Vedantha panchadasi:
జనకాదేః కథం రాజ్యమితి చేద్దృఢ బోధతః ౹
తథా తవాపి చేత్తర్కం పఠ యద్వా కృషిం కురు ౹౹130౹౹
130. జనకాదులకు తత్త్వబోధ అంత దృఢముగా ఉండెను కనుక పాలింపగలిగిరి.నీవు అభ్యసించి వ్యవసాయము మరి ఏదైనను చేయుము.
వ్యాఖ్య:- మరి జనకాదులు తత్త్వవేత్తలయినప్పటికి రాజ్యకార్యాకార్యాలలో ఎట్లా ప్రవృత్తులైనారు ? అంటే -
జనకాదులంతా రాజ్యకార్యాలు చేస్తూ రాజ్యము లేలిరికదా !
అనినచో వారికి తత్త్వబోధ అంత దృఢముగా ఉండెను కనుక పాలింపగలిగిరి.కాబట్టి వారి తత్త్వాభ్యాసానికి రాజకార్య ప్రవృత్తులు అడ్డంకి కాలేదు.
"విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం" -
ద-మూ-స్త్రో-1
ఈ విశ్వము అద్దములో కనిపించు నగరముతో సమానము కాన ఈ జగత్తు మాయా మాత్రమేగానీ ఒకప్పుడును సత్యముగను ఇంకొకప్పుడు అసత్యముగాదు.
కాన జగత్తు సత్యమనెడి భ్రాంతిని త్యజించి తన ఈ కర్తృత్వ,భోక్తృత్వ రూప జీవత్వమును గూడ అసత్యమని తెలిసికొని తన పరమార్థ రూపమైన బ్రహ్మమునందు స్థితిగలిగి యుండిన
"తత్త్వజ్ఞాన సంపన్నులు"గల వారు కనుకనే జనకాదులు అంత స్థిర రాజ్యపాలన చేయగలిగిరి.
నీవుకూడా దృఢమైన తత్త్వజ్ఞానం కలవాడవైతే నీజీవితాంతం
తర్కం చదివినా సరే !
లేదా వ్యవసాయం,వ్యాపారాదులు లాంటి కార్యాలు ఏమిచేసినా సరే అంత దృఢమైన తత్త్వగ్రహణము నీకు వున్నచో,
ఏమిచేసినా సరే !
ఇబ్బంది లేదు.
కాన తెలివిగల పురుషుడు వాదనలో దిగక చిత్తశుద్ధి పూర్వకముగా జ్ఞానోత్పత్తికి ప్రయత్నము చేయవలెను.
గృహము అగ్నికి దగ్ధమగుచుండగా ఇంటికి
నిప్పు
ఎవరు,ఎప్పుడు,ఎందుకు పెట్టారు ? అని ఆలోచించుచూ యున్నచో ఆ ఇంటిని అగ్ని పూర్తిగా దహించి వేయును. కాన ఏ ఆలోచనలు చేయక వెంటనే ఆర్పివేయవలయును.
అట్లే జీవుడు అవిద్యాంధ కారములో మునిగి ఉన్నందున దీనిని నశింపజేసుకొను ప్రయత్నము చెయ్యక అవిద్యోత్పత్తిని గురించి ఆలోచించుచూ దానినే
మరల మరల విచారించుచూ యున్నచో ఏదో ఒక రోజు మృత్యువు కబళించి వేయును.
కాన ఈ ఆలోచనలు వదలి, తత్త్వజ్ఞాన సంపద సంపాదనకు తీవ్రప్రయత్నము చేయవలెను.
సర్వ సంశయములకు మూలమైన ఈ అవిద్య అనిర్వచనీయమై యున్నను తత్త్వజ్ఞానము ద్వారా నశించును.ఈ అవిద్య జ్ఞానము ద్వారా ఒకపరి నశించెనేని ఈ సర్వమూ నశించును.అనగా మిధ్యగా తెలియ వచ్చును.
అట్టి ఆత్మజ్ఞానులు దేనిని గుర్చియు దుఃఖింపరు.
దేనినీ గూడా వాంఛింపరు. శుభాశుభములను యాచింపరు. వ్యవహారములన్నింటినీ చేయుదురు.కానీ వాస్తవముగ దేనిని చేయనివారే యగును.
మిథ్యాత్వ వాసనాదార్ధ్యే ప్రారబ్దక్షయకాంక్షయా ౹
అక్లిశ్యంతః ప్రవర్తంతే స్వస్వకర్మానుసారతః ౹౹131౹౹
అతి ప్రసంగోమా శక్యః స్వకర్మవశవర్తినామ్ ౹
అస్తు వా కోఽ త్ర శక్యేత కర్మ వారయితుం వద ౹౹132౹౹
131.132.మిథ్యేే అని జ్ఞాని ప్రారబ్ధ ఖర్మ తదనుగుణముగ ప్రవర్తింతురు.అనాచారము కూడా ప్రారబ్దవశమే వారింప నెవరి తరము ?
జ్ఞానినోఽ జ్ఞానినశ్చాత్ర సమే ప్రారబ్ధకర్మణీ ౹
న క్లేశో జ్ఞానినో ధైర్యాన్మూఢః క్లిశ్యత్యధైర్యతః ౹౹133౹౹
మార్గే గంన్తోర్ద్వయోః శ్రాన్తౌ సమాయా మప్యదూరతామ్ ౹
జానన్ ధైర్యాద్ధృతం గచ్ఛేదన్యస్తిష్ఠతి దీనధీః ౹౹134౹౹
133.134.జ్ఞానికి అజ్ఞానికి ప్రారబ్ధము సమమే.కాని జ్ఞానికి గమ్యము తెలియును.అది తెలియని వాడు ఆలసించును.
వ్యాఖ్య :- సంసార స్వరూపం తెలిసికూడా తత్త్వవేత్తలు ఎందుకు సంసార ప్రవృత్తులౌతున్నారు ? అంటే -
సంసారులైనవారు తప్పనిసరిగా ప్రారబ్ధ కర్మ ఫలాన్ని అనుభవించాల్సిందే !
ప్రపంచము మిథ్యయనే సంస్కారము దృఢముగా ఏర్పడిన పిదప అందలి సుఖదుఃఖములచే క్లేశము నొందక జ్ఞాని పురుషులు ప్రారబ్దకర్మ తీరుటకై తదనుగుణముగా ప్రవర్తింతురు.
జగన్మిథ్యత్వభావము సుదృఢముగా ఉన్నప్పటికి జ్ఞానులైనవారు తమ ప్రారబ్దకర్మ క్షయం కావాలనే తలంపుతో సంసారిక దుఃఖాల్ని
అనుభవిస్తూ ,
కర్మానుసారము సంసార ప్రవృత్తులౌతూవుంటారు.
జ్ఞానులైనవారు చేయరాని పనులయందు ప్రవృత్తులు కావచ్చునా ? అంటే -
తమ ప్రారబ్ద కర్మానుసారము సంచరించే తత్త్వజ్ఞానుల విషయములో అనాచారాన్ని గూర్చి శంకించవద్దు.వారి ప్రారబ్ధం ఆ విధంగా ఉన్నప్పుడు దానిని -
ఆ ప్రారబ్ధకర్మను ఎవరు అడ్డగించగలుగుతారు ?
కాబట్టి వారు ఆ విధంగా ఆచరించక తప్పదు.
సమస్త ప్రాణులును తమ తమ ప్రకృతికి అనుకూలముగా నడుచుచున్నవి.జ్ఞానవంతుడు కూడా తన ప్రకృతి స్వభావమునకు తగినట్టుగనే ప్రవర్తించుచున్నాడు.నిగ్రహముయేమి పనిచేయగలదు.
కాన జ్ఞానికి గూడ ప్రారబ్దము యొక్క భోగము గలదనియే తెలియుచున్నది.
అయితే భగవద్గీత యందు సర్వకర్మలు జ్ఞానాగ్నిచే నశించునని చెప్పి యుండుట యొక్క అభిప్రాయము యేమనగా ,
జ్ఞాని యొక్క దృష్టికి ఆత్మయందు సర్వకర్మల సంబంధము నిషేదించుట చేతను,మరియు సర్వకర్మ నిషేధావధి భూతమైయుండు ఈ సాక్షి రూపాత్మయే జ్ఞాని యొక్క స్వరూపమై యున్నదనెడు అభిప్రాయంబు వలన ప్రారబ్దము నిషేధింపబడియున్నది.కానీ ,
ప్రారబ్దము వలన జ్ఞాని శరీరమందు భోగము గలుగదని చెప్పుటగాదు.కాన జ్ఞానికి ప్రారబ్ధము యొక్క భోగము గలదు.
శ్రీ శంకర భగవత్పాదుల వారు గూడ ఇట్లే చెప్పియున్నారు.
"స్వకర్మ పాశవశగః ప్రాజ్ఞోఽ
న్యో వా జనో ధ్రువం
( వే-డిం-89) ౼
జ్ఞానియు,అజ్ఞానియు ప్రారబ్ధమునకు లోబడే యున్నారు.
ప్రారబ్ధమనేది జ్ఞానులకు, అజ్ఞానులకు ఒకటే అయితే ,
ఇంకా ఆ ఇద్దరిలోనూ భేదమేముంది. అంటే -
కానీ అసలు విషయము ఏమనగా, అవ్యవహారమై గ్రహింప సాధ్యముగానిదై, ఇట్టిదని చింతింప వీలులేనిదై యున్న ఏ ఆత్మ తత్త్వమైతే గలదో అదియేనేనని దృఢత్వమును బొందిన మహాత్మునికి కర్మనంటగట్టుట అవివేకమైయున్నది.
జ్ఞానుల విషయంలోను, అజ్ఞానుల విషయములోనూ ప్రారబ్ధము సమానమైననూ
జ్ఞానులందు దృఢమైన తత్త్వజ్ఞానం వల్ల కలిగిన ధైర్యంతో, వివేకముతో, మిథ్యాత్వ జ్ఞానము వలన వారు దుఃఖితులు కారు.
కానీ,అజ్ఞానికి అటువంటి వివేకము, ధైర్యము ఉండనందున మిథ్య వలన దుఃఖితుడౌతూ ఉంటాడు.
ఇదే ఇద్దరిలోనూ భేదం . అందుకు దృష్టాంతం...
సమముగా అలసిపోయిన బాటసారులలో ఒకడు గమ్యము సమీపముననే ఉన్నదని తెలిసి త్వరితముగ నడచును.అది తెలియని రెండవ బాటసారి దైన్యముతో మార్గముననే ఆలసించును.
ఇక్కడ మార్గాన నడిచివెళ్ళే పథికులు ఇద్దరికి కలిగే శ్రమ ఒకటే !
అయినా ఒకడు తన గమ్యస్థానమునకు సమీపమునకు వచ్చామనే విషయం తెలిసినందున ధైర్యంతో ముందుకు సాగిపోతాడు.
రెండవవాడు తాను వెళ్ళవలసిన చోటు,గమ్యం ఎంతదూరంలో ఉన్నది తెలియక అధైర్యంతో చతికిలపడతాడు.
"ఇదే భేదం" !
No comments:
Post a Comment