Saturday, July 27, 2024

**** శ్రీ రమణీయం - 36🌹 👌 సచ్చీలమే ధ్యాన సాధనకు అర్హత

 🌹 శ్రీ రమణీయం - 36🌹
👌 సచ్చీలమే ధ్యాన సాధనకు అర్హత👌
             ✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
నమో వేంకట రమణాయ, అద్వైత నిధయే నమః
✳️🌹🌹🌹🌹✳️🌻🌻🌻🌻✳️

✳️ సాధనలో ధ్యానప్రక్రియ అంటే... ఒకే తలపుతో ఉండటం. ఒకే విషయంపై చిత్తం (మనసు) ఉంచి ఇతర తలపులు (ఆలోచనలు) తీసేయడం. దేన్నైనా ధ్యానించాలంటే దానిపై ఇష్టం ఉండాలి. ప్రతిరోజు మనకి ఇష్టమైన విషయాలను ఎన్నింటినో ప్రయత్నం లేకుండానే ధ్యానిస్తూనే ఉంటాం. ఏ నామాన్ని జపించినా ఒకే తలపుపై మనసుని నిలిపేందుకే. మనసుని కలుషితం చేసే చెడు ఆలోచనలు మరుగున పడేందుకు ఇది ఉపకరిస్తుంది. మంత్రజపం వల్ల ఆలోచనల ఉధృతి తగ్గుతుంది. భగవంతునిపై ఇష్టంచేత హృదయంలో ప్రేమ జనించి ఆలోచనలు తగ్గుతాయి. సాధనలో ధ్యానప్రక్రియ ప్రారంభించగానే అనేక ఆలోచనలు వస్తాయి. ప్రాథమికంగా ఇది యుద్ధంలాగా ఉంటుంది. మన దృఢత్వంతో ఆలోచనలను జయించడం ధ్యానం అనుకోవడమే ఇందుకు కారణం.

✳️ ఆలోచనా శక్తి అనేక విషయాలతో చిందరవందర కావడమే మనోవిక్షేపం. ఈ విక్షేపం వల్లనే మనకు శాంతి, సుఖం, సంతోషం దూరమౌతున్నాయి. మనలో ప్రేమ లోపించడమే ఈ దుస్థితికి కారణం. మనసు ప్రవృత్తే మన ఆలోచనలకు కారణం. ప్రవృత్తి అంటే మనసు పోకడలు. దానికి కారణం మన జీవన విధానం. దాన్ని మార్చుకోవడం ద్వారానే ఈ యుద్ధంలో జయించగలిగేది. అప్పుడే దూరమౌతున్న సుఖశాంతులు తిరిగి పొందగలుగుతాం. 

✳️ ‘ప్రేమ’ అంటే ఒక వస్తువుపై ఇష్టం కాదు. సత్యాన్ని స్వీకరించడమే నిజమైన ప్రేమ. మనం తలపెట్టుకున్న పనులు కావడం లేదని నిత్యం అశాంతికి లోనౌతున్నాము. అసలు ఆ తలపులే (ఆలోచనలు) తగ్గించుకుంటే శాంతి ఎల్లప్పుడూ మనతోనే ఉంటుందని తెలుసుకోలేకపోతున్నాం. మనకి ఎన్ని ఆలోచనలు ఉంటే అంత దుఃఖం తప్పదు.

✳️ నిజానికి ధ్యానం అంటే బయటి నుండి దేన్ని ఆశించకపోవడం. ఈ సృష్టికి ఆధారభూతంగా ఉన్న దైవం మనలోనూ ఆత్మగా ఉన్నాడన్న సత్యం అనుభవంలోకి రావడం ధ్యానం. అంతేగానీ కోర్కెలు  తీరడంలేదని, పూజించే దేవతా మూర్తులను మారుస్తూ కళ్ళు మూసుకోవడం భక్తి అనిపించుకోదు. పూజించే దేవుడ్ని మార్చటంలో దైవం అంటే ఏమిటో తెలియని అజ్ఞానం దాగిఉంది. అందులో మన స్వార్థం వ్యక్తమౌతుంది. దైవాన్ని కూడా మనలాంటి సంకుచిత భావాలతోనే ఉహిస్తున్నాం. అలా ఆలోచించినా ఏదో ఒక రోజు తననీ ఇలానే వదిలేస్తావని మనం పట్టుకున్న కొత్త దేవుడికి మాత్రం తెలియదా. ధర్మాన్ని ఆచరిస్తే పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం దైవంగా మనతో ఉండి మన కోర్కెలు తీరుస్తుంది. ఈ సత్యాన్ని గుర్తించలేకనే దేవుడి విషయంలో కూడా అనేక రూపాలు తలపులు మారుస్తుంటాం.

✳️ మనం అనేక ఆలోచనల్లో ఉన్నందువల్లనే అశాంతి వస్తుంది. కనుకనే ఒకే ఆలోచనలో మనసును నిలిపి శాంతిని పోందాలని ఆరాటపడుతున్నాం. మన బాహ్య జీవితమంతా అనేక ఆలోచనలతోనే ఉంటుంది. కనుకనే దుఃఖం తప్పటం లేదు. అంతర్ ప్రయాణంలో ఆలోచనలు తగ్గుతున్నాయి కనుకనే దాన్ని ఇష్టపడుతున్నాం. అయితే ధ్యానానికి కూడా కొలతలు నిర్ణయిస్తే అది లౌకిక విషయంతో సమానమై అశాంతినే ఫలంగా ఇస్తుంది.

✳️ కేవలం ఏకాగ్రత కోసమే అయితే దేన్నైనా ధ్యానించవచ్చు కదా! రామనామాన్ని జపించాలని, రాముడ్ని ధ్యానించాలని ఎందుకు అనుకుంటున్నాం? మనం జపించే నామం పవిత్రతకు మారుపేరుగా ఉండాలి. అప్పుడే ఆ స్మరణవల్ల మన మనసు పవిత్రతను పొందుతుంది. ధ్యానించే రూపం సద్గుణాలను గుర్తుకు తెచ్చేదిగా ఉండాలి. అది ఉత్తమ సందేశాన్ని మనకు స్ఫురింప జేసేదిగా ఉండాలి. మన పూర్వీకులు అందించిన దేవతా మూర్తులంతా అలాంటివారే. హనుమంతుడు ఇప్పుడు దేహంతో మనికి కనిపించక పోయినా విశ్వచైతన్యంలో లీనమైఉన్న హనుమత్తత్వం మన ప్రార్థనని ఆలకించి స్పందిస్తుంది. ఎవరికైనా అనుకున్నవన్నీ జరగవు. ఒకవేళ జరిగినా అవి అనుకున్న సమయంలో జరగవు. కనుక నెరవేరిన వాటినే మనం అనుకుంటే సరిపోతుంది. నాకేం పర్వాలేదన్న నిశ్చింతను ఇచ్చేదే నిజమైన భక్తి. చింతను మిగిల్చేది భక్తి కాదు. అది స్వార్థం అవుతుంది. ఏ దేవతార్చన అయినా మనని ఈ విశ్వచైతన్యంలో లయం చేసుకుని ఆ ఆనందాన్ని మనకి అందించేందుకే. 

✳️ మన పూజ పారమార్థిక విషయాన్ని మరచిపోయి కేవలం లౌకిక కోర్కెలకే పరిమితమైతే అది ఫలవంతంకాదు. దీనివల్ల మనం పూజించే దైవాన్ని, గురువును కూడా ఏదో ఒకరోజు మన కోర్కెలు నెరవేరటంలేదని నిందించే దుస్థితిని మనకి కల్పిస్తుంది. అందుకే ఏ దైవాన్ని, గురువును ఆశ్రయించినా మనకి నిశ్చింతగా ఉండే స్థితి రావాలి. మన అజ్ఞానంతో చింతించే దుస్థితి రాకూడదు. ధ్యానం పేరుతో తలంపులను (ఆలోచనలను) నేరుగా అరికట్టలేనప్పుడు పెద్దలు ప్రాణాయామాన్ని మార్గంగా సూచించారు. మనం వేసే ఆసనం ఈ ప్రాణాయామానికి సహకరించేదిగా ఉండాలి. ఆ ప్రాణాయామం ధ్యానస్థితి కల్గించేదిగా ఉండాలి. మన ధ్యాసను శ్వాసపై ఉంచడం వల్ల మనసు ఆగుతుంది. ఆలోచనల ఉధృతి తగ్గుతుంది. కానీ సాధనలో అదే గమ్యం కాదు. ఆ తర్వాత విధించిన ప్రత్యాహార సమాధి స్థితులను మర్చిపోతే అది కేవలం వేడుక అవుతుంది. ఒక పనిలో లయమైన మనసు ఎక్కువ ఆలోచనలు చేయలేదు. లోకంపై ఉన్న మనసును తగ్గించడం ప్రత్యాహారం. దీనివల్ల మనసు బయటికి రావడం తగ్గుతుంది.

✳️ ప్రాణాయామమైనా, శ్వాసపై ధ్యాస అయినా, నామజపమైనా... మనసు అనే రథానికి వేసే కళ్లెం లాంటివి. అదే ప్రయాణం కాదు. అంతర్ ప్రయాణాన్ని సజావుగా సాగించే ఉపకారణాలు మాత్రమే. మనసుకు శీలం అలవర్చకుండా చేసే ధ్యాన ప్రయత్నం కేవలం యాంత్రిక ప్రక్రియ మాత్రమే. ధ్యానవిధానాలు ఎంత మంచివైనా మనకి సచ్ఛీలం అనే అర్హత అవసరం. మాట వినని పిల్లాడిని తల్లిదండ్రులు హాస్టల్‌కి పంపుతారు. నేరంచేసిన వ్యక్తిని చట్టం జైలుకు పంపుతుంది. ఇదంతా మనో ప్రవృత్తి మారటానికే. అలాగే ప్రతి సాధనా ప్రక్రియ మనలో సద్గుణాలను పెంచి శాంతిని అందించేందుకే. శాంతిని కాకుండా ఇతర ప్రలోభాలను ఎరగా చూపే సాధనా ప్రక్రియలు ఆధ్యాత్మికత అనిపించుకోవు.

✳️ మనం పుణ్యక్షేత్రాలు తిరిగేది కూడా ఆలోచనలు తగ్గించుకోడానికే. మనకి రోజూ ఉండే పనులు పుణ్యక్షేత్రాల్లో ఉండవు. కనుక ఆ పనులకు సంబంధించి అవసరమైన ఆలోచనలన్నీ తగ్గిపోతాయి. మన మనసుకు వ్యాపకాలు అలవాటయ్యాయి. అందుకే ఇతర ఊళ్ళకు వెళ్ళినప్పుడు కలిగే శాంతిని కూడా 'బోర్' (విసుగు) గా భావిస్తాం. పుణ్యక్షేత్రాల్లో ఉన్నప్పుడు మనకి ఆలోచనలు తగ్గినందువల్ల వచ్చే ఆనందాన్ని అనుభవించాలి. అక్కడకూడా ఎ.సి. గదుల కోసం, మంచి భోజనంకోసం వెతుక్కుంటే అది మన ఇంటితో సమానమే అవుతుంది.

✳️ ఒక అప్పు తీర్చేందుకు మరోక అప్పుచేస్తే అప్పిచ్చిన వాడు మారతాడుగానీ అప్పు మారదు. మనం భక్తిపేరుతో చేసే పనులు అలాంటివి కాకూడదు. మొక్కులు తప్పుకాదు. కానీ మన భక్తికి అవి మాత్రమే లక్ష్యం కాదు. వ్రతదీక్షలు మన కోర్కెలను ఆపటానికి ఆలంబనగా ఉండాలి. మనసును అదుపులో ఉంచేందుకు మాట్లాడకుండా ఉంటే అది మౌనవ్రతం అవుతుంది. మనసు చిందులు వేస్తుంటే పాటించే మౌనం నటన అవుతుంది. అలా మనసుని మౌనంగా ఉంచడం సామాన్యులకు అసాధ్యం కనుకనే మన పూర్వులు జపం అనే ఉత్తమ ప్రక్రియను మనకు అందించారు. మనసు నిజంగా మౌనం అయ్యేంతవరకూ సాధకుడికి మంత్రజపం సులువైన సాధన ప్రక్రియ. దీక్ష అంటే దుస్తులు మార్చడంకాదు. మనసుని మార్చడం. మనలో ఒకే ప్రాణం అనేక పనులు చేసినట్లుగానే ఒకే దైవం ఈ సృష్టిలో అనేక పనులుచేస్తుంది. కాలునొప్పికి ఒకమందు, చేతినొప్పికి ఒకమందు ఎలా అవసరం లేదో ఒక్కొక్క కోర్కెకు ఒక్కొక్క దైవం ఉండదు. సర్వరూపాలు తనవైన దైవం ఏరూపంలో పూజించినా సమంగానే అనుగ్రహిస్తుంది. సర్వదేవ నమస్కారం అంటే సర్వమూ తానైన దైవానికి నమస్కారం అని అర్థం. అసత్యం ఆడేవాడికి దైవం కనిపించడు. దైవం కనిపించినవాడు అసత్యం చెప్పడు. మన కోర్కెలే మనని సద్గుణాలనుండి దూరం చేస్తున్నాయి. అవకాశం ఉందన్న ఆశ మన ఆరాటానికి కారణంగా ఉంది. నిత్యజీవితంలో మనకి తప్పని ఈ ఆరాటాన్ని తగ్గించుకోడానికే దైవాన్ని ఆశ్రయించి అక్కడకూడా ఆరాటపడితే ప్రయోజనం లేదు.

🙏 సర్వే జనాః సుఖినోభవంతు
🚩 హిందువునని గర్వించు
🚩 హిందువుగా జీవించు

సేకరణ:
✳️🌹🌹🌹🌹✳️🌻🌻🌻🌻✳️

No comments:

Post a Comment