Tuesday, August 11, 2026

 కథా శీర్షిక: 
*ది గుడ్ బాయ్ సిండ్రోమ్*

 ఇది నా స్వీయ రచన - (భవాని కుమారి బెల్లంకొండ) 

ఉదయం ఏడు గంటలయ్యింది. సూర్యోదయం  కాకముందే లేచిన వర్షిణి, స్నానం చేసి తయారై, టీ పెట్టుకుని వరండాలో కూర్చుని ప్రశాంతంగా టీని ఎంజాయ్ చేస్తున్నది. వరండా దూలాలకి వేలాడదీసిన జొన్న, వరికంకులపై వ్రాలిన పిచ్చుకలు గోల చేస్తున్నవి.

ఎనిమిది నెలల బుజ్జిగాడు నానమ్మ రుక్మిణి పక్కన వున్న పెద్ద పాతకాలపు ఉయ్యాలలో  పడుకుని ఆదమరిచి నిద్రపోతున్నాడు. రుక్మిణి లేచి వచ్చింది. కోడలు అంత ప్రొద్దున్నే ఎక్కడికో వెళ్లే యోచనలో వున్నట్టుగా తయారై కూర్చుని ఉండేసరికి, ఎక్కడికే  అమ్మాయి, ఇంత పొద్దున్నే తయారయ్యావు అంటూ అడిగింది.. 

వర్షిణి నవ్వి, చెరువు మట్టి తోలటానికి వెళుతున్నా అత్తా అన్నది. 
ఆడపిల్లవి నువ్వు మట్టి తోలటానికి వెళ్లటమేమిటి ? పృధ్వికి ఫోన్ చేసావా ?ఎప్పుడొస్తాడట ? కనుకున్నావా ?
వర్షిణి నవ్వి, నీ కొడుకు ఏ రాజ్యాలు గెలుచుకోవటానికి వెళ్ళాడో అత్తా, ఇంకా రెండు, మూడు   రోజులు పడుతుంది అన్నారు అన్నది వర్షిణి నవ్వుతూ.

నవ్వెందుకు వస్తోంది నీకు ? కోపంగా అడిగింది రుక్మిణి. 
అగ్రికల్చర్ exibition కి వెళ్ళొస్తానని వెళ్లారు, ఎవరో క్లోజ్ ఫ్రెండ్ అట, అతనికి హార్ట్ అటాక్ వచ్చిందట, వాళ్ళ వాళ్ళు వచ్చేసరికి మూడు stunts వెంటనే చెయ్యాలన్నారట డాక్టర్స్, ఈయననే. అత్త మొహంలో రంగులు మారటం చూసి ఆగిపోయింది.

అయితే వీడు వాడికి సేవలు చేస్తూ కూర్చున్నాడన్న మాట. డబ్బు కూడా పెట్టేవుంటాడు వీడిక  మారడు, అన్నది రుక్మిణి నిసృహగా.

వర్షిణి నవ్వి, అత్తా, ఎక్కువ ఆలోచించకు, పృథ్వి రాక కోసం ఎదురు చూపులు చూసుకుంటూ కూర్చుంటే నాణ్యమైన మట్టి అంతా ఎగరేసుకుపోతారు ఇప్పటికే చాలా  చెరువు మట్టి పొలాల్లోకి తోలుకెళుతున్నారు,  అన్నది.ట్రాక్టర్ 
నడిపేటప్పుడు సౌకర్యంగా ఉంటుందని  జీన్స్, లాంగ్ కుర్తా వేసుకుంది. 

మహీంద్రా (27  HP) ట్రాక్టర్ అది. దాదాపు ఆరు లక్షలయ్యింది. పొలం దున్నటానికి,, మట్టి పశువుల ఎరువు పొలానికి తోలుకు పోవటానికి అనువుగా ఉంటుంది. పొద్దున్నే గోపయ్యని చెరువు దగ్గిర ఉండమని చెప్పింది.. కాడెడ్లు వున్నాయి,

వాటిని పాలేరు గోపయ్య కానీ, పృధ్వి కానీ అవసరమైనప్పుడు ఉపయోగిస్తుంటారు. అప్పుడప్పుడు వర్షిణి కూడా సరదాగా పొలం  దున్నుతుంది నాగలితో. 

పొలం నాగలితో దున్నటం, ట్రాక్టర్ నడపటం అన్నీ పృధ్వి నేర్పిస్తే నేర్చుకుంది వర్షిణి.

ఇలాంటి బండ పనులు పిల్లతో  చేయిస్తున్నావెందుకురా" అంటూ కోప్పడింది రుక్మిణి.

పృధ్వి నవ్వి,  విమానాలు నడుపుతున్నారు అమ్మాయిలూ, ఆర్మీలో పనిచేస్తున్నారు, దీనికే బాధ పడుతున్నావెందుకు ? రైతుని చేసుకున్నప్పుడు ఎండనకా, వాననకాకా కష్ట పడాల్సిందే నవ్వుతూ తల్లి మాట ఎగరగొట్టేవాడు.

అయినా నేనేమి చేస్తానులే, పొద్దస్తమానం నీ తోక పట్టుకుని తిరుగుతుంది అనేది రుక్మిణి. మనసులో మాత్రం కొడుక్కి అన్నిటిలో తోడూ, నీదైన కోడలంటేచాలా ప్రేమ రుక్మిణికి. 

*****

తొలకరి మొదలయ్యే   తరుణంలో పృథ్వి సిటీ కెళ్ళి కూర్చున్నాడు. వర్షిణికి కూడా తన గతే పడుతుందా! చివరికి  అన్న సందేహం కలుగుతుంది రుక్మిణికి అప్పుడప్పుడు. 

పదిహేనుఎకరాల భూమి పసుపు, కుంకుమ క్రింద ఇచ్చి నారాయణ రావుకిచ్చి పెళ్లి  చేసాడు రుక్మిణి తండ్రి. తరచూ సిటీకి పనిమీద వెళ్తున్నాని చెప్పేవాడు, పృధ్వికి పదోయేట అతని సిటీ ఇంకో ఆవిడతో సంబంధం ఉందని తెలిసి   చాలా దుఃఖపడింది, అంతా సర్దుకు పొమ్మన్నారు కానీ అలా లొంగి బ్రతకడం తనకు అసహ్యమనిపించింది, ఇల్లూ, భూమి తన పేరునే వున్నాయి, కాబట్టి నారాయణరావు ఒక అయిదు లక్షల కేష్ తప్ప ఏమీ దక్కనీయలేదు తను, అప్పటినుండీ పృధ్విని ప్రేమగా పెంచుకుంది. 

పృధ్విమలో ఒకే ఒక్క బలహీనత, ఆ ఒక్క లోపం తప్పితే, కొడుకు ఒక బంగారుకొండ ఆమె దృష్టిలో.  అగ్రికల్చర్ లో పీజీ చేసి  వ్యవసాయం వృత్తిగా ఎంచుకున్నాడు పృధ్వి. టౌన్ లో తమ పొలంలో పండిన అపరాలు, ధాన్యం, కూరగాయలు సమీకృత వ్యవసాయ మార్కెట్ లో వున్న తన అవుట్ లెట్ లో అమ్మేస్తాడు. సేంద్రియ వ్యవసాయంలో దిట్ట పృథ్వికి వెతికి, వెతికి అగ్రికల్చర్   గ్రాడ్యుయేట్ ఐన చక్కని చుక్క వర్షిణిని ఏరి కోరి కోడలిగా తెచ్చుకుంది రుక్మిణి..

పృధ్వి, వర్షిణి మనసు, మాట కలిసిన అందమైన జంట. తమ కుటుంబానికి కావలిసిన వన్నీ పొలం నుండే వస్తాయి. ఒక్క వ్యవసాయమే కాకుండా, చిన్నపాటి డైరీ ఫామ్, కోళ్ల ఫామ్ వున్నాయి వాళ్లకి. పృధ్వికి తోడూ, నీడై మెలుగుతోంది వర్షిణి. 

వర్షిణి ట్రాక్టర్ నడుపుకుంటూ రావటం చూసి  అక్కడున్న  రైతులంతా ఆశ్చర్య పోయారు, గోపయ్య సాయంతో నిర్విరామంగా పన్నెండు ట్రిప్పులు తోలింది, ట్రాక్టర్ నడపటం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ముఖ్యంగా చెరువు లోపల నీళ్లు లేకున్నా, ట్రాక్టర్ జారకుండా లాఘవంగా నడపాల్సి ఉంటుంది.  చాలా  ఏకాగ్రతతో పని చేయాల్సి ఉంటుంది. 

మూడవుతుండగా ఇంటికొచ్చి, స్నానం చేసి, కొడుకుని ఎత్తుకుని    ముద్దులాడసాగింది. 

ముందు అన్నం తినమ్మా, అన్నది రుక్మిణి ప్రేమగా.
ఇవాళ్టికి పని  చాలించు, మరీ మగరాయుడిలా తెగ కష్టపడకు అన్నది రుక్మిణి కోపంగా.

వర్షిణి భోజనం చేసి, వచ్చి అత్త ఒళ్ళో పడుకుని, కొడుకుని గుండెల మీద వేసుకుని ఆడిస్తూ, అన్నది, 

ఆమ్మో, ఇంక నువ్వు వెళ్ళమన్నా వెళ్ళను, రేపు ఎరువు తోలాలి, మన పశువుల ఎరువు కాక ఇంకో మూడు చోట్లనుండి  పొలానికి తోలుకెళ్ళాలి అన్నది .

 పృధ్వికి ఫోన్ చేయమ్మా, ఆడపిల్లకి ఇంత కష్టం పనికి రాదే తల్లి, వాడిని బయల్దేరి రమ్మని ఫోన్ చేయి, లేకపోతే 
వాడు వచ్చి చేసుకుంటాడులే, కొంచం గట్టిగా మాట్లాడు వర్షిణి, అన్నది కోడలి తల నిమురుతూ.

నాకూ అప్పుడప్పుడు నీ కొడుకుతో పోట్లాడాలనిపిస్తుంది అత్తా, కానీ ఆ మనిషి రాగానే మాటలతో మాయలో పడేస్తాడు,

 ఒక్క దురలవాటు లేని వాడిని యేమని నిలదీయను ? అన్నది అల్లరిగా నవ్వుతూ. 

"అత్తా, ఏరువాక పౌర్ణమికల్లా పృధ్వి వచ్చేస్తే బాగుండు. ఎరువు, మట్టి తోలక పొతే తొలకరి వచ్చే లోపు పూర్తి చెయ్యాలి, నీకు తెలియనిదేముంది ? ఏరువాక రోజు నీ కొడుకు కొత్త పంచకట్టులో సూపర్  గా  ఉంటాడు, నేను, నువ్వు కొత్త చీరలు కట్టుకుని పూజ చేద్దాము, నిజం చెప్పు, నీ కొడుకు పంచ కట్టులో అదుర్స్ కదా అన్నది వర్షిణి చిలిపిగా నవ్వుతూ. 

ఫోన్ చేసి రమ్మని గట్టిగా చెప్పటం చేతకాదు నీకు, ఇట్లా కలలు కంటుండు, లే, లేచి వెళ్లి పడుకో అన్నది చిరుకోపంగా రుక్మిణి.
***
మర్నాడు నిర్విరామంగా ఎరువు తోలింది వర్షిణి. రెండు రోజుల తర్వాత తీరిగ్గా వచ్చాడు పృధ్వి, రాగానే స్నానం చేసి, తల్లి ఇచ్చిన టీ తాగి కొడుకుతో ఆటలు మొదలెట్టాడు. నాలుగు రోజుల తర్వాత కనపడిన తండ్రిని చూసి కేరింతలు కొడుతున్నాడు బుజ్జిగాడు. వర్షిణి వంటింట్లో టిఫిన్ చేస్తోంది, నెమ్మదిగా కొడుకుని అడిగింది రుక్మిణి, యేవో కొందామని వెళ్ళావు, ఏమీ తెచ్చినట్టు లేదు, ఏమయ్యింది నీ ఫ్రెండ్ కి.

పృధ్వి, ఏమీ కొనలేదమ్మా, మూడు లక్షలు ఖర్చు అయింది, చెప్పాగా వర్షిణితో అన్నాడు కూల్ గా 

అతని తరుపు వాళ్ళు వచ్చారు కదా, నీ డబ్బు ఇవ్వలేదా కోపం అణుచుకుంటూ అడిగింది రుక్మిణి. .

శంకర్ ఇస్తాడులేమ్మా, అన్నాడు పృధ్వి తాపీగా. 
రుక్మిణి కోపంగా అన్నది, ఇస్తాడు నమ్మకమే, ఇదివరకు తీసుకున్న వాళ్లంతా ఇచ్చారు, ఇక ఈయన ఇస్తాడు, నువ్విట్లా సంఘ సేవలో మునిగి తేలు, కష్టార్జితం ధారపోస్తుండు, పిల్లేమో ట్రాక్టర్ నడిపి బండు పనులన్నీ నెత్తినేసుకుని  నువ్వొచ్చేసరికి పూర్తి చేస్తుంది

వర్షిణీ అంటూ గట్టిగా అరిచాడు పృధ్వి., నేనొచ్చేసరికి ఇవన్నీ చేయమని చెప్పానా నీకు పెద్ద హీరోయిన్ లా ట్రాక్టర్ నడిపావట అన్నాడు కోపంగా. 

వర్షిణి కోపంగా జవాబిచ్చింది,  తొలకరి మొదలై వర్షం పడితే ఎరువులెలా తోలటం ? ఎరువు తడిస్తే కష్టం కాదా, చెరువు మట్టి అందరూ తీసుకెళుతున్నారు, అంత సారవంతమైన మట్టి ఎందుకు పోనివ్వటం అంటూ విసురుగా.. ఇంటి వెనుక పెరట్లో మాధవీలత చక్కని ఆర్చీకి మళ్లించి పూల వాటికలా చేసాడు పృధ్వి. వెళ్లి అక్కడున్న బెంచీమీద  కూర్చుంది. ఇంత కష్టపడితే, 'హీరోయిన్ వా' అన్నందుకు మనసు కష్ట పెట్టుకుని.

పృధ్వి వెనకే వచ్చాడు, సారీ, ఇంత కష్టపడ్డ నా బంగారు తల్లిని తిట్టాను అన్నాడు బ్రతిమిలాడుతూ. 

"నా బాధ మీరు అరిచినందుకు కాదు పృధ్వీ, నేనొక మాట చేప్తాను, వేరుగా అనుకోవద్దు, మీరు సాయం అడిగిన వాళ్లందరికీ వెనకా ముందు చూడకుండా డబ్బు సర్దుతున్నారు. కానీ ఎవరూ తిరిగి ఇవ్వటం నేనెరుగను. ఈ గుడ్ బాయ్ సిండ్రోమ్ నుండి మీరు బయటపడాలి. అలా అడిగిన వాళ్లంతా మీరు 'చాలా మంచివాడు' అనుకుంటారని మీరు భావిస్తున్నారు, కానీ మీ మంచితనాన్ని వాళ్ళు'యెన్ కాష్ చేసుకుంటున్నారు' పృధ్వీ అన్నది అతని భుజం మీద తల ఆనించి. 

ఓ పదిరోజులాగి శంకరుని డబ్బు ఇవ్వమని ఆడుగు తాను" అన్నాడు నెమ్మదిగా. 
*****
ఏరువాక రోజు అత్తా, కోడలు దుక్కిటెద్దులని  అలంకరించారు. పశుపూజ చేశారు. నిండయిన విగ్రహం పృధ్విది. పంచెకట్టుతో మరీ బావున్నాడు, వర్షిణి కొత్త చీర కట్టి, అందంగా ముస్తాబై, నాగలి చేసిన చాళ్ళలో విత్తనాలు శాస్త్రానికి వేసింది. కేరింతలు కొడుతున్న మనవడిని ఎత్తుకుని, రుక్మిణి కళ్ళనిండా సంతోషం నింపుకుని చూసుకుంది ఆ జంటని.

మూడు నెలలైనా శంకర్ కనీసం ఫోన్ కూడా చెయ్యలేదు. పృధ్వికి ఆశ్చర్యమూ, కోపం కూడా వచ్చింది. శంకర్ కి తనే కాల్ చేసాడు పృధ్వి, శంకర్ర భార్య రమ్య మాట్లాడింది,  ఏవిటండీ, డబ్బు ఇవ్వకుండా ఊరినుండి పారిపోతామా ఏమిటి ? ఇస్తాము, వీలు చూసుకుని అన్నది విసురుగా

ఫోన్ స్పీకర్ ఆన్ లో వున్నది, వర్షిణి అంతా విన్నది.
శంకర్ రమ్యతో ఈ మాటలు చెప్పించాడు. మీరు చెల్లించిన డబ్బు తాలూకు బిల్ వివరాలు మీ ఫోన్ లో ఉన్నాయా, డిలీట్ చేశారా అన్నది. 
లేదు, అన్నీ వున్నాయి అన్నాడు పృధ్వి.

అయితే మా కజిన్ లాయర్, తనని ఏమి చెయ్యాలో సలహా అడుగుదాము అన్నది.

*** 

రెండు రోజుల తర్వాత శంకర్ కి లాయర్ నోటీసు వెళ్ళింది. హాస్పిటల్ లో పృధ్వి ఫోన్ పే ద్వారా పే చేసిన అమౌంట్, మందులకై వాడిన డబ్బు తాలూకు బిల్స్ అన్నీ ఉటంకిస్తూ, ఒకవేళ డబ్బు ఇవ్వకపోతే సివిల్ కేసు ఫైల్ చేస్తారని తెలియజేస్తూ నోటీసు వెళ్ళింది.

శంకర్ భార్య ప్రామిసరీ నోట్ గానీ, చెక్ కానీ భర్త, పృధ్వికి ఇవ్వలేదు కాబట్టి, డబ్బు తిరిగి ఇవ్వకపోయినా పర్వాలేదు అనుకుంది. 

శంకర్ భయపడ్డాడు, భార్య మాట విని తనకు ప్రాణాపాయం నుండి రక్షించిన స్నేహితుడిని అనుమానించి, అవమానించినందుకు సిగ్గు పడ్డాడు. పృధ్విని ఫేస్ చేసే ధైర్యం లేక అతని అకౌంట్ కి మూడు లక్షలు పంపాడు.

విషయం తెలిసిన రుక్మిణి చాలా సంతోషించింది, ఆమె ఏదో మాట్లాడేలోగానే పృధ్వి అన్నాడు,  అమ్మా, నువ్వేమి అందామనుకున్నావో నాకు తెలుసు, నేను ఇక రెండువేలు మాత్రమే నా అకౌంట్ లో ఉంచుకొని.  మిగతా డబ్బు
మొత్తం వర్షిణి అకౌంటుకి ట్రాన్స్ఫర్ చేస్తాను, అవసరమైతే అడిగి తీసుకుంటాను, సరేనా అన్నాడు.

ఆ రాత్రి వర్షిణి పృధ్వితో అన్నది, ఇంత భారం నా మీద వేశారెందుకు ? అన్నది నెమ్మదిగా.

 పృధ్వి నవ్వాడు,  నువ్వు, నేను వేరు కాదు వర్షిణీ, ఈ పృధ్వి పచ్చగా ఉండాలంటే ఈ వర్షిణి దయ ఉండాలి, నేను మనుషులని నమ్మి చాలాసార్లు మోసపోయాను, నువ్వు అంటుంటావే *గుడ్ బాయ్ సిండ్రోమ్* అని. దానుండి నేను బయట పడాలంటే ఇదొక్కటే మార్గం.  నాకై నేను ఆర్ధిక హద్దులు విధించుకోలేక పోతున్నాను, అన్నాడు ప్రేమగా ఆమెను దగ్గరకు తీసుకుని.

(సమాప్తం)

No comments:

Post a Comment