కృష్ణుడు తన గురువు కుమారుడిని మృత్యువు నుండి ఎలా తిరిగి తీసుకురాగలిగాడు? అలాగే, భక్తి మరియు కర్తవ్యం గురించి ఈ కథ ఎలాంటి పాఠాలను బోధిస్తుంది?
ఇక్కడ కేవలం కర్తవ్యం మాత్రమే ఉంది. జ్ఞానాన్ని అందించిన గురువుకు గురుదక్షిణ సమర్పించడమే ఆ కర్తవ్యం.
విద్య నేర్పిన గురువుకు ఇచ్చే దక్షిణ/ప్రతిఫలం నేర్చుకున్న విద్యకు సరిపోయేటట్లు ఉండాలి. మన స్థోమతకు తగ్గట్లు అయినా ఉండాలి. గురువు ధనవంతుడే కదా ఇవ్వకపోయినా పరవాలేదు అనుకోకూడదు.
కృష్ణబలరాములు ఉపనయనం అవగానే విద్యాభ్యాసానికి సాందీపముని వద్దకు వెళ్ళారు.
సాందీపముని అవంతీపురవాసి. కృష్ణబలరాములు అక్కడకు వెళ్ళారు చదువుకునేందుకు. 64 శాస్త్రవిద్యలు, 64 వృత్తి విద్యలు తెలియచేసారు మన ఋషులు. 64 రోజులలో నేర్చుకున్నారు కృష్ణబలరాములు అన్ని విద్యలనీ.
గురుదక్షిణగా ఏమి కావాలో ఆజ్ఞాపించమన్నారు కృష్ణబలరాములు గురువుగారిని. సాందీపముని నేరుగా అడగలేదు. వీరు మామూలు మనుషులు కాదు అని తెలుసు కనుక చనిపోయిన తన పుత్రుడు మళ్ళీ బ్రతుకుతే బావుండును అని మనస్సులో అనుకున్నారు ముని. కృష్ణుడు ఆయన మనస్సు గ్రహించారు.
సాందీపముని కుమారుడు చనిపోయిన సముద్రం దగ్గరకు వెళ్ళి సముద్రుడిని పిలిచారు. " నాకేమీ సంబంధంలేదు, నా గర్భంలో పాంచజన్యుడు అనే రాక్షసుడు ఉన్నాడు, వాడొక శంఖం, వాడు ముని పుత్రుడిని చంపేసాడు " అన్నారు సముద్రుడు. లోపలికి వెళ్ళి రాక్షసుడిని చంపి శంఖంతో బయటకు వచ్చారు కృష్ణుడు. అదే పాంచజన్యం. దానితో యమపురికి వెళ్ళి, శంఖం పూరించారు.
యముడి లోకం సంయమనీపురం, నరకం కాదు. న్యాయస్థానం , కారాగారం లాగ యమపురి న్యాయస్థానం, నరకం కారాగారం.
కాలం తీరిన తరువాత జీవుడిని పంచభూతాలలో కలిపేస్తారు యముడు, కాలుడు. సాందీపుని కుమారుడిని మళ్ళీ పంచభూతాలనుంచి గ్రహించి కృష్ణుడికి అప్పగించారు యముడు.
గురుదక్షిణ యథాశక్తి సమర్పించుకోవాలి శిష్యులు. గురుదక్షిణతో గురువు సంతృప్తి చెందాలి. కృష్ణుడు గురుదక్షిణను యథాశక్తి ఇచ్చారు తన గురువుకు. ఆయన శక్తి అంతటిది. కృష్ణుడి గురుదక్షిణతో గురువుకు అమితానందం కలిగింది.
కృష్ణుడిది అనుగ్రహావతారం. ఎందరిని అనుగ్రహించి సంతోషపెట్టారో పరమాత్మ.
ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
శుభమస్తు
No comments:
Post a Comment