Wednesday, March 18, 2026

🦚ఉగాది-జ్ఞాన పునాది🦜

 ☘️🦚☀️🦚☘️🦜☀️🦚☘️

*🦚ఉగాది-జ్ఞాన పునాది🦜*

*ఎవరికి ఏది ఉందో, ఏది లేదో నాకు తెలియదు. ఎవరికి ఏది అనుకూలమో, ఏది ప్రతి కూలమో నేను చెప్పలేను. కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఎవరికి ఏది ఉన్నా, ఎవరికి ఏది లేకపోయినా అందరికీ అన్నీ అనుకూలంగా ఉండవు అని మాత్రం నిస్సందేహంగా చెప్పగలను. ఒకవేళ నేడు ఉన్నా, రేపు ఉంటాయని చెప్పలేము. పరిస్థితులు మారుతూ ఉంటాయి. పరిస్థితులు మారుతూ ఉంటే, వాటితోపాటు మన మనస్సు కూడా మారటం ప్రారంభిస్తే, ఇక సుఖమనేది జీవితంలో కుందేటి కొమ్మే అవుతుంది*.

నీకు ఏవైనా ఉండొచ్చు. అవి "నీవి”గా లేవు. నీ వద్ద ఉన్నాయి. కాని నీవు కావు. కొంతకాలం నీవద్ద ఉంటాయి. కొంతకాలం తరువాత నీవద్ద ఉండవు. నిన్ను వదలిపోయేవి నీవెలా అవుతాయి? పోనీ, అవి నావి కాకపోవచ్చు. నా వద్ద ఉన్నంతవరకే నేను వాటికి యజమానినే కదా? ఏమో! విచారః కర్తవ్యః. నేను యజమానిని అని చెప్పటానికి నేను ఏమి సృష్టించాను? ఏదీ సృష్టించని నేను యజమానిని ఎలా అవుతాను? ఉన్నవన్నీ ఉమాపతివే. నా అదృష్టవశాత్తు నా వద్ద ఉన్నాయి. ఈశ్వర ప్రసాదంగా నాకు లభించాయి.

ఏవి ఉండినా నష్టం లేదు. మనం వాటికి సంబంధించిన వారుగా ఉంటే మాత్రం లాభం లేదు.

అవి నావి అనుకుంటే వాటికి సంబంధించి ఉంటాం. అవి బాగుంటే మనం బాగుంటాం. అవి చెడిపోతే మన మనస్సు పాడైపోతుంది. కోరుకున్నవి రావచ్చు. వచ్చినవి అలాగే ఉంటా యని చెప్పలేం. వచ్చేవి ఏవైనా పోయేందుకే వస్తాయి. ఒకదాని కారణంగా సుఖం వస్తే, ఆ సుఖానికి కారణమైనది దూరం కాగానే సుఖం కూడా దూరమవుతుంది. ( నిమిత్తాపాయే నైమిత్తికాపాయః ) దూరమయ్యే సుఖం ఏదైనా భారమే. ఈ ప్రపంచంలో సుఖాల్ని ఏరుకొనేది మనమే. పారేసుకొనేది కూడా మనమే. స్నేహం ఉండొచ్చు. మోహం ఉండకూడదు. ఇదే 'అభిస్నేహ'మని గీతాచార్యుని మాట. మమకారం తియ్యని విషం లాంటిది. అది నిలువునా ప్రాణాల్ని తోడేస్తుంది. మంచిచెడులను _చూడదు. ద్రోణుడు మంచివాడు. ధృతరాష్ట్రుడు కాడు. కాని పుత్రవ్యామోహంతో ఇద్దరూ పాడైపోయారు.

జీవితంలో ఏం జరుగుతుందో, ఏం జరగదో అనే విషయంలో సందేహం ఉండవచ్చు. చావు విషయంలో సందేహం లేదు.

ఉన్నకాలం విలువైంది. వినియోగించుకోవటమే జ్ఞానం. ఇదే కావాలి జీవితంలో క్రొత్తదనం. వస్తోంది *ఉగాది*.

అది జ్ఞానానికి ఆది కావాలి. తపస్సుకు ఆది కావాలి. అధ్యయనానికి ఆది కావాలి. అవగాహ నకు ఆది కావాలి. అనాదిగా వస్తున్న అజ్ఞానాన్ని అంతం చేసేందుకు నాంది కావాలి. జ్ఞానసౌధాన్ని నిర్మించేందుకు పునాది కావాలి. 'నాది'ని ఓడించే నాది కావాలి.

న్యాయవాది కావాలి. ఇది జీవితం. తియ్యని సుఖాలు ఉంటాయి. చేదు బాధలు ఉంటాయి. మ్రింగలేని వనరులు ఉంటాయి. ముప్పు తెచ్చే ఉప్పులు ఉంటాయి. కారాలు నూరి ప్రయోజనం లేదు. అందనివి పులుపు అంటే సౌందర్యముండదు.

సిద్ధ్య సిద్ధోస్సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే

ఏది సిద్ధించినా, ఏది సిద్ధించకపోయినా సముడవై యుందుడ. సమత్వమే యోగం అని అంబ పలుకు. జగదంబ పిలుపు.

*ఉగాది పచ్చడి తిందాం. పంచాంగం విందాం. గీతను ఇక వింటూ ఉంటాం. ఉంటూ వింటాం. విన్నది కంటాం. కన్నదానిలో కరిగిపోదాం*.

*రేపటి రోజు వచ్చే శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తో*
🌴🌺🌴🌺🌴🌺🌴🌺🌴

No comments:

Post a Comment