3️⃣0️⃣
*🛕🔔భగవద్గీత🔔🛕*
_(సరళమైన తెలుగులో)_
*రెండవ అధ్యాయము*
*సాంఖ్యయోగము.*
*38. సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌl*
*తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాష్యసిll*
అర్జునా! జయాపజయములను, లాభనష్టములను, సుఖదుఃఖములను సమానంగా భావించి నీవు నీ కర్తవ్య కర్మ అయిన ఈ యుద్ధం చెయ్యి. అప్పుడు నీకు ఈ యుద్ధం చేసిన పాపం అంటదు.
ఈ శ్లోకంలో కృష్ణుడు కర్మలు చేసినా కర్మల వాసనలు ఎలా అంటుకోకుండా ఉంటాయి అనే విషయాన్ని చెబుతున్నాడు. దానినే సమభావము అంటారు. దానికి కావాల్సింది నిశ్రయాత్మక బుద్ధి, సుఖము, దుఃఖము, లాభము, నష్టము, జయము అపజయము ఇవి ద్వంద్వములు. వీటి పట్ల సమభావం కలిగి ఉంటే ఆ కర్మల వలన ఉత్పన్నమయే వాసనలు మనకు అంటవు. కాబట్టి సుఖము, లాభము, జయము కలిగినపుడు పొంగి పోవడం, దానికి వ్యతిరేకంగా జరిగితే కుంగి పోవడం మంచిది కాదు. ఒక కర్మచేస్తే ఏదో ఒకఫలితం వస్తుంది. తప్పదు. అది ముందు మనకు తెలియదు. వచ్చిన తరువాత అనుభవించడమే మన కర్తవ్యము. కాబట్టి వాటి పట్ల సమభావం ఉంటే మనస్సు శాంతిగా, సుఖంగా ఉంటుంది. ఈ విషయం గురించి ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాము.
కర్తవ్యములు అంటే చేయవలసిన పనులు. ఇవి రెండు రకాలు. ఒకటి సంతోషంతో చేయవలసినపని. అంటే మనకు ఇష్టమైన, మనం ఇష్టంతో చేసే పని, రెండవది మనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా చేసే పని. దుఃఖమును కలిగించే పని. మొదటిది మనకు ఇష్టమైన పని కాబట్టి ఇష్టంగా చేస్తాము. రెండవది ఇష్టం లేని పని కాబట్టి ఏడుస్తూ చెయ్యాల్సివచ్చిందే అనిచేస్తాము. కాని రెండు చేయవలసిన పనులే తప్పించుకొనేవి కావు. కాబట్టి వీటియందు సమత్వం పాటిస్తే ఏ చిక్కు ఉండదు అని చెబుతున్నాడు భగవానుడు. హిమాలయాలలో, ఎవరూ లేని చోట, సమత్వం పాటించడం గొప్ప కాదు. అక్కడ ఎవరూ లేరు కాబట్టి నమత్వం దానంతట అదే వస్తుంది. కాని, ప్రాపంచిక విషయములు అనుభవిస్తూ ప్రపంచంలో తిరుగుతూ సమత్వము పాటించడమే ఒక యోగము అని భగవానుడు అంటాడు.
మనస్సులో సమత్వం లేకపోతే అది ఆలోచించలేదు. మనస్సు పనిచేయడం మానేస్తుంది. అంతేకానీ దేవుడు గొప్పవాళ్లకు ఎక్కువ తెలివితేటలు ఇచ్చాడు నాకు తక్కువ తెలివి ఇచ్చాడు అని అనడం వివేకంకాదు. పరమాత్మ అందరికీ ఒకే విధమైన మెదడు, బుద్ధి, ఆలోచనా శక్తి ఇచ్చాడు. కాని దానిని మనం సక్రమంగా వినియోగించడం లేదు. కొంత మంది అసలు వినియోగించరు. మన ఆలోచనలన్నీ ధనం సంపాదించడం, సుఖాలు అనుభవించడం వీటి చుట్టుతిరుగుతుంటాయి. ముఖ్యంగా స్త్రీలు టీవి సీరియళ్లు చూచి ఆ సీరియళ్ల గురించి ఆలోచిస్తూ ఆ కష్టాలన్నీ తాము మానసికంగా అనుభవిస్తూ మానసిక ఆందోళనకు గురి అవుతుంటారు. దానివలన మనసు ఎప్పుడూ ఆందోళనకు గురి అవుతూ ఉంటుంది. నేటి యువతరం కూడా ఎక్కువగా సినిమాలు చూస్తూ, ప్రేమ వ్యవహారాలలో, రాజకీయాలలో మునిగితేలుతూ వాటి గురించే ఆలోచిస్తూ, చదువు మీద ఏకాగ్రతను కోల్పోతున్నారు. సుఖం వచ్చినపుడు ఎగిరెగిరిపడటం ఆనంద పడటం, దుఃఖం వచ్చినపుడు కుంగి పోవడం చాలామందికి ఒక అలవాటుగా మారిపోయింది. దీనికి విరుగుడు సమత్వం. సుఖదు:ఖాలను సమంగా భావిస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచించే శక్తి పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. విద్యలో గానీ, వ్యాపారంలోగానీ, ఉద్యోగంలో కానీ, ఇంటి విషయాలలో కానీ, రాణించగలడు.
ప్రస్తుతం అర్జునుడు బాగా డిస్టర్భ్ అయి ఉన్నాడు. అందువలన అర్జునుడి ఆలోచనా శక్తి పనిచేయడం లేదు. అర్జునుడిలో ఉన్న ఎమోషన్సు బాలెన్సు చేయగలిగితే, అతను మామూలు స్థితికివస్తాడు. ఈ మెంటల్ ఇమ్బాలెన్స్ జీవితంలో ప్రతి మానవుడికి ఉంటుంది. అప్పుడు మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. ఏ విషయాన్ని సక్రమంగా ఆలోచించలేడు. ఎప్పుడూ మనను అల్లకల్లోలంగా ఉంటుంది. సరి అయిన నిర్ణయం తీసుకోలేడు. అప్పుడు కావాల్సింది మానసిక ప్రశాంతత. దానికి మార్గం సుఖదుఃఖములలో సమంగా ప్రవర్తించడం. ఎందుకంటే ఎల్లప్పుడూ సుఖం ఉండదు. ఎల్లప్పుడూ దుఃఖం ఉండదు. సుఖం దుఃఖం ఒకదాని వెంట వస్తూ పోతూ ఉంటాయి. ఇది అనివార్యం అని సాక్షాత్తు భగవంతుడే చెప్పాడు. కాని మనం మాత్రం మాకు ఎల్లప్పుడూ సుఖమే కలగాలని రోజూ భగవంతుడిని ప్రార్థిస్తాము. ఇంకా కొంత మంది మేము ఆ దేవుడిని కొలిస్తే అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతాయి అని అంటూ ఉంటారు. ఇది అసాధ్యము అని తెలుసుకోవడమే వివేకము. అందుకే సుఖము దుఃఖము మధ్య సమత్వము సాధించాలని భగవానుడు చెప్పాడు. సుఖదుఃఖములను సమంగా చూచినప్పుడే మనస్సు ప్రశాంతంగా నిర్మలంగా నిశ్చలంగా ఉంటుంది. అందుకని కృష్ణుడు అంటున్నాడు.
అర్జునా! నీవు నీ కర్తవ్యమును నిర్వర్తించు. అంటే చేయాల్సిన పని చెయ్యి. దాని వలన సుఖం వస్తుందా, దుఃఖం వస్తుందా, లాభం వస్తుందా, నష్టం వస్తుందా, జయం కలుగుతుందా, అపజయం కలుగుతుందా అని ఆలోచించకు. బాధపడకు. కంగారు పడకు. నీ కర్తవ్యం నీవు నిర్వర్తించు. నీ కర్తవ్యం నీవు నిర్వర్తిస్తే నీకు పాపం రాదు. అంటే ద్వంద్వాల వలన నీ మనసు కలత చెందదు. ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుంది. అన్ని ద్వంద్వాలను సమంగా అనుభవిస్తుంది. ఆలోచనా శక్తిని పెంపొందించుకుంటుంది. కాబట్టి ఎపుడూచిరునవ్వుతో ఉండు. సంతోషము వచ్చినపుడు పొంగిపోకు, దుఃఖము వచ్చినప్పుడు కుంగి పోకు, శోకించకు. ఎల్లప్పుడూ మనసును ప్రశాంతంగా ఉంచుకో. లేచి యుద్ధం చెయ్యి అని కృష్ణుడు బోధించాడు.
(సశేషం)
*🌹యోగక్షేమం వహామ్యహం🌹*
(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
P86
No comments:
Post a Comment