Monday, March 16, 2026

 *శ్రీ ఆదిశంకరా చార్యులవారి 'వివేకచూడామణి'* 

*కర్మలు చిత్తాన్ని శుద్ధపరచటానికేగాని మోక్షప్రాప్తికి కాదు. మోక్షప్రాప్తి విచారణ వల్లనే గాని - కోటికర్మలు చేసినా కలగదు.* 
*సర్వకర్మలనూ వదలివేయమని క్రిందటి శ్లోకంలో చెప్పారు.* ఆ *మాట వినగానే చాలామందిలో సందేహం కలుగుతుంది.*


 *కర్మలను వదలటం తెలివి తక్కువ పని అని కొందరు భావించి వాటినే పట్టుక కూర్చుంటారు. వదలమన్నారు గదా అని వెంటనే పూర్తిగా వదలేసి కొందరు సోమరిగా కూర్చుంటారు. ఈ రెండూ తప్పే*.


 *మరి ఏం చేయాలో - ఎలా చేయాలో ఎందుకు చేయాలో - ఎప్పుడు వదలాలో ఈ శ్లోకంలో సూచన ఇస్తున్నారు.* 
*నిత్యనైమిత్తిక కర్మలను ఎలాగూ చేయాలి. వాటి గురించిన ప్రసక్తి లేదు. శాస్త్ర విరుద్ధమైన కర్మలను అసలు ఎప్పుడూ చేయకూడదు. వాటి ప్రసక్తీ లేదు. ఇక *శాస్త్ర విహిత కర్మలు - సత్కర్మలున్నాయి. వాటి సంగతే కావాల్సింది. అవేమిటి?* 

(i) భగవంతుని స్తుతించే స్త్రోత్ర పాఠాలు, సహస్రనామాలు, పారాయణలు; 

(ii) ఇష్టదేవతా పూజలు, ఆరాధనలు, వ్రతాలు, సంధ్యావందనాలు; 

(iii) యజ్ఞయాగాదులు 

(iv) తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు; 

(v) దీనులకు సహాయపడే దానధర్మాలు; 

(vi) తోటివారి సాయానికి చేసే సేవా కార్యక్రమాలు ------ ;

మొదలైనవన్నీ శాస్త్ర విహితకర్మలే. శాస్త్రం మానవులకు చేయమని చెప్పిన కర్మలే. 
వీటన్నింటి వల్ల పుణ్యం వస్తుంది. దానివల్ల మనకు మంచి జరుగుతుంది. సుఖంగా జీవిస్తాం; చనిపోయిన తర్వాత స్వర్గభోగాలు అనుభవిస్తాం. మళ్ళీ జన్మించేటప్పుడు ఉత్తమ జన్మలు కలుగుతాయి. కనుక వీటిని విధిగా చేయాలని శాస్త్రం నిర్దేశించి చెబుతోంది. మరి *ఇట్టి సత్కార్యాలను విడిచిపెట్టమని వేదాంతం చెబుతున్నది. ఏమిటి ఈ తిరకాసు?* - 
మానవుడి యొక్క అసలు లక్ష్యం మోక్షప్రాప్తేగాని సుఖభోగాలు అనుభవించటం కాదు. 


మరి *మోక్షప్రాప్తి అనేది విచారణ వల్ల - ఆత్మవిచారణ వల్ల - తన నిజస్వరూపమైన బ్రహ్మమును గురించి విచారణ చేసి ఆ బ్రహ్మములో నిష్ఠ ఏర్పడితే కలిగేదే గాని కోటికర్మలు చేసినా - ఎంతటి సత్కర్మలు - పుణ్యకర్మలు చేసినా కలిగేది కాదు. అందుకే కర్మలన్నింటిని వదలి ఆత్మవిచారణ చేసి మోక్షాన్ని పొందమని చెప్పేది*. 

ఐతే ఈ చెప్పటం ఎలాంటిది? 
ఎలిమెంటరీ స్కూల్లో చదివే విద్యార్థికి కూడికలు తీసివేతలు చేయాల్సి వచ్చినప్పుడు టీచరు వ్రేళ్ళు లెక్కించే పధ్ధతి చెబుతారు. కాలేజీలో Mathematics బోధించేటప్పుడు అలా వేళ్ళు లెక్కబెట్టుకోమని చెప్పరు. ఒకవేళ అలా లెక్కబెట్టే వారుంటే నవ్వుతారు. అవన్నీ వదిలెయ్యమని చెబుతారు. 


*అలాగే కర్మలనేవి ప్రారంభదశలో చేస్తారు. మొదట కోరికలతో, సుఖభోగాలు అనుభవించాలనో, స్వర్గ లోకాలకు చేరాలనో, ముందు ముందు మంచి జన్మలు పొందాలనో చేస్తారు. అలా చేసినప్పుడు కొంతకాలం సంతోషం - సుఖం కలుగవచ్చు. అప్పుడప్పుడూ అనవసరంగా చేశామనిపించవచ్చు*. 


కోరిక నెరవేరితే సంతోషం. నెరవేరకపోతే దుఃఖం, అలజడి. దీనితో పనిలో సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. అయితే ఇవే కర్మలను చిత్తాన్ని శుద్ధిపరచుకొనుటకు చేయాలని శాస్త్రాలు బోధిస్తున్నాయి. చిత్తశుద్ధి ఎలా కలుగుతుంది? కర్మలను నిష్కామంగా - ఎట్టి కోరికలు లేకుండా, కర్తవ్యతా బుద్ధితో చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. 
ఆధ్యాత్మిక కుటుంబం 4*                                                 

No comments:

Post a Comment