Monday, September 8, 2025

 శ్రీ కృష్ణుని ప్రణయతత్త్వాన్ని గురించి విన్న మహాదేవునికి(శివునికి)  శ్రీకృష్ణుని  రాసలీలలు  చూడాలనే కోరిక  ఒకసారి కలిగింది.
రాసమండపానికి వచ్చాడు. మహాదేవుని చూసిన రాధాదేవి యొక్క చెలికత్తెలు లలిత, విశాఖ మహాదేవుని అడ్డగించారు.

పరమశివుడినే ఎదిరించగలిగిన శక్తి వీరికి ఎలా లభించింది.?

శివుడు తనను అడ్డగించడానికి కారణం అడిగాడు.

అందుకు ఆ చెలికత్తెలు… “శ్రీ కృష్ణుడు ఒక్కడే పురుషోత్తముడు. మేము వారికి సేవ చేసే జీవాత్మలము.                           ఆ పరమపురుషుని  స్నేహితులము. ఆయనకు తప్ప అన్య  పురుషులకు యిక్కడ  అనుమతి లేదు” అని స్పష్టంగా బదులిచ్చారు.

అది విని శివుడు చిరునవ్వు నవ్వుతూ “పురుషునిగా జన్మించడం నా తప్పు కాదు. మరి వాసుదేవుని పట్ల                 నా మనసులోని భక్తిని ప్రేమను తెలియచేయడానికి నేను ఏం చేయాలి?” అని గోపికలను అడిగాడు.

“మీరు కృష్ణుని యందు ప్రేమ కలిగి వుండడం సత్యమైతే, ఇక్కడ వున్న రాధాకుండంలో  మునిగిరావాలి అని గోపికలు ఆజ్ఞాపించారు.

శివుడు  మారు పలుకకుండా రాధాదేవి కోసం కృష్ణుడు ఏర్పర్చిన రాధాకుండంలో మునిగాడు.

రాధాకుండంలో మునిగిన శివుడు(ఈశ్వరుడు) బయటకు రాగానే ఒక గోపికగా మారిపోయాడు.

గోపికగా మారిన శివుడు రాసలీలలు జరిగే రాసమండపానికి వచ్చాడు.

శ్రీకృష్ణుడు  గోపిక రూపంలోని  ఈశ్వరుని గుర్తించాడు. గోపికగా మారిన ఈశ్వరుని చూసి  “గోపేశ్వర్ మహాదేవ్” అని పిలిచాడు.

నేటికీ ఆ పేరుమీదే  బృందావనంలో వెలసివున్న గోపేశ్వర్ మహాదేవుని సాయంకాల వేళలలో సుందరమైన గోపికగా అలంకారాలు చేసి పూజిస్తారు.

మధురలోని బృందావనంలో(రాధ కుండ్ పక్కనే)  గోపేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉంది.

No comments:

Post a Comment