Monday, September 8, 2025

 తెలుసుకోండి...080925
తెలియజేయండి....
*విధి2/4*
నిన్నటి తరువాయి.......
విధి ఎప్పుడు ఎలా రూపాంతరం చెందుతుందో ఊహించలేరు. మహాభారతంలో ఇలాంటి అద్భుత సన్నివేశాలెన్నో కనిపిస్తాయి.  పరీక్షిత్తు మరణం కూడా ఇలాంటిదే. తక్షకుడి బారి నుండి. తప్పించుకొంద్రామని ఆయన ఒంటి స్తంభం మేడలోనున్నా, తక్షకుడు (సర్పం) సూక్ష్మ రూపములో ఆయనకు ఆహారంగా కొనిపోబడిన పండ్లలో చేరి చివరకు ఆయన మరణానికి కారణమైనాడు. పరీక్షిత్తు చావు తక్షకుడనే పాము కాటుతో జరగాలనే నిర్ణయం. అది మునిశాపం. అలాగే జరిగి తీరుతుంది. "

మానప్రయత్నం విధికృతాన్ని తప్పించలేదు. ఈ విషయం వసుదేవాదులూహించలేక పోయారు. అందుకే వారు రోకలిని పొడిచేసి సముద్రంలో కలిపి పని పూర్తయిందని భావించి, ఉపశమనం పొందారు. కాని విధి తన పని తాను సుకుంటూనే పోతుంది.

వసుదేవుడు రోకలిని పొడిచేయించి సాగర జలాల్లో చల్లించినా, అది వృధా కాలేదు. తుంగ గడ్డిగా మొలిచి సముద్ర తీరాన వ్యాపించాయి. మునుల శాప కారణంగా.ఆ పరకలకు రోకటి శక్తి కలిగింది.

సాంబుడి కడుపున ఒకే ఒక ముసలమే పుట్టింది. కాని వసుదేవాదుల చర్య వలన అది వేల, లక్షల కొలది తుంగ పరకలుగా పుట్టి రోకలి శక్తిని పొందాయి. ఈ పరిణామం వసుదేవాదులూహించలేక పోయారు. మనిషి ఊహకందనిదే దైవ విలాసం.

ఇది ఇలా ఉండగా, గాంధారి శ్రీకృష్ణుడికిచ్చిన శాప కాలమాసన్నమైనది. ముప్పయి అయిదేళ్ళు గడిచి, ముప్పై ఆరవ సంవత్సరం వచ్చే సమయంలో ద్వారకలో అశుభసూచకాలైన ఉత్పాతాలు సంభవించాయి. ఇవన్నీ గమనిస్తున్న శ్రీకృష్ణుడు తన దివ్యదృష్టితో ఇక యాదవ నాశము తప్పదని తెలుసుకున్నాడు. దానికి పవిత్ర స్థలమైన సముద్ర తీరమే మంచిదని భావించి, జాతర జరుపుకొనేందుకు యాదవులందరూ తమ తమ కుటుంబ సభ్యులతో సముద్ర తీరానికి చేరుకోవలసిందిగా ప్రకటించాడు.
 ద్వారకలో రోజూ ఏవో కొన్ని అపశకునాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంతలో ద్వారకలో మరో విచిత్రం జరిగింది. అందరూ చూస్తుండగానే శ్రీకృష్ణుని దివ్యరథం, దానికి పూచ్చిన సుగ్రీవం, శైణ్యం, వలాహకం, మేఘ పుష్పకల అనే గుర్రాలు ఆకాశ మార్గాన దివికెగసి పోయాయి.

శ్రీకృష్ణుని ఆదేశానుసారం యాదవులందరూ జాతర సంబరాలు జరుపుకొనేందుకు పూజాద్రవ్యాలు, పిండివంటలు, రకరకాల మద్యపానీయాలతో. సముద్ర తీరాన ముందుగా ఏర్పాటు చేసియున్న విడిది స్థలాలకు చేరుకున్నారు. పూజాదిక కార్యాలు ముగించుకొని, భోజనాలయిన తర్వాత, అందరూ సంతోషంగా మద్యాలు సేవిస్తున్న సమయంలో సాత్యకి కృతవర్మల మధ్య జరిగిన సంభాషణ, మాటామాటా పెరిగి కలహానికి దారి తీసింది. ఆగ్రహించిన సాత్యకి వెంటనే తన ఖడ్గంతో కృతవర్మ తల నరికాడు. దాంతో పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీశాయి. యాదవుల్లో వృష్టికులం వారంతా సాత్యకి పక్షం చేరగా, భోజాంధకులు కృతవర్మ పక్షం చేరి పరస్పరం పోరుకు దిగారు. జాతర సంబరాలు కాస్తా యుద్ధవాతావరణంగా మారి పోయాయి. జాతర కోసమై వచ్చిన యాదవులకక్కడ సరియైన యుద్ధాయుధాలు లేక పోవడంతో అందుబాటులోనున్న ముయ్యంచు తుంగ పరకలనే పెరికి వాటితోనే కొట్టుకొని మరణించసాగారు. అదేంటి? తుంగ పరకలతో కొట్టుకుంటేనే చనిపోతారా? అంటే, అవి కేవలం తుంగ పరకలు మాత్రమే గాదు, మునుల శాప కారణంగా ముసలం (రోకలి) శక్తిని పొందిన ఆయుధాలు.

మునుల శాపకారణంగా సముద్ర తీరాన మొలిచి యున్న తుంగ పరకల్లోనికి పరకాయ ప్రవేశం లాగా రోకటి శక్తి ప్రవేశించింది. యాదవ వీరులకు తుంగ పరకలే రోకళ్ళలాగా స్ఫురించాయి. రోకటి శక్తి పొందిన ఆ తుంగ పరకలతో కొట్టుకొనే యాదవ వీరులందరూ మరణించ సాగారు.

శ్రీకృష్ణుడక్కడే సాక్షీభూతుడుగా ఉన్నాడు. ఆయన చూస్తుండగానే అనిరుద్ధ, ప్రద్యుమ్న, సాంబ, సాత్యకి మొదలైన యాదవ వీరులందరూ చనిపోయారు.
..... మిగతా రేపు.....

 సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.
 శైలజ వాస్తు జ్యోతిషాలయం 9059743812

No comments:

Post a Comment