215వ భాగం
🕉️ అష్టావక్ర గీత 🕉️
అధ్యాయము 18
శ్లోకం 3
కర్తవ్యదుఃఖమార్తాండ
జ్వాలాదగ్దాంతరాత్మనః|
కోరుతూ ప్రశమపీయూష
ధారాసారామృతే సుఖం||
తన కర్మలలో నుండి జనించే దుఃఖమే సూర్యతాపం వలె తనను దగ్ధము చేస్తుంటే, అంతరంగానికి శాంతి సుఖము ఎలా లభించగలవు? కోరికలు లేని స్థితి అనబడే అమృతపు జల్లు మాత్రమే అంతరంగానికి ఆనందాన్ని ఇవ్వగలదు.
కోరికలు అనబడే మహాతరంగాలతో కల్లోలితమైన మనసు అనేక కర్మలను చేస్తూ కష్టపడుతూ మళ్లీ కోరికలను పెంచుకుంటూ అశాంతి మయమైపోతుంది. కోరికలు నశించిన స్థితి మాత్రమే అట్టి మనసును శాంతింప చేయగలదు.
వేదాంత సత్యాన్ని శారీరక అనుభవ సహాయముతో చెప్పటానికి ప్రయత్నిస్తున్నారు కవి ఇక్కడ. సంస్కృత భాష కవిత్వంలో ఒక విలక్షణమైన చిత్రీకరణకు ఉదాహరణగా ఈ శ్లోకాన్ని చెప్పవచ్చు. మండు వేసవిలోని మధ్యాహ్నం వేడిని మంచి వర్షపు జల్లు మాత్రమే చల్లార్చగలదు. కోరికలతో సంక్షుభితమైన మానవ అంతరంగము అనేక కర్మలను అధిక శ్రమతో చేస్తూ కష్టపడుతూ ఉంటుంది. మనం కోరే శాశ్వత ఆనందము పరిమితమైన ప్రాపంచిక విషయ భోగాల వల్ల లభించదనే జ్ఞానం కలిగినప్పుడు మాత్రమే వైరాగ్య సన్యాస భావాలు ఉదయించి స్థిరపడతాయి. తెలివైన ఈ నిర్ణయముతో వచ్చిన కోరికలు లేని స్థితి మాత్రమే మానసిక కల్లోలాన్ని శాంతి చేయగలదు. ఈ విధంగా వివేక ఉదయము కానంతవరకు మన మనోబుద్ధిలు అశాంతితో అనేక బాధలను అనుభవిస్తూ ఉంటాయి. వివేక విజ్ఞానాల వరప్రసాదాలే శాంతి సమతలు.🙏🙏🙏
No comments:
Post a Comment