*ప్రేరణ🏹మార్గ*
*బడిలో లెక్కల మాస్టారి బెత్తానికి బలి*
- నేను/ మీ బ్రహ్మానందం
📖📖📖
సరస్వతీ నమస్తుభ్యం!
"గూకారాంధ కారస్తూ... రుకారస్తూ తన్నిరోధకృత్...”
అంటే- "గురువుకు నిర్వచనం!"
'గు' అంటే గుహ్యమైనది... తెలియనిదీ... కనపడనిదీ... చీకటి!
'రు' అంటే రుభ్యము చేసేది, ఎరుకపరిచేది... లోకాన్ని దర్శింపజేసేదీ... వెలుగు!
అనగా - అజ్ఞానమనే చీకటిని తొలగించీ... జ్ఞానమనే దీపాన్ని వెలిగించే వాడే గురువు.
ఆ గురువులందరికీ... గురుభ్యోన్నమః
ఇదంతా నాకు దీపం వెలిగింతరువాత తెలిసింది.
ఆ దీపాన్ని వెలిగించేటప్పుడు తెలియలేదు.
కారణం... బాల్యం! అజ్ఞానం! చీకటి! తెలియనితనం!
అందువల్ల అప్పట్లో అల్లరెక్కువ చేసేవాడిని.
అందులో భాగంగా ఓ రోజు ఛండ శాసనుడైన మా లెక్కల మాష్టారి
బెత్తానికి విందు భోజనం కల్పించాను.
బడిలో జరిగిన బడిత పూజకు తోడు
ఇంట్లో ఇంకో బాజా మోగింది.
ఆ బడితె కథ ఏమిటంటే...
లెక్కల మాష్టారు పంచె కట్టుకుంటారు.
పాఠం చెబుతున్నంత సేపూ పంచెని సరిచేసుకోవడంతోనే సరిపోతుంది.
ఆ రోజు రాగానే కుర్చీలో కూర్చోబోతూ కాస్త ముందుకు జరుపుకున్నాడు.
దాంతో ఆయన పంచె కుర్చీ కాలు కింద పడింది.
నేను వెంటనే ఆ పక్కనున్న వాడికీ... ఈ పక్కనున్న వాడికి...
నేను మాష్టారినెలా ఏడ్పించబోతున్నానో... మిగతా విద్యార్థులందరినీ
ఎలా నవ్వించబోతున్నానో చెప్పాను.
ఆయన పుస్తకం తెరిచారు.. నేను లేచి నోరు తెరిచాను.
'అది రాదండీ'
మాష్టారుకు అర్ధం కాలేదు.
ఈ లోపు నేనాయన్ని ఏడిపించబోతున్న విషయం పుకారుకన్నా వేగంగా మిగతావాళ్ళకంతా చేరిపోయింది.
"ఏవిట్రా శుంఠా! లెక్క చెప్పక ముందే రాదండీ అంటావేమిట్రా అప్రాచ్యుడా!"
అంటూ తిట్టారు.
నేను మళ్ళీ 'అది రాదండీ' అన్నాను.
మిగతా వాళ్ళంతా గొల్లున నవ్వారు ఆయన ఉక్రోశంతో లేవబోతూ- కుర్చీని వెనక్కి జరిపారు.
పంచె బయటికి వచ్చింది.
వెంటనే నేను 'వచ్చిందండీ' అన్నాను.
మళ్ళీ క్లాసు రూమంతా పగలబడి నవ్వారు.
ఆయన కోపం నషాళానికి అంటినట్టు విసురుగా వొచ్చి...
పంచె సరిచేసుకుంటూనే ఒక్కొక్కడినీ బెదిరిస్తూ...
ఎందుకు నవ్వొచ్చింది అని బాదారు.
ఒకడికి ఆయన పంచెని చూడగానే నవ్వొచ్చింది. ఫక్కున నవ్వాడు.
ఆ నవ్వే నా కొంప ముంచింది.
నవ్వు నాలుగు విధాలుగా చేటంటారు. నాకు రెండు విధాలుగా చేటయ్యింది.
వాడిని పట్టుకుని నాలుగు బాదితే విషయం చెప్పాడు.
నేను అదిరిపడి, తమాయించుకునీ, ప్రపంచంలోని అమాయకత్వాన్నంతా నా ముఖానికే అద్దుకుని ఏమి ఎరగనట్టు నిలబడ్డాను.
ఆయన కనికరించకుండా - 'డిస్కవరీ ఛానల్'లో పెద్దపులి చిన్న జంతువుని లాక్కెళ్ళినట్టు లాక్కెళ్ళి చితకబాదారు.
నెత్తురు కూడా వచ్చింది.
అది చూసి నన్ను వెనక్కినెట్టి - ఆవేశంతో బయటికి వెళ్ళిపోయారు.
నేను ఏడుపు!
నా స్నేహితులంతా రిక్షా కట్టించుకుని ఇంటికి తీసుకొచ్చారు.
మా నాన్న లేదు.
పెద్దన్నయ్య వున్నాడు.
మాష్టారు ఇలా బాదారని తెలియగానే వీరభద్రుడిలాగయిపోయి...
ఎందుకు, ఏమిటి అని అడక్కుండా మాష్టారుని నిలదీయడానికి
నన్ను తీసుకుని బయలుదేరాడు.
అప్పుడే మా నాన్న ఎదురయ్యాడు.
నా కన్నీళ్లూ, వాతలు చూసి కరిగిపోయి, కన్నీళ్ళు పెట్టుకుంటాడని వెర్రి ఆశ!
మా అన్నయ్య విషయం చెప్పి... అడగడానికెళ్తున్నానన్నాడు.
"ఏడ్చావు లేవోయ్”
అనేసి మా నాన్న నన్ను లోపలికి ఈడ్చుకెళ్ళి...
ఇంట్లో వున్న కర్ర స్తంభానికి కట్టి పారేశాడు.
"ఏం జరిగిందీ, నువ్వేం చేశావు, ఎందుకు కొట్టారూ..." అని ఈయన ఓ బెత్తం తీశాడు.
ఊరికే కొట్టారన్నాను.
ఊరికే కొట్టడానికి ఆయనకేం పనిలేదా అన్నాడు.
నా కర్మ ప్రారబ్ధం కాకపోతే ఇదేమిటి!
నాన్న నా వాతలు చూసి కడుపు తరుక్కుపోయి, లాలించి బుజ్జగించి ఓదారుస్తాడమకుంటే... రివర్సయ్యింది.
“వాడసలే సొమ్మసిల్లినట్టుంటే... మళ్ళీ మీరేమిటండీ" అని మా అమ్మ ఆపబోయింది.
వినలా!
నాతో వచ్చిన మిగతా స్నేహితుల్ని బెదిరిస్తే వాళ్ళు నిజం చెప్పేశారు.
ఆ తరువాత మాష్టారు ఇచ్చిన బడిత పూజకు రెట్టింపు మా నాన్న ఇచ్చాడు.
ఈ సంఘటన నేనెందుకు చెబుతున్నానంటే....
నవ్వుకోవడం కోసం మాత్రం కాదు.
అప్పటిదాకా బ్రహ్మానందం అనే బుడతడు అందరినీ ఏడిపించగలడూ, నవ్వించగలడూ అని నా తోటివాళ్ళు అంటూంటే.. అదే నిజమనుకుని భ్రమలో ఉండేవాడిని.
కానీ ఇప్పుడాలోచిస్తే అర్థమవుతోంది... అదెంత అర్థంలేని అభిప్రాయం అనేది!
ఎవరయినా నీతో 'నీ అంత గొప్పవాడు లేడూ' అంటే- పొంగి పోవడం కంటే... నిన్ను నువ్వు తెలుసుకో! నీ అర్హతేమిటనేది బేరీజు వేసుకో! అనే సూత్రాన్ని నేను గుర్తు పెట్టుకోవడానికి ఆ సంఘటన దోహదపడింది. ఒక మహానుభావుడన్నట్టు....
"మాటలు నేర్చుకోవడానికి పుట్టాక రెండు సంవత్సరాలు పడుతుందీ... ఆ మాటలు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ వాడాలో తెలుసుకోవడానికి ఒక జీవితకాలం సరిపోదు" అని!
ఇప్పుడు నన్ను మాటల్తో ఆకాశానికెత్తే వాళ్ళు ఉన్నారు... చార్లీ చాప్లిన్ కంటే గొప్ప వాడనీ అనే వాళ్ళున్నారు.
అవన్నీ నిజమనుకుంటే ఎట్లా? అప్పుడే 'నేనేమిటి' అన్న ప్రశ్న నాలో కలిగింది! ఈ ఆలోచన కలిగించింది ఎవరూ?
ఆ పరమాత్ముడే! నేనేమిటి అన్న ప్రశ్నలాగే నా జీవితంలోకి నాకు తెలియకుండానే - ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడూ, ఆర్తత్రాణ పరాయణుడూ, నారాయణుడూ అయిన కలియుగ శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రవేశించాడు.
నాకు 'అడుగులు' నేర్పాడు.
తెలీనిది - 'అడుగిడీ' నేర్పాడు గురువులను 'అడుగుడూ' నేర్పాడు. అడుగడుగునా నాకు తోడయ్యాడు.
నేను సంతోషంగా ఉన్నప్పుడు నాతో కలిసి నడిచేవాడు. అప్పుడు ఇసుకలో రెండు జతల పాదముద్రలుండేవి. నేను కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం ఒక్క జత పాదముద్రలే ఉండేవి. దానర్థం కష్టాల్లో ఆయన నన్ను వొదిలేసి పోయాడని కాదు. ఆ కటి హస్తాన్నీ... వరద హస్తాన్నీ... ఆ రెండు చేతులనీ సాచి- నన్ను మోస్తూ నడిచేవాడు! అప్పటి నుండే...
‘ఆ పరమాత్ముడే నాకు - పరమ ఆప్తుడయ్యాడు'
హరీ... సిరీ... నమోస్తుతే!!
- నేను మీ బ్రహ్మానందం 😊
No comments:
Post a Comment