Monday, September 8, 2025

 Vedantha panchadasi:
అమిశ్రం జ్ఞానయోగాభ్యాం తౌ చ పూర్వముదీరితౌ ౹
ఆద్యేఽ ధ్యాయే యోగచిన్తాజ్ఞానమధ్యాయ యోర్ద్వయోః 
౹౹22౹౹
అసత్తా జాడ్యదుఃఖే ద్వే మాయారూపం త్రయం త్విదమ్ ౹
అసత్తా నరశృంగాదౌ జాడ్యం కాష్ఠశిలాదిషు
౹౹23౹౹
ఘోరమూఢధి యోర్దుఃఖ మేవం మాయా విజృంభితా ౹
శాన్తాది బుద్ధివృత్త్యైక్యాన్మిశ్రం బ్రహ్మేతి కీర్తితమ్
౹౹24౹౹
ఏవం స్థితేఽ త్ర యో బ్రహ్మ ధ్యాతుమిచ్ఛేత్ పుమానసౌ ౹
నృ శృంగాదిముపేక్షేత శిష్టం ధ్యాయేద్యథాయథమ్
౹౹25౹౹

నిష్ర్పపంచ -  జగత్సంపర్కము లేని  బ్రహ్మము యోగము చేతను,జ్ఞానము చేతను గ్రాహ్యమగును - తెలియబడును.

ఈ జ్ఞాన,యోగాలను గూర్చి లోగడ చెప్పబడ్డది.
ప్రథమాధ్యాయ(ఏకాదశ ప్రకరణమున),యోగము; రెండవ,మూడవ అధ్యాయ ద్వాదశ త్రయోదశ ప్రకరణములందు జ్ఞానము చర్చింపబడినవి.

అసత్త,జాడ్యము(జడత్వం),దుఃఖము అనే ఈ మూడూ మాయ యొక్క స్వరూపాలు.
వీరశృంగాదుల్లో మనకు అసత్త(అసత్పదార్థం) కనిపిస్తుంది.
"మానవుని కొమ్ము"  మొదలగునువి అసత్తను సూచించును.
కట్టె,శిల(రాళ్ళు)మొదలగునవి జడత్వమును సూచించును.
దుఃఖమనేది ఘోరవృత్తుల్లోను,
మూఢవృత్తుల్లోను కనిపిస్తుంది.

జగత్తులో ఎక్కడ చూచినా మాయా విజృంభణం కనిపిస్తూ ఉంటుంది.
బుద్ధి యొక్క ఘోర మూఢ వృత్తులందలి దుఃఖము, విజృంభిస్తే మాయను ప్రకటించును.
శాంతవృత్తులతో కూడ మూడు వృత్తులందును బ్రహ్మము కలిసి ఉండుటచేత అది మిశ్రబ్రహ్మ మనబడినది.

శాంతాది బుద్ధివృత్తుల్లో ప్రపంచ సహితబ్రహ్మం ఉండటానికి కారణం బ్రహ్మము బుద్ధి వృత్తులతో అభిన్నత్వమే !
అందుచేతనే ఆ బ్రహ్మాన్ని 
"మిశ్రబ్రహ్మ" అన్నారు.

బ్రహ్మము మాయల స్వరూపము ఇట్టిదగుట చేత బ్రహ్మమును ధ్యానింపగోరే పురుషుడు అసత్తయగు నృశృంగము మొదలగు వానిని ఉపేక్షించి మిగిలిన రెండింటిపై తగిన విధముగ లక్ష్యము ఉంచవలెను.
అనగా ,
ఈ విధమైన స్థితిలో బ్రహ్మను గూర్చిన ధ్యానం చేయాలని కోరేవాడు,ముందుగా మానవ శృంగాలవంటి మిథ్యా వస్తువుల్ని ఉపేక్షించాలి.
అట్లా ఉపేక్షించగా మిగిలి వున్న పరమతత్త్వాన్ని యథావిధిగా ధ్యానం చేయాలి.

ఇంకా దీనిని వివరంగా 
తెలుసుకుందాం -

శిలాదౌ నామరూపే ద్వే త్యక్త్వా సన్మాత్ర చింన్తనమ్ ౹
త్వక్త్వా దుఃఖ ఘోరమూఢధియోః సచ్చిద్వి చిన్తనమ్ 
౹౹26౹౹
శాన్తాసు సచ్చిదానందాం స్త్రీనప్యేవం విచిన్తయేత్౹
కనిష్ఠమధ్యమోత్కృష్టా స్తిస్రశ్చిన్తాః క్రమాదిమాః 
౹౹27౹౹
మందస్య వ్యవహారేఽ పి మిశ్రబ్రహ్మణి చిన్తనమ్ ౹
ఉత్కృష్టం వక్తుమేవాత్ర విషయానంద ఈరితః 
౹౹28౹౹
ఔదాసీన్యే తు ధీవృత్తేః శైథిల్యాదుత్తమోత్తమమ్ ౹
చిన్తనం వాసనానన్దే ధ్యానముక్తం చతుర్విధమ్ 
౹౹29౹౹

పరమశాంతి ఉన్న బుద్ధివృత్తిలో మాత్రమే పరబ్రహ్మ నిర్ణయమగును.
అప్పుడు మాత్రమే మిథ్యా వస్తువులను ఉపేక్షించి పరమతత్త్వాన్ని పట్టుకునే వీలవుతుంది.
అలా ఉపేక్షించగా మిగిలి వున్న పరమతత్త్వాన్ని ఉన్నదున్నట్లుగా - యథావిధిగా ధ్యానం చేయాలి.

శిలాదులు మొదలైన వాటియందు నామరూపాలను రెండింటినీ వదలివేసి సత్తామాత్రమును -
"సత్"ను మాత్రమే చింతన(ధ్యానం)
చేయాలి.

ఇక ఘోర,మూఢవృత్తు లందు దుఃఖ భాగాన్ని వదలి వేసి"సత్,చిత్" స్వరూపాల్ని గురించిన చింతన చేయాలి.

సాత్వికమైన శాంత వృత్తులందు
"సత్,చిత్,ఆనందం"
అనే మూడింటిని ధ్యానం చేయాలి.

ఈ మూడు రకాల ధ్యానాలలోను పోలిక లేదు.ఎందుచేతనంటే
సత్,చిత్,ఆనందము ఈ మూడు చింతనలు వరుసగా కనిష్ఠము,మధ్యమము,
ఉత్కృష్టము అయిన పద్ధతికి చెందినట్టివి.
కాబట్టి వీటిలో సమానత్వం లేదు.
అయినప్పటికీ -

మందబుద్ధి కలవారికి వ్యవహారమున కూడా 
మిశ్రబ్రహ్మమునైనా ధ్యానించుట శ్రేష్ఠము. మిశ్రబ్రహ్మయొక్క ధ్యానోత్కృష్టతను నిరూపించటం కోసం అట్టి వారి ఉపయోగార్థమే 
ఆ ఉద్దేశ్యంతో, 
ఈ గ్రంథంలో విషయానందాన్ని గురించి చెప్పటం జరిగింది.

ఈ మూడు విధములైన బుద్ధివృత్తులు గాక,
విషయముల పట్ల అంతఃకరణం ఉదాసీనమైనపుడు విషయసంపర్కము లేనందున ఉత్తమోత్తమమగు ధ్యానము
(బ్రహ్మానందపు) వాసనానందము కలుగును.

లక్కను కరిగించి ఏ మూసలో పోస్తే ఆ యాకారము ధరించినట్లుగా,
మనస్సు కూడా యే "వస్తు"రూపమునందు ఏకాగ్రమగునో ఆ"వస్తు" రూపము ధరించగలదు.
ఆ వస్తువు యొక్క స్వరూప స్వభావములు పూర్ణముగా మనస్సు నందు వ్యాపకము కాగా మనస్సు తన్మయమై బ్రహ్మాకారమే అయిపోవును.అదే 
"ఆత్మసాక్షాత్కారము"
"అఖండ ఎరుక"
"స్వరూప దర్శనము"

ఉదాసీన స్థితియందు బుద్ధివృత్తులు శిథిలమైపోతాయి.
కాబట్టి  వాసనానందంలో జరిగే ధ్యానం సర్వోత్కృష్ట మైనదిగా పరిగణింప బడుతోంది. 

ఈ విధంగా ధ్యానం నాలుగు రకాలుగా ఉంటుంది ; 
అని చెప్పబడ్డది -

న ధ్యానం జ్ఞానయోగాభ్యాం బ్రహ్మవిద్యైవ సా ఖలు ౹
ధ్యానేనైకాగ్ర్యమాపన్నే చిత్తే విద్యా స్థిరీభవేత్ 
౹౹30౹౹
విద్యాయాం సచ్చిదానందా అఖండైక రసాత్మతామ్ ౹
ప్రాప్య భాంతి న భేదేన భేదకోపాధి వర్జనాత్
౹౹31౹౹
శాన్తా ఘోరాః శిలాద్యాశ్చ భేదకోపాధయో మతాః ౹
యోగా ద్వివేకతో వైషా ముపాధీనామపాకృతిః
౹౹32౹౹

జ్ఞానంద్వారా,యోగంద్వారా ఏ ధ్యానాన్ని గూర్చి వర్ణింపబడ్డదో అది ధ్యానం కాదు - 
"అది బ్రహ్మవిద్యే".

ఈ నాలుగు విధములైన ధ్యానములందు జ్ఞానము యోగముల మిశ్రమము ఉండుట చేత అవి "బ్రహ్మవిద్య" అనే భావింపవలెను.
ధ్యానముచే చిత్తము ఏకాగ్రమైనపుడు ఆ విద్య సుదృఢమౌతుంది-
సుస్థిరమగును.

బ్రహ్మవిద్యయందు  సత్ చిత్ ఆనందం అనేవి అఖండైక రసభావాన్ని పొంది ఉండటం వల్ల, భేదం గోచరించదు.
ఆ సమయంలో భేదభావాన్ని కలిగించే ఉపాధులన్నీ వర్ణింపబడటమే అందుకు కారణం.
అంటే -

స్థిరమగు బ్రహ్మవిద్య - జ్ఞానము నందు సచ్చిదానందములు ఖండము ఏకరమునై భేదములు కలిగించు ఉపాధులు లేనందున వేరువేరుగ కాక ఒకటియై భాసించును.

శాంతవృత్తులు, ఘోరవృత్తులు,
మూఢవృత్తులు,
శిలాది పదార్థాలూ  అట్టి భేదమును సృష్టిస్తూ ఉండే  ఉపాధులుగా పరిగణింపబడుతన్నాయి.
వీటిని నివృత్తం చేసే ఉపాయం యోగం వల్లగాని,జ్ఞానంవల్ల గాని జరగాల్సిందే !
యోగ,వివేకాదులతో వానిని తొలగింపవలెనని భావం.

అంత్యకాలంలో ఉండే జ్ఞానాన్ని బట్టే నిశ్చయంగా భావిజన్మ ఉంటుంది.
అంత్యకాలంలో ఉండే జ్ఞానమే రాబోయే జన్మకు కారణం అనే సిద్ధాంతం నిశ్చయమైనది కాబట్టి మరణకాలంలో ఉండే, జ్ఞానానికి సంబంధించిన జ్ఞానం మాత్రమే ఉపయోగం.

"సోఽ కామో నిష్కామ ఆప్తకామ...
వై బ్రహ్మభవతి య ఏవం వేదేతి రహస్యం" -
నృ.ఉ.5-2.
-
నిర్గుణ బ్రహ్మోపాసకుడు,
అకాముడు,
నిష్కాముడు,
బాహ్యాభ్యన్తరములైన కామనలు లేనిలాడు,
ఆప్తకాముడు,
ఆత్మకాముడు అవుతాడు.అశ్శరీరుడు,నిరీంద్రియుడు,
అప్రాణుడు,ఆమనుడు అయి కేవల రూపుడవుతాడు.
ఫలంగా మోక్షాన్ని చెప్పారు.          

No comments:

Post a Comment