*🌄 జ్ఞానప్రసూనాలు🔥*
*18/06/2025*
1.పొందినవాడికి చెప్పే అవసరం లేదు. పొందనివాడికి విన్నా ప్రయోజనం లేదు.
2.శరణాగతి బుద్ధిని కూడా భగవంతుడు ప్రసాదించవల్సిందే. వేణే మార్గం లేదు.
3.తాను ఈశ్వరుడు అయ్యి కూడా
ఈశ్వరుణ్ణి కానేమో అనుకుని ఈశ్వరుడు కావడానికి తాను చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధన అయ్యింది.
4.భక్తికి, భయానికి తేడా ఏమంటే-'నీ ఇష్టం' అని సంతకం పెట్టేసి స్థిమితంగా ఉండడమే శరణాగతి (భక్తి) సంతకం పెట్టకపోతే అది భయం.
5.మనం తినే ఆహార పదార్థాలలో మేలైన ఆహార పదార్ధంగా దేవుణ్ణి భోంచేయాలని చూస్తున్నాం. ఆ ప్రయత్నంలోనే 'నవ విధ భక్తులు' ఏర్పడ్డారు. అట్లా కాకుండా తానే ఓ ఆహార పదార్ధంగా భగవంతుని ముందు నిలబడేవాడే నిజమైన భక్తుడు.
6.ప్రియురాలిగా ఉన్నప్పుడే కవిత్వాలుగాని పెళ్లామయ్యాక ఇక కవిత్వాలు ఉండవండి. దేవుణ్ణి పొందే వఱకే కీర్తనలు, స్తోత్రాలుగాని దేవుణ్ణి పొందేక ఇక మాటలు ఉండవండి.
7.ప్రసాదం అంటే -మొత్తం తానుంచుకుని కొద్దిగా దేవునికి ఇవ్వడం కాదు. మొత్తం దేవునికి ఇచ్చివేసి అందులో కొద్దిగా తాను తీసుకోవడం.
8.నేను ప్రపంచంలోకి వచ్చాను, ఉంటాను, తిరిగి ఈ ప్రపంచం నుండి నిష్క్రమిస్తాను" అని ఉన్న అనుభవవంలో నుంచి "నాలో ఈ ప్రపంచం పుట్టింది, ఉంటుంది,
తిరిగి నాలో కలిసిపోతుంది" అన్న అనుభవంలోకి మారటమే ఆధ్యాత్మిక ముఖ్య ప్రయోజనం.
9.తన శరీరంలో తన ప్రమేయం లేకుండా శ్వాసాది క్రియలు నిరంతరం జరుగుతూ ఉంటాయి. కేవలం తాను 'ఉంటాడు'. అలానే దేవునిలో కూడా ఆయన ప్రమేయం లేకుండా సృష్టి స్థితి లయాలనేవి నిరంతరం జరుగుతూ ఉంటాయి. కేవలం తాను 'ఉంటాడు'. జీవుడికైనా దేవుడికైనా 'ఉండటం' అనేదే స్వరూపం. దేవుడు కర్తగా అనిపించడమే గాని, కర్త కాడు. అయస్కాంతం యొక్క సన్నిథి మాత్రము చేతనే ఇనుప ముక్కల్లో కదలిక కలిగినట్లు దేవుని సమక్షంలో జగత్తు చైతన్యవంతమై ప్రవర్తిల్లుతోంది.
10.నిద్ర అనేది బ్లాక్ హోల్ లాంటింది. తనతో సహా సర్వ ప్రపంచం అందులోకి వెళ్లి లయమై పోతోంది. తిరిగి మేలుకొన్నాక కనబడే ప్రపంచం, నిద్రలోకి వెళ్లేముందు ఉన్న ప్రపంచం మాత్రం కాదు. నిద్రపోయి, లేచిన ప్రతిసారీ నీవు చూచేది మరో క్రొత్త ప్రపంచాన్నే.
11.వ్యక్తిని తూస్తే ఎంత తూకమో వ్యక్తి + జగత్తు కూడా అంతే తూకం. వ్యక్తి + జగత్తు + ఈశ్వరుడు కూడా అంతే తూకం. ఈమూడు లేకపోయినా కూడా ఉండేది అంతే తూకం. ఈతూకమే దైవం 🙏
No comments:
Post a Comment