి అధ్యక్షుడయ్యాడు ఆయనే ప్రతి ఓటమినీ గుణపాఠంగా మలచుకుని, తుదకు విజేతగా ఎదిగిన అబ్రహాంలింకన్.

వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయని సంతోషపడతాం. ఆ వానలు ఉద్ధృతమై వరదలుగా, తుపానులుగా మారితే భయపడతాం. మండుటెండల్లో చల్లటిగాలికి సేదతీరతాం. ఆ శీతలపవనం నరాల్ని కొరికే చలిగా మారితే తట్టుకోలేం. వర్షం, ఎండ, శీతలపవనం... శాశ్వతం, వాటినుంచి వచ్చే బాధలు, భయాలు త్వరితగతిన సమసిపోతాయి. అవి తాత్కాలికం మేఘంనుంచి జాలువారిన ప్రతి చినుకూ ముత్యం కాకపోయినా- ఏ చిన్ని మొలకకో ప్రాణం పోస్తుంది. ఎండు ఆకైనా ఒకరి కడుపు నింపేందుకు విస్తరిగా మారుతుంది. ఈ విశాల సృష్టిలో పుట్టిన ప్రతి జీవి బతుక్కీ ఒక అర్థమూ, పరమార్థం ఉంటాయి. అది తెలుసుకున్నవారి జీవితం చరితార్థమవుతుంది

హరివిల్లులో ఏడు రంగులుంటాయి. ఆ సప్తవర్ణాల సమ్మేళనంతో ఆహ్లాదం, ఆనందం వెల్లివిరుస్తాయి. ఆ హరివిల్లు ఏర్పడాలంటే ఎండావానా రెండూ కావాలి సంతోషం దుఃఖం, మంచి చెడు, ఆశ నిరాశల సమ్మేళనమే జీవితం. అలా ప్రతికూల, అనుకూల పరిస్థితులతోనే ప్రతి జీవి బతుక్కీ స్థిరత్వమూ, సార్థకతా! అవే మనిషిని స్థితప్రజ్ఞుడిగా నిలబెడతాయి. అందుకే జీవితం ఒక హరివిల్లు

👏👏👏👏👏👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment