Friday, March 27, 2026

 మొన్న పాతకాలపు పెళ్లి ముచ్చట్లు చెప్పుకున్నాం కదా, అందులో పేకాట లేదని కొంతమంది వాపోయారు. వారందరికోసం ఈ ‘కార్డ్’యాలజీ కబుర్లు

“పెదనాన్నెక్కడున్నాడ్రా?” 

అదెంత పిచ్చి ప్రశ్నో నాన్నగారికి తెలుసు. అంత జోరుగా ‘కార్డ్’యాలజీ సెషన్సవుతోంటే ఇంకెక్కడుంటారు? అసలే పెద్ద స్టేకు. 

అత్తయ్య కొడుకులు...
రెండోవరస చుట్టరికం పిన్నికొడుకులు...
వాళ్ళ బంధువులు...
‘అసలు నాకేమవుతా’రని అడిగితే వరస చెప్పడానికే అరగంట పట్టే చుట్టరికం వున్నవాళ్ళు ...

అంతమంది పేకాసురులు చేరితే అది అచ్చం మహా యజ్ఞవాటికలా కనబడేది.

మధ్యమధ్యలో గరగరలాడే పట్టుచీరతోను, కొరకొరలాడే పట్టుదలతోను దేవకన్యల్లాంటి భార్యలు ఏ ఇంద్రుడూ పంపకుండానే యజ్ఞవాటికకొచ్చి భగ్నంచెయ్యాలని చూసేవారు. కానీ అరకురాణి కళ్ళముందు కనబడుతోంటే అసలురాణిని కన్నెత్తైనా చూసేవారు కాదు. 

మరిహ వాళ్ళని కదపడం కష్టమని తెలిసి కుదపడమే సరైన నిర్ణయమని అయిదేళ్ళ కొడుకుని పంపేవారు. 

వాడు చమ్కీలతో మెరిసే కుర్తాపైజమాలేసుకుని రాకుమారుడిలా ఎదుట నిలబడి “అమ్మ లమ్మంతుంది!” అంటూ ముక్కలట్టుకున్న చేతిని మూర్ఖంగా లాగేస్తుండేవాడు. 

అయినా అటువైపు చూడనైనా చూడకుండానే “వత్తున్నాన్నాన్నా! ఇదొక్కాటా ఆడేసీ! నువ్వెళ్ళి పందిట్లో ఆడుకో ఫో!” అని తోలేసేవారు. 

ఆ క్షణాన వాడికంటే ఇస్పేటు జాకీలో రాకుమారుడే అందంగా కనబడేవాడు. ఎందుకంటే ఆ ఆటలో వాడే జోకరు!😜

చిన్నప్పుడు పెళ్లిళ్లకెళితే మండపం ఎక్కడేస్తే బావుంటుందో అని ఒకరోజు, పేకాటకి ఎక్కడైతే అనువుగా వుంటుందో అని రెండ్రోజులూ చర్చలు జరిగేవి. పెళ్ళిదేముందీ, కూచునేవాళ్ళు అరగంటకోసారి లేస్తూవుంటారు. కొత్తవాళ్ళొచ్చి కూచుంటూ వుంటారు. 

పేకలో అలాక్కాదే! కూచుంటే గమ్మున లేవరు. గమ్ము రాసుకున్నట్టు అతుక్కుపోతారు. అంచేత పదిపదిహేనుమంది ఏ ఇబ్బందీ పడకుండా అకుంఠిత దీక్షతో, అత్యంత పోరాట పటిమతో ఆడుకోడానికి అనువుగా ఎక్కడ బావుంటుందో అలాంటి హాళ్ళూ, అరుగులూ ఎన్నుకునేవారు, చిన్నచిన్న నడవాలైతే చికాకని!

ఇహ ఆటలో విద్వన్మణులు, వైదుష్యాన్ని వైభవంగా ప్రదర్శించేవాళ్ళని చూస్తే ముక్కున అన్నివేళ్ళూ వేసుకోవలసిందే!

ఎదురుగా కూచున్న తోడల్లుడికి పాపం ఎంత అప్పుందో, ఎన్నికష్టాల్లో వున్నాడో తెలీదుగానీ అతని దగ్గిర డైమను ఆరుందని మాత్రం తెలిసిపోతుంది ఇవతలాడికి! అదొస్తే ఇతగాడికి ఆటైపోతుంది. అదెళ్ళి అక్కడ ఇరుక్కుపోయింది. 

“సెట్టవ్వలేదు శంకరానికి! కేవలం నన్ను నొక్కిపెట్టడానికే ముక్కుంచేశాడు!” అంటూ ఏమీ అర్ధంకాని కోడ్ భాషలో నవ్వేవాడు. కానీ అది ఏడిసినట్టే వుండేది!😜

“వడ్డనలవుతున్నాయి. మీరు తినకండా మా అమ్మ తిన్నంటోంది. ఆవిడకి నీరసంతో కళ్ళు తిరుగుతున్నాయి. ఆపై మీయిష్టం!” అంటూ పెళ్ళాం పిలుస్తుంది భోజనానికి. అదో వింత ఆహ్వానం!

ఇంత ప్రమాదకరమైన సూచికని తుఫాన్లప్పుడు కృష్ణపట్నం రేవులో కూడా ఎగరెయ్యరేమో? అయినా చలించేవాడు కాడు ఆ భర్తాగ్రేసరుడు! 

అత్తగారు సొమ్మసిల్లి పడిపోతుందేమోనన్న భయంకన్నా తనక్కావలసిన ముక్క పక్కవాడికి పడిపోతుందేమోనన్న ఆత్రమే ఎక్కువుండేది! 

ఒహవేళ వచ్చి కూచున్నా ఏదో అంతరిక్ష పరిశోధనాకేంద్రం నుంచి ప్రయోగం మధ్యలో లాక్కొచ్చిన శాస్త్రవేత్తల్లా నిర్లిప్తంగా, నిరాసక్తంగా, అఘోరాల్లా ఘోరమైన నిశ్శబ్దాన్ని పాటించేవారు!

వాళ్ళు పప్పూ,కూరలూ కలుపుతున్నా ముక్కలు కలుపుతున్నట్టే వుండేది. 

కరివేపాకునీ, మిరపకాయల్నీ దేనికీ సెట్టవ్వని ముక్క కొడుతున్నట్టు ఈడ్చి కొట్టేవారు. 

చివరాఖర్న ‘షో!’ అన్నట్టు ఫీలింగిచ్చి లేచిపోయేవారు. 

“మేం ఆడవాళ్ళందరం కూచుంటున్నాం. కాస్త వడ్డన చూస్తారా?” అని అడుగుదామనుకుని నోటిచివరే ఆ మాటని సెన్సారపక్షం చేసేసేవారు భార్యలు!

లేకపోతే అతగాడు చేసే అల్లరి సంసారపక్షంగా వుండదేమోనన్న భయం! 

“ఆమాత్రం అన్నం తినడానికొచ్చారు. అదే పదివేలొదినా! మా మావగారికైతే ఆటాడుతోంటే పక్కన కూర్చుని చంటిపిల్లాడికి తినిపించినట్టు నాలుగుముద్దలు తినిపించేసి మూతి తుడిచి లేచ్చక్కా వచ్చేది మా అత్తగారు! ఈయన చాలా నయం!” అన్న తృప్తితో భోంచెయ్యకుండానే కడుపు నిండిపోయేది ఆ ఇల్లాళ్ళకి!

సాయంత్రం టిఫిన్లకని ఎంత పిలిచినా రారాయె! ఇక వీళ్ళతో లాభంలేదని వాళ్ళున్నచోటికే కుట్టుడాకుల్లో కాస్తంత కారబ్బూందీ, కవరుండా(చిన్న లడ్డూ) పెట్టి తినమని ఇస్తే ఎంతకీ కదిలేవి కావు పదార్థాలు. 

కాసేపటికి కండచీమొకటి ఓ నాలుగు కూలీచీమల్ని మాటాడుకుని ఒక్కో బూందీ గింజనీ హాలు చివరకి చేరేసేస్తూ వుండేది. ఆటకీ ఆటకీ మధ్యలో చెయ్యటుపెట్టి మిగిలిన నాలుగ్గింజలూ నోట్లో వేసుకుని అంతా తనే తినుంటాననుకునేవారు! అదీ తన్మయత్వమంటే! సర్వం జగన్నాథమనుకోవడం!!

ఇహ పందిట్లోంచి గట్టిమేళం వినబడితే అక్కడున్న పదిమందిలో ఒకట్రెండు సున్నిత హృదయాలున్నవాళ్ళు..... అంటే మనోజ్ఞమైన భావాల పచ్చి మనసులో ఇంకా మిగిలివున్నవాళ్ళు స్పందించి... “జీలకర్రాబెల్లవాఁ? మంగళసూత్రవాఁ?” అనేవారు. 

మిగతావాళ్ళు “ఏదైతే మనకేంటి భాస్కరం? ముక్క రాక ఛస్తోంటే!” అంటూ అతగాడి ఉత్సాహం మీద నీళ్ళు చల్లేసేవారు. 

ఆఖరికి ఎవరో పెద్దముండావాడు వచ్చి “ఏవఁర్రా! నామాటంటే వీసమెత్తు గౌరవం కూడా లేదట్రా మీకు? అంత డబ్బుతగలేసుకుని ఇంతదూరం  రైళ్ళెక్కొచ్చారు. కనీసం ముహూర్తం వేళకయినా ఆ ముష్టిముక్కలు కిందపడెయ్యలేరా?” అంటూ కాస్త కళ్ళెర్రజేస్తే ఒకచేత్తో ముక్కలూ, ఒకచేత్తో అక్షింతలూ పట్టుకునొచ్చేవారు మండపంలోకి! 

“వీళ్ళ ఆటకాదుగానీ, తొందర్లో వధూవరుల మీదకి ఆ పాపిష్టి ముక్కలెక్కడ విసిరేస్తారోనని నాకొకటే భయం! ఎంతప్రదిష్ట! వెనకాలెలా దాస్తున్నారో చూడొదినా ముక్కలూ?” అంటూ సిగ్గుతో కుమిలిపోతూండేవారు జలంధరుడు, హిరణ్యాక్షుడూ వాళ్ళ భార్యలు!

పెళ్ళిలో అందరూ ఎంచక్కా మెరిసిపోయే బట్టలేసుకుని, మురిసిపోతూ, అరగంటకోసారి అద్దం దగ్గిరకెళుతూవుంటే వీళ్ళుమాత్రం లుంగీలు, అంగీలు కట్టుక్కూచునుంటారు.

గెడ్డాలు మాసినా పట్టించుకోరుగానీ ముక్కలు మాసిపోతే గుర్తుపట్టేస్తారని రెండుమూడాటలకి ఓ కొత్తసెట్టు తీస్తూంటారు. ఒహవేళ సెట్లు లేకపోతే శరభయ్య కొట్టుకెళ్ళి తేడానికి నాలాంటి అర్భకంగాణ్ణొకణ్ణి పక్కనే పెట్టుకుంటారు. వాణ్ణి మధ్యలో కాస్త పొగుడుతూ వుంటారు.

“ఏవైఁనా లక్ష్మి కొడుకులందరూ మెరికల్లాంటివాళ్ళు! ఎంత బుద్ధిమంతులో! మావాణ్ణొకసారి నిన్ను కలవమని చెబుతాను. ఆ లెక్కలవీ రావు వాడికి. కాస్త మెళుకువలు చెబుదూ!” అనగానే మనకి గర్వం వొచ్చేస్తుంది. ఆ క్షణంలో శరభయ్య కొట్టేవిఁటీ, సంజీవినీ పర్వతానికి వెళ్ళమన్నా వెళతాం!

పాట పాడాలంటే హృదయం వూగాలి, భావం పొంగాలి, రాళ్ళకు నోళ్లొచ్చి కథలే చెప్పాలంటూ ఆత్రేయన్నాడు. కానీ పేక ఆడాలంటే ఇవేమీ అఖ్ఖర్లా! నీకు ఆడ్డం వస్తేచాలు. 

నువ్వెంతడిగినా అప్పుగా ఇచ్చే బలిచక్రవర్తులూ, నీకోసం తొడకాకపోయినా మంచి ముక్కని జోకరుగా కోసిచ్చే శిబిచక్రవర్తులూ బోల్డుమందుంటారు. అక్కడున్నంత కోపరేషను ఆపరేషన్ థియేటర్లో డాక్టర్ల మధ్యకూడా వుండదు. ఆటని ముందుకు తీసుకెళ్ళడంలో ప్రతివాడూ తనవంతు కృషిచేస్తాడు. 

“బంగారుబాతు నీ బావగారుండగా నీకేంటోయ్! ఆడు ఫర్లేదు. ఆయన పెడతాళ్లే! తరవాత మీవూరెళ్లాక మనియార్డరు చేదువుగాని!” అని భుజంతట్టి, చెయ్యిపట్టి, ముక్కలు కలిపించే ఆత్మీయులు విరివిగా దొరికే విశాలవిశ్వమది! ఆ ఆప్యాయతకి నీకు కళ్ళమ్మట నీళ్ళొచ్చేస్తాయి. 

కానీ నీకొడుక్కి కాలేజీ ఫీజుకని డబ్బడిగావనుకో, పేకాడేస్తారు నీ జీవితంతో! అదీతేడా!

అయ్యా! అదీ.... పెళ్ళికీ, పేకాటకీ మధ్యవున్న అన్యోన్య దాంపత్యం! కేవలం పేకాడ్డం కోసం ఢిల్లీనుంచి విమానమెక్కి వచ్చేసిన వాళ్ళున్నారు మా బంధువుల్లో! అదీ అభిమానమంటే! 

ఈ పేకాటలో సూక్ష్మం ఏమిటంటే.... వచ్చినవాడు పోయేదాకా ఆడతాడు. పోయినవాడు వచ్చేదాకా ఆడతాడు. అర్ధమైందనుకుంటాను??😜

ఉంటాను!

 ......జగదీశ్ కొచ్చెర్లకోట

No comments:

Post a Comment