*నవ్వు లేదా స్మైల్ దీనిని మందహాసం లేదా దరహాసం అనొచ్చు. ఇది ఒక విధమైన ముఖ కవళిక. నవ్వేటప్పుడు మన ముఖంలోని వివిధ కండరాలు, ముఖ్యంగా నోటికి రెండువైపులా ఉండేవి సంకోచిస్తాయి. మానవులలో నవ్వు సంతోషం, ఆనందానికి బాహ్య సంకేతం. కొందరు నిశ్శబ్దంగా నవ్వుకుంటే, కొంత మంది బయటకు శబ్దం వచ్చేటట్లుగా బిగ్గరగా నవ్వుతారు. సాధారణంగా చలోక్తులు, చక్కిలిగింతలు, హాస్యసన్నివేసాలు వంటి మరికొన్ని రకాల ప్రేరేపణలు, మనసును ఆనందపరచే సందర్భాలలో నవ్వు వస్తుంది. నైట్రస్ ఆక్సైడ్ పీల్చడం వలన, కొన్ని మాదక ద్రవ్యాలు వాడడం వలన బిగ్గరగా నవ్వుతారు. అమితమైన ఆనందం, ఆవేశంతో నవ్వినప్పుడు కొన్నిసార్లు కన్నీళ్ళు కూడా వస్తాయి... వీటినే మనం ఆనందభాష్పాలు అని అంటాం.*
*మానవులలో నవ్వడాన్ని మెదడు నియంత్రిస్తుంది. సంఘంలోని వ్యక్తుల మధ్య సంబంధాలలో, సంభాషణలలో ఉత్తేజాన్ని కలిగిస్తుంది. నవ్వు ఇతరుల నుండి కలయికను* *కాంక్షిస్తుంది. కొన్ని సార్లు ఇది సమూహంలో ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది.*
*మహాకవి గుర్రం జాషువా చెప్పినట్లు...*
*నవ్వవు జంతువుల్ నరుడె నవ్వును, నవ్వులె చిత్తవృత్తికిం*
*దివ్వెలు కొన్నినవ్వు లెటు తేలవు కొన్ని విషప్రయుక్తముల్*
*పువ్వులవోలె ప్రేమరసముం గురిపి౦చు విశుద్ధమైన లే*
*నవ్వులు సర్వదు:ఖదమనంబులు వ్యాధులకున్ మహౌషధుల్ II*
,*నిజమే ఈ సృష్టిలో ఏ జంతువు నవ్వలేదు. మనిషి మాత్రమే నవ్వగలడు. నవ్వులు మానవ మనోవికాసానికి దివ్వెలు. కొంతమంది నవ్వుతారు ఎందుకు నవ్వుతారో ఎవరికీ తెలియదు. కొన్ని నవ్వులు విషపునవ్వులు. అలా కాకుండా పువ్వుల్లా ప్రేమరసాన్ని కురిపించే విశుద్ధమైన లేతనవ్వులు సమస్తదు: ఖాల్ని పోగొడతాయి. అవి వ్యాధులకు ఔషధాలుగా పనిచేస్తాయి అని కవి అభిప్రాయం.*
*సహజంగా మనం తెలియని వారిని పరిచయం చేసుకునేది కూడా చిరునవ్వుతోనే. నవ్వు కోపానికి విరుగుడు, అనేక రోగాలను దూరం చేసే మంచి టానిక్. దీనికి మించిన వ్యాయామం లేదు. శారీరకంగానూ, మానసికంగానూ ఎంతో ఆరోగ్యాన్నిచ్చి, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండేలా చేసేది నవ్వు. నిజానికి ఇది ఒక గొప్ప ఔషధం. ప్రపంచంలో ఎక్కడైనా, ఎవరికైనా ఇది ఇచ్చే ఫలితం మాత్రం మారదు. అంతేకాదు నవ్వు పిరికితనాన్ని కూడా పోగొడుతుంది. నవ్వడం వలన శరీరంలోనున్న రోగాలన్నీ మటుమాయమవుతాయని ఆరోగ్యనిపుణులు అంటున్నారు.*
*నవ్వు శరీరంలోని కొటికోల్ అయాన్ హార్మోన్లను విడుదల చేస్తుంది. నవ్వు వల్ల ఎండార్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇవన్నీ బాధను మరిపిస్తాయి, అనేక శారీరక, మానసిక రుగ్మతలను దూరంచేసి ప్రశాంతతను ఇవ్వడంలో ఈ హార్మోన్లు ప్రధానపాత్రను పోషిస్తాయి. మానవులలో నవ్వు, హాస్యానికి సంబంధించిన మానసిక, శరీరధర్మ శాస్త్ర ప్రభావాల గురించి తెలిపే శాస్త్ర విజ్ఞానాన్ని "జెలోటాలజీ" అంటారు.*
*నవ్వుతో మరో ఏడేళ్ల ఆయుష్షును పెంచుకోవచ్చు మనస్ఫూర్తిగా నవ్వే వ్యక్తులు ఎక్కువ కాలం జీవిస్తారు. నోరు పెద్దగా చేసుకొని నవ్వడం, కళ్ళు కింద ముడతలు ఉన్న వ్యక్తులు జీవితం పట్ల సానుకూల దృక్పథంతో ఉంటారు. ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతారు. జీవితంలో ఎన్నడూ నవ్వని ఆటగాళ్లు సరాసరిన 72.9 ఏళ్లు, అప్పుడప్పుడూ మాత్రమే నవ్విన వాళ్లు 75 ఏళ్లు, బిగ్గరగా నవ్వేవాళ్లు 79.9 ఏళ్లు జీవించినట్లు పరిశోధనల్లో తేలింది. మొహమాటం కోసం ఉత్తుత్తి నవ్వులు చిందించేవారు ఆయుష్షులో ఎలాంటి మార్పులేదట. బిగ్గరగా నవ్వే వారి ముఖంపై ఉండే కండరాలు సంకోచ, వ్యాకోచం చెంది కాంతివంతమైన వర్ఛస్సుతో ఉంటారు.*
*నవ్వులో ఆనందం అనే భావావేశం ఉంటుంది. భావావేశం లేకుండా కూడా నవ్వొచ్చు. అందుకే మనస్తూర్తిగా నవ్వే నవ్వుకి, తెచ్చిపెట్టుకున్న నవ్వుకి మధ్య తేడా ఉంటుంది. ఈ విషయం పైకి కూడా కనిపిస్తుంది. నవ్వు వచ్చినప్పుడు ఒక జోక్ ని గాని, ఒక సన్నివేశాన్ని గాని అర్థం చేసుకుని అందులో హాస్యభరితమైన అంశాన్ని గ్రహించాలి. ఇది విషయగ్రహణం (cognition) కి సంబంధించిన విషయం. నవ్వినప్పుడు ముఖంలో పలు కండరాలు కలిసి పనిచెయ్యాలి కనుక ఇందులో కర్మేంద్రియాల ప్రమేయం ఉంది. ఈ అంశాలని మెదడులో వివిధ ప్రాంతాలు శాసిస్తుంటాయి. అవన్నీ కలిపితే మెదడులో నవ్వుని శాసించే నాడీ వ్యవస్థ అవుతుంది. అయితే ఆ సంపూర్ణ వ్యవస్థలో ఏఏ ప్రాంతాలు భాగాలుగా ఉన్నాయి, అవి ఎలా కలిసి పనిచేస్తున్నాయి అన్న విషయం ప్రస్తుతానికి స్పష్టంగా లేదు. దాని గురించి ఇంకా పరిశోధన జరుగుతోంది. మనసారా నవ్వగలగడం అలవరచుకుంటే ఆరోగ్యాన్ని పెంపొందించుకున్నట్లే, శారీరక ఆరోగ్యంతో పాటు మానసికానందం, ప్రశాంతత ఏర్పడతాయి. చక్కగా నవ్వుతూండటం, నవ్వుతూ మాట్లాడే వారితో తోటివారు స్నేహం చేయటానికి ఆసక్తి చూపుతారు.*
*నవ్వుల్లో కూడా అనేక రకాలు ఉన్నాయి. ఎదుటివారిని హేళనచేస్తూ నవ్వడం, ఎదుటివారి నిస్సహాయతను చూసినవ్వడం, దేనిమీదయినా పొరపాటున కాలువేసి జారిపడినా, రాయి తగిలి జారినా వారిని చూసి నవ్వాపుకోలేకపోవడం, వికటాట్టహాసం, వక్రపునవ్వు, ఎదుటివారి అపజయానికి ఎద్దేవాగా నవ్వడంలాంటి నవ్వులు ఆరోగ్యకరమైయినవి కావు. ఆ నవ్వు వెనకాల ఉండే అర్థాన్ని గ్రహించిన ఎదుటివారు, వారి స్వభావాన్ని చీదరించుకుంటూ వారికి దూరంగా తప్పుకుంటారు.*
*నవ్వువల్ల ఎన్నెనో ప్రయోజనాలున్నాయి. ఇది ఆవేశాన్ని, ఉద్రిక్తతను తగ్గించటానికి తోడ్పడుతుంది. దేహంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించి, స్ట్రెస్ హార్మోన్లు లెవెల్స్‌ను తక్కువచేసి, మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతుంది. శ్వాసకు సంబంధించిన వ్యాధులను ఎదుర్కోవటానికి సిద్ధపడే యాంటీబాడీస్ ఉత్పత్తిని పెంచుతుంది. ముఖానికి చక్కని వ్యాయామం కలుగుతుంది. ముఖ సౌందర్యాన్ని పెంచుతుంది. దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవారికి నవ్వు దివ్యౌషధంలా, చికిత్సగా పనిచేస్తుంది. నోరంతా తెరచి నవ్వడం వల్ల ఆక్సిజన్ సమృద్ధిగా లభిస్తుంది. ఉచ్ఛ్వాసనిశ్వాసాలు సక్రమంగా జరిగేలా చేస్తుంది. హార్ట్‌రేట్ తగ్గుతుంది. మనస్సులోని దిగులును, బాధలను మరపింపచేసి మనస్సును తేలికచేస్తుంది. బాధను తట్టుకునే శక్తిని పెంచుతుంది. నవ్వడం ద్వారా శరీరంలో కండరాలు, నరాలు, అవయవాలు ఉత్తేజితం పొందుతాయి.,*
*ముఖ్యంగా నవ్వడం వలన ఏ విషయాన్నయినా బాధపడకుండా హాస్యంగానూ, తేలికగానూ, ఆనందంగాను తీసుకునే మనస్తత్వం అలవడుతుంది.*
*అందుకే ఒక కవి అన్నట్టు... నవ్వు ఒక “భోగం”, నవ్వించడం ఒక “యోగం”, నవ్వలేకపోవడం ఒక “రోగం” అని...*
😄🥰😄 🥰😄🥰 😄🥰😄
No comments:
Post a Comment