Monday, September 8, 2025

 ప్రభూ మాకు విధి కర్మము అంటూ ఒక మాయను కట్టబెట్టావు. ఈ కర్మము విధి ధర్మము అన్నీ నీ కల్పితాలే కదా నీవు కాదంటే అవేమి చేస్తాయి. అందరిలోనూ నన్ను నీ వాడని యెంచి రక్షించు శ్రీవేంకటేశ్వరా నీకు నాకోసం యేది కావాలంటే అది అవదా అంటు పెద్ద తిరుమలాచార్యుడు ఈ కీర్తనలో  కీర్తించాడు.

*కర్మ మంటా మాకు మాయ గప్పేవు గాక కర్మము ధర్మము నీ కల్పితమే కాదాII*


బ్రతుకు మంటే జచ్చిన పరీక్షిత్తు బ్రతుకడా
మతి నారాయణాస్త్రము మానుమంటే మానదా
కతలుగా జలధులు కమ్మంటే రాళ్ళు గావా
యితవు నీకు నైతే యేపని యైనా నౌను 
*కర్మ మంటా మాకు మాయ గప్పేవు*

మలసి బ్రహ్మ మాయకు మారుమాయ సేయవా
అల ద్రౌపదికి జీర లక్షయ మంటే గావా కులగిరులు నేలతో కుంగు మంటే గుంగవా యిల నీకు వలసితే యేపనియైనా నౌను
*కర్మ మంటా మాకు మాయ గప్పేవు*

యిట్టిది విధి యనరా దిదియౌగా దనరాదు
పట్టి నీవు దలచిన యట్టౌగాన
యిట్టే శ్రీ వేంకటేశ యిందరిలోనను గావు
యెట్టు నీకు వలసిన యేపనియైనా నాకు
*కర్మ మంటా మాకు మాయ గప్పేవు గాక కర్మము ధర్మము నీ కల్పితమే కాదా...*

సాహిత్యం :- *శ్రీ తాళ్లపాక పెద్ద తిరుమలాచార్య* 🌞
      
*కీర్తన భావ అమృతం✍*

🐚 *శ్రీవేంకటేశ్వరా మాకు విధి కర్మము అంటూ ఒక మాయను కట్టబెట్టావు, ఈ కర్మము విధి ధర్మము అన్నీ నీ కల్పితాలే కదా నీవు కాదంటే అవేమి చేస్తాయి.*

🐚 *ఆనాడు మృత శిశువుగా పుట్టిన పరీక్షిత్తు నీవు బ్రతుకమంటే బ్రతుకలేదా, నారాయణాస్త్రం నీవు వద్దంటే వదిలివేయలేదా? జలధులు రాళ్ళుగా మారి రాళ్ళ వంతెన కట్టనీయవా. మొత్తం వానరసేన దాటింది కదా. నీకు హితమైతే ఏ పని కాదు. అన్ని పనులూ అవుతాయి.*

🐚 *బ్రహ్మ మాయకు మారు మాయ కల్పించి రిమ్మ తిరిగి పోవునట్లు చేసిన బాలకృష్ణుడవు కౌరవసభలో ద్రౌపతికి అక్షయమైన చీరె లివ్వలేదా నీవు. కులపర్వతాలనైనా భూమిలోకి క్రుంగజేతువు కదా ప్రపంచంలో నీవు కావాలనుకొంటే యేది జరుగదు. ఇటువంటి వన్నీ విధి అనవచ్చునా. నీ చేతలకు అడ్డుచెప్పరాదు.*

🐚 *ఎందుకంటే అన్నీ నీవెట్టా అనుకుంటే అట్లా అవుతాయి. ఇదే విధంగా అందరిలోనూ నన్ను నీ వాడని యెంచి రక్షించు శ్రీవేంకటేశ్వరా నీకు నాకోసం యేది కావాలంటే అది అవదా?* 

No comments:

Post a Comment